కోస్గి, జూలై 3 : దేశంలో అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఏకైక సీఎం రేవంత్‌రెడ్డి అని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోస్గి బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాటు అధికారంలో ఉండి రూ.2లక్షల 60 వేల కోట్లు అప్పు చేసి అభివృద్ధి చేస్తే రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అప్పు చేసి తెచ్చిన డబ్బులతో తెలంగాణలో నూతన మండలాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడంతోపాటు నూతనంగా అన్ని జిల్లాలకు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, మెడికల్ కళాశాలలు నిర్మించి రాష్ట్ర సంపదను పెంచారని గుర్తు చేశారు.
అదే విధంగా రైతులకు రైతుబంధు పేరుతో పెట్టుబడి సాయం అందించిన రైతు బాంధవుడు కేసీఆర్ అని, రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ రైతు కుటుంబానికి రూ.5లక్షల బీమా ఇచ్చి ఆ కుటుంబం వీధిన పడకుండా ఆదుకున్న ఆపద్బాంధువుడని పేర్కొన్నారు. మరి మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా రూ.నాలుగు లక్షల కోట్లతో ఏ అభివృద్ధి పనులు చేపట్టారని ప్రశ్నించారు. అభివృద్ధి పక్కన బెడితే రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చినా మూడు సార్లు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొంటింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి గ్యారెంటీలు, హామీలను అమలు చేయలేక కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. మీరు ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు అమలు చేసే వరకు మిమ్మల్ని విడిచిపెట్టేది లేదని, మీ వెంట పడతామని హెచ్చరించారు.
ఇక ఇదే కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయినప్పటి నుంచి రేవంత్ కేవలం అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతూ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. దీనిని కూడా ప్రజలు నమ్మకపోవడంతో ఇప్పుడు కొత్తగా టీవీలలో కూడా అబద్ధాన్ని నిజమనేలా చెబుతూ కొత్తగా ప్రచారం మొదలు పెట్టాడని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వమే స్వయానా ఆనాటి బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులపై స్పష్టంగా సమాధానం చెప్పినా అది మింగుడుపడని కాంగ్రెస్ మంత్రులు ఇలా చర్చల పేరుతో రచ్చ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
గురువారం ఉదయం అప్పులపై చర్చకు సిద్దమన్న ఓ సన్నాసి మంత్రి తెలంగాణ భవన్ వస్తామంటే తమ పార్టీ నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతో కలిసి వేచి చూసామని కాని సదరు మంత్రి ఓ వైపు చర్చలకు సిద్ధమంటూనే మా నేతల్ని తెలంగాణ భవన్ నుంచి బయటకు రాకుండా పోలీసులతో అడ్డుకున్న దద్దమ్మ ప్రభుత్వాన్ని ఏమనాలి అని ప్రశ్నించారు. మీ ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతూ పాలన కొనసాగిస్తున్నారే తప్పా చేసిన అభివృద్ధ్ది ఏమీ లేదన్నారు. ఆడపిల్లకు ఇచ్చే కల్యాణలక్ష్మిని కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన ఘనత మీ ప్రభుత్వానికే దక్కుతుం దని ఘాటుగా విమర్శించారు. పథకాలను పక్కన పెట్టి అభివృద్ధి మరిచి పాలన చేతకాని దద్దమ్మ ప్రభుత్వం మీది అని దుయ్యబట్టారు.
మా నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అడిగిన మీ ప్రభుత్వ స్కామ్‌లపై చర్చ చేసే దమ్ము లేకా తోక ముడిచిన మీకు పాలన చేసే అర్హత లేదు. మీకు నిజంగా ప్రజలపట్ల విశ్వాసం ఉంటే ముక్కు నేలకు రాసి మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మా నాయకులు మీరు ఎప్పుడు పిలిచినా చర్చలకు సిద్ధమని మీకు దమ్ముంటే పోలీసులు అడ్డుపెట్టి అరెస్టులు చేయించకుండా నాటకాలు ఆపి చర్చకు రావాలని మంత్రులకు సవాల్ విసిరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కోస్గి పట్టణ ఇన్చార్జి వెంకట్‌నర్సిములు, చెన్నారం సర్పంచ్ కృష్ణ, మాజీ వైస్ ఎంపీపీ సాయిలు, నాయకులు జనార్దన్‌రెడ్డి, బెజ్జు నీలప్ప, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్, నరేష్శ్యాదవ్, శ్రీశైలం, నారాయణ, శేఖర్, చెన్నయ్య, బిచ్చప్ప, బాలరాజు పాల్గొన్నారు.