యాదగిరి యాది
(1966లో శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో కాళోజీ చదవిన గేయం .. కొన్ని భాగాలు.)
(కాళోజీ వాళ్ల కులదైవం బీదర్లో ఉన్న ఝర్ణీ నరసింహస్వామి. ‘హేతువాద’ అనే పదబంధం మృత్యువాత అనే పదబంధాన్ని బట్టి ఏర్పరిచినది. కావు – కావు అంటే; రక్షించు అని అర్థం. లేవు అంటే నిలబడు అని; లేవు అని అర్థాలు.)
ప్రహ్లాదుని రక్షింపగ ప్రళయ భీకరాకారము
తొల్చి వచ్చి దనుజేశుని చీల్చినట్టి ‘ఆసామివి’ ఈనాడు
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పేర
వెలయుచున్న నీవేనా? ఆసామివి?
దేవస్థానం కమిటీ ‘సత్తఅమల్’ అధికారి
చేతనన్ను పిలువనంపి ‘నా గొడవ’ను వినగోరిన
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పేర
వెలయుచున్న నీవేనా? ఆ సామివి?
నీవేనా? నీవేనా? కాళోజీ వంశజులకు
కులదైవంబుగ వెలసి బీదరులో జలతలగడకడ
కొండసొరికె లోలోపల ‘వెన్నుచూపు’ దర్శనాల
వైభవాల తులతూగెడి ఝర్ణీ నరసింహుడవూ-నీవేనా?
నీ గుడినే కూలద్రోసి విజయగర్వ చిహ్నముగా
ఆ చోటనే ఆ రాళ్ళతో ‘అల్లా’ ఇల్లొకటి కట్టి
ఉంచిన వైరికి వీరము చూపకుండ బింకముతో
బీదరులో జలతలగడకడ కొండసొరికె లోలోపల
వెన్నుచూపు దర్శనాల వైభవాల తులతూగెడి
ఝర్ణీ నరసింహుడవూ నీవేనా?
***
నీ పేరున ఏనాడును ముడుపేదియు కట్టెరుగను
గట్టు చూసి చేతులెత్తి నిన్నెప్పుడు మ్రొక్కెరుగను
శిరము వంచి ఏనాడును వరమిమ్మని అడిగెరుగను
కనులు మూసుకొని మదిలో నిన్నెప్పుడు తలచెరగను
ఏదో విహారార్దంబని మిత్రులతో చేరి వచ్చి
ఒకటి రెండుసార్లు నిన్ను చూచుట జ్ఞాపకమున్నది
మాతో నీవు వేగలేక అడవిబట్టి ఏకాకిగ
గట్టునెక్కి నివసించుట సహజమెకద నరసింహుడ!
మేము నిన్ను వెన్నాడుచు గుంపులుగా దరిచేరుచు
నిను వీడక, నీ తోడుగ నివసింపగ నీవు మళ్లి
ఎక్కడనో మరోచోట చక్కి చూచుకొన్నావని
ఆనాడే నేనంటిని సాక్ష్యముగా గిరి ఉన్నది, విన్నది.
నీ నివాసమైతేమీ శ్రీనివాసమైతేమీ
మా నివాసముగ మారిన
మరు నిముసములో అయ్యది మట్టికి సైతము భారము
***
ఈనాటి దితిపుత్రులు అతి చతురులు!
నీ నామ సంకీర్తన చేయుటకును వెనుకాడరు!
నీ ఉనికిని సవాల్ చేసి తద్దినాన్ని కొనుక్కోరు,
నీ లక్ష్మీని వశపరుచక లోకమునే కొనివేతురు!
ప్రహ్లాదుడు భక్తితోడ పరవశుడై పాడుచుండ
ప్రక్కతాళ మేస్తారు, నిన్నూ నమ్మిస్తారు.
నాకేమో మళ్ళీ మళ్లొక్కసారి
ప్రహ్లాదుని రక్షింపగ ప్రళయ భీకరాకారము
తాల్చివచ్చి దనుజేశుని చీల్చినట్టి ఆ రూపము
చూడాలని బులుపున్నది.
***
గుండె బలముతో మెలిగెడి నరుడసలే మొండివాడు
వాని మొండిఘటము దాల్చి కాని దనుజేశుని చీల్చలేదు
సింగము తల మొండిఘటము చేరినకద నీ రూపము
ప్రళయ భీకరాకారము.
నరవృక, నరజంబుకాల జనకంటక ఒలగంబుల
బాధలకు తల్లడిలెడి జనమంతయు బండబారి
పండియుండిన నిన్నే ఆ దొరవనుకొని నిన్నే ఆదరువనుకొని
చేరి వచ్చి ముడుపు కట్టి ‘కావు కావు’ మనుచున్నది
బావురుమని నోరుతెరచి భోరున ఏడుస్తున్నది
గుండె పగిలిపోవునట్లు బండకరిగి పోవునట్లు
కరుణచింది పారునట్లు కరుడుగట్టుకొని పోయిన
నరసింహుడ! నీ వేమో అరయకుండ ఉన్నావు
హాయిగ కూర్చున్నావు.
ఈనాటి నీ వైనము జూచి హేతువాతనుబడి
‘గోరా’ ‘సురమౌళులు’ నిను ‘లేవు లేవు’ అనుచుండిరి
అందుకనే నాకేమో మళ్లీ మళ్లొక్కసారి
ఆనాటి నీ రూపము ప్రళయ భీకరాకారము
చూడవలెను అనెడి బులుపు!
– కాళోజీ
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

