మట్టి చేలో తిరగాల్సిన పాదాలు
ఎరువుగోదాముల్లో ఇరుక్కుపోయాయి
మొక్కను తడమాల్సిన చేతులు
క్యూ లైన్లలో పిసుక్కునే పనిలో పడ్డాయి
చాలీచాలని ఎరువు దరువులు
రైతుల గుండెల్లో మార్మోగుతుంటే
ఆశలు వదులుకున్న
చిగురు చిన్నబోయింది
చెట్టు ఉసురు ఊరకే పోతుందా
పొద్దు ఎరుగక కాపు కాచినా
అరకొరగా బస్తాల
బరువు నెత్తిన కుంపటై
రాత్రి నిద్రను కూడా తరిమేస్తోంది
ఎన్ని ఏకరువులు
ఏకమై గగ్గోలు పెట్టినా
గోడ దాటి గోడు
ఆవలికి వెళితే ఒట్టు
కాళ్ళు నరాలు ఎంత లాగినా
ఒంటి స్తంభం లెక్కన
నిల్చోవడమే పనైంది
రైతు వస్తాడు ఎరువు తెస్తాడు
ప్రాణం నిలుపుతాడని
ఎన్నో ఆశలు పోగేసుకుంది పంట
నిర్లక్ష్యం కాటు వేసే స్థితి గతుల మధ్య
రైతు లోకం పడిగాపులు కాస్తోంది
కళ్ళకు ఒత్తులు వేసుకొని
ఎదురు చూస్తోంది
పోషకాలు కరువైన
పిప్పి పంటలే శరణ్యమా
దిగుబడి లేని పంట రాశుల
కింద నలిగిపోవడమేనా
ఒట్టి కడుపులు చేతబట్టుకొని
కాచుక్కూర్చోవడమేనా
ఎరువు తిప్పలు ఎన్నని చెప్పను
మొక్కను బ్రతికించుకోవడానికి
ఎన్నెన్ని బాధలో…
– నరెద్దుల రాజారెడ్డి 96660 16636
ఎడతెరపి లేకుండా
ఎడదలదరంగ రైతుల
పంట పొలాలపై
పిడుగుల జడివాన
అతివృష్టి, అనావృష్టి
రైతాంగ సేద్యాలకు
నష్ట నైవేద్యాలు
బీభత్స దృశ్యాలు
సకాలంలో అందని
యూరియాలు!?
పాలకుల ఉదాసీనత
గోడదెబ్బ చెంప
దెబ్బన్నట్లు
కొర్రిలతో కుదేలౌతున్న
హాలికులపై జాలిలేని
వానపోటు వెన్నుపోట్లకు
అతలాకుతలమైన
పంట పొలాలు
రైతన్నలకు ఎటు
చూసిన అంధకారమే
పాలుపోని వ్యథలే
ఆగు వర్షమా
సమయానుకూలంగా
వానలు చక్కగా
కురిస్తేనే కదా!
ప్రజలకు పట్టెడు కూడు
లేకుంటే
రాయచూరు ఫకీరు చిప్పె!
– డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచార్య 85558 99493
పంట పొలము నడిచొచ్చి
వరుసకట్టి ఎండుతున్నది.
ఏదయా! యూరియా!!
అడిగి అడిగి ఎండ
దగడు తాకినట్టు నోరెండే
ఆసరా లేక డొక్కలు గుంజి
వశము దప్పి మట్టికాళ్లు కుంగుతున్నవి
ఆశలన్నీ విత్తులేస్తే
అడుగులేసిన పైరు
కళ్ళతోనే ఎత్తుకొని
సంటి పిల్ల లెక్క బుజగరిస్తూ
సాకే మారాజు
గుండెలో బుగులు పుట్టే
బువ్వకే ఎసరొచ్చే
ఎవడు వినునో గోసనంతా
నాయకుడా? దైవమా? దేశమా?
కాపు కష్టం కాయలేని
ప్రభుత ఎందుకు?
కోడి పిల్లను గద్దలాగా
ఎత్తుకెళ్లే సూపుల
దళారీలు వాలిపోయే
చేతిలో చిల్లరెట్టి
గంపగుత్తగా అంతా ఊడ్చుకెళితే,
ఎవరికి చెప్పుకోను
దిక్కు తెలవక
దిగులుపడే దీనుడయ్యా
దన్ను లేక వెన్నెముక
ఒరుగుతున్న దయా
కూడుపెట్టే మనసు చల్లగా
కడుపు చల్లగా ఉండునా
కలుపులెరుగని పంట లొచ్చునా…
– గడ్డం సులోచన 77028 91559
ఇది ఒట్టి పాటే గాదు
తెలంగాణ గుండె చప్పుడు
అవకాశం కోసం
ఎదురుచూస్తున్న రణ నినాదం!
మాట తప్పిన ప్రతిసారి
మంత్రమైన జన తంత్రమై
డీజేల నెత్తిమీద ఊరేగే
సమరశంఖారావం!
నిమజ్జనం ఒక నెపం మాత్రమే
పల్లె పట్నం తేడా లేదు
సారే కావాలంటున్నరు
సారే రావాలంటున్నరు!!
సందర్భం ఏదైనా కావచ్చు
తుఫానై ఎగిసిపడే
యుద్ధగీతం దేఖ్ లేంగే!
తిరుగుబాటుకు పెద్ద కారణాలక్కర్లేదు
నేపాల్లో సోషల్ మీడియా నిషేధం
నిప్పులు వెదజల్లుతే
ఇక్కడ యూరియా బస్తా
ఉరితాళ్లు పేనవచ్చు
చరిత్ర ధర పెరిగిన
ఉల్లి చేసిన లొల్లి మరిచిపోలేదు!
ఉపద్రవాలకు
నిర్దిష్ట రూపాలుండవు
మేలుకోకపోతే పాటలు కూడా
సునామీలు సృష్టిస్తాయి!!
– కోట్ల వేంకటేశ్వర రెడ్డి 94402 33261