పగబట్టిండ్రు, పడగొట్టిండ్రు. పశ్చిమ బెంగాల్లో మమతా దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సర్కార్‌ను ఓడించి బీజేపీ అధికార పగ్గాలు చేజిక్కించుకోవటం గురించి చెప్పాలంటే ఈ రెండు మాటలు అతికినట్టుగా సరిపోతాయి. ఈ తతంగం ప్రాంతీయ శక్తులపై ఢిల్లీ సింహాసనం జరిపిన ముష్కర దండయాత్రలా కనిపించింది. ‘అరయంగా కర్ణుడీల్గె ఆర్గురి చేతన్’ అన్నట్టుగా బెంగాల్ టైగర్‌ను అన్నివైపుల నుంచి చుట్టుముట్టి, తీవ్ర దుష్ప్రచారం చేసి, ఎన్నికల బరిలో ఓడగొట్టారు. అయితే అంతటి తోనే బీజేపీ నాయకత్వం సంతృప్తి చెందలేదు. ముప్పయ్ ఏండ్ల కమ్యూనిస్టు కంచుకోటను బద్దలుకొట్టి మూడు విడతలు విజయవిహారం చేసిన దీదీ పార్టీ కొనసాగితే ఎప్పటికైనా ప్రమాదమేనని భావించి ఆ పార్టీని ముక్కలు ముక్కలు చేసి ఉనికి లేకుండా చేయాలనేది మోదీ అండ్ కో ప్రణాళిక. దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రూపంలో ముసలం ఒకటి టీఎంసీలో సిద్ధంగానే ఉన్నది. పార్టీలో అతడి ప్రాబల్యం మీద పెరిగిన అసమ్మతి ఇప్పుడు ఎన్నికల ఓటమి అదును చూసుకుని బుసలుకొడుతున్నది. ముందుగా టీఎంసీ ఎమ్మెల్యేల్లో చీలిక వచ్చింది. ఇపుడు ఎంపీల్లోనూ చీలిక వచ్చింది. ఇదే అదనుగా టీఎంసీలో అసమ్మతిని ఎగదోసి లబ్ధి పొందాలని బీజీపీ చూస్తున్నది. చీలిక వర్గాలు రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ స్పీకర్‌ను, కేంద్రంలో లోక్‌సభ స్పీకర్‌ను కలిసి బీజేపీ/ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నామని చెప్పడం ఈ బాగోతం వెనుక ఎవరున్నదీ బయటపెడుతున్నది.
లోక్‌సభలో గణాంకాల ప్రకారం బీజేపీ కొన్ని వివాదాస్పద బిల్లులు ఆమోదింపజేసుకోవాలంటే కూటమి ప్రస్తుత బలం సరిపోదు. పార్లమెంటులో అనుకున్నది సాధించాలంటే అదనపు సభ్యుల బలం కావాల్సిందే. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లు, మహిళా బిల్లుపై బీజేపీ మొండిగా ఉన్నది. పార్టీ బలం ఉన్న ఉత్తరాదిపై పట్టు బిగించేందుకు, మహిళల ఓట్లను రాబట్టుకునేందుకు ఈ రెండు బిల్లులను ఏదో విధంగా ఆమోదింప చేసుకోవా లని చూస్తున్నది. ఈ తరుణంలోనే స్వల్ప ఓట్ల తేడాతో భారీగా సీట్లు కోల్పోయిన తృణమూల్ పార్టీ బీజేపీ నాయకత్వానికి బలిపశువుగా దొరికింది. అనేక రాష్ర్టాల్లో పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన అనుభవంతో టీఎంసీలో అల్లకల్లోలం సృష్టించి ఆయారామ్ గయారామ్లను తనవైపు మళ్లించుకోవాలని ఆరాటపడుతున్నది. సహజంగానే ప్రాంతీయ పార్టీల్లో ఉన్న వెన్నెముక లేని నాయకుల నేతృత్వంలో నిన్నటిదాకా బద్ధశత్రువులా పోరాడిన పార్టీకి మద్దతు తెలిపేందుకు చీలికవర్గాలు పోటీ పడటం దేశ రాజకీయాల్లో విషాద పరిణామం.
2014లో 282 ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ 2019లో జరిగిన ఎన్నికల్లో 303 స్థానాలతో బలాన్ని ఇతోధికంగా పెంచుకున్నది. ఈ అప్రతిహత జైత్ర యాత్రకు 2024లో బ్రేక్ పడింది. బీజేపీ గ్రాఫ్ మెజారిటీ మార్కు (272) దిగువకు పడిపోయి 240కి పరిమితమైపోయింది. దాంతో బీహార్ సీఎం నితీశ్, ఏపీ సీఎం చంద్రబాబు మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అగత్యం ఏర్పడింది. ఇలా మిత్రపక్షాల మీద ఆధారపడితే వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చాల్సి వస్తుందనేది తెలిసిందే. ఇలా ఇతర పార్టీల మీద ఆధారపడటం బీజేపీ స్వభావానికి విరుద్ధం. ఈ తరుణంలో తృణమూల్‌లో ఫిరాయింపులు కలిసివస్తాయని చెప్పాల్సిన పనిలేదు. నితీశ్‌ను దారికి తెచ్చుకొని బీహార్‌లో బీజేపీ నేతను సీఎం గద్దెనెక్కించారు. ఇక మిగిలింది చంద్రబాబు. సొంత బలం పెంచుకొనేందుకు టీఎంసీ ఎంపీలను చీల్చేందుకు పావులు కదుపుతుండ టం బీజేపీ రాజకీయ నైతికతకు నిదర్శనం.