- ఖరీఫ్ సీజన్ ప్రారంభం వేళ పాత రుణాలు మాఫీ చేయాలి
- కల్తీ విత్తన విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- ఐక్య రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహ కార్యదర్శి బానోతు ధర్మ డిమాండ్
జూలూరుపాడు, జూన్ 02 : రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు పచ్చిరొట్టె విత్తనాలతో పాటు, అన్ని రకాల పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా సహ కార్యదర్శి బానోతు ధర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ కమిటీ సమావేశం కామ్రేడ్ బైరి వెంకన్న అధ్యక్షతన మంగళవారం పడమట నరసాపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బానోతు ధర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. జిల్లాలో దళారి వ్యవస్థ విచ్చలవిడిగా పెరిగిపోయిందని, నకిలీ, కల్తీ విత్తనాలను విస్తృతంగా మార్కెట్లోకి సరఫరా చేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విత్తనాలు లభించక, ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని వాపోయారు.
పెట్టిన పెట్టుబడులు రాక, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు చివరకు ఆత్మహత్యల వైపు ఆలోచించే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కల్తీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం మోపాలని కోరారు.ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఉన్న పాత రుణాలను తక్షణమే మాఫీ చేయాలని, సాగు పెట్టుబడుల కోసం నూతన రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు వ్యవసాయ పనిముట్లను రాయితీ పై రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు లింగాల వీరభద్రం, తోటకూరి నరేష్, పారుపల్లి బాబురావు, అర్జున్ రావు, కె.పద్మ, పి.పద్మావతి పాల్గొన్నారు.