మా నీళ్లు మా నిధులు మా
కొలువులు మాకే దక్కాలంటు
అరవై ఏండ్ల మా కల నిజం కావాలంటు
విముక్తి రాగాలను ఆలపిస్తూ..
కొట్లాడి సాధించిన ఈ తెలంగాణ
కోట్లాది ప్రజలున్న నా తెలంగాణ
అమరవీరులను గన్న ఈ తెలంగాణ
ఆకుపచ్చని ఆకాంక్షల నా తెలంగాణ
సంస్కృతీ సంపదా విరిసింది ఇక్కడ
సహనమూ సమరమూ కలిసుండు ఇక్కడ
కవి గాయక హృదయాలు ఉప్పొంగునీనేల
కమనీయ కావ్యాలు ఒలికేటిదీనేల
యాసభాషల తెలుగు పలికేటి చోటు
ఉద్యమాలు ఊపిరిగ ఉరికేటి ఈ చోటు
కాకతి రుద్రమ్మ నడయాడిన ఈ నేల
కాళోజీ ధిక్కార ధార పారిన నేల
సమ్మక్క సారక్క తిరగాడిన ఈ చోటు
చిట్యాల ఐలమ్మ గళమెత్తిన చోటు
పసిడి నవ్వుల తంగేళ్ళు పూసేటి నేల
పాలపిట్ట పరుగుల్లు తీసేటి ఈ నేల
మన ఆశ మన శ్వాస మరవద్దు మనమంత!
మమత సమత మనదంటు సాగుదాము మనమంత!
ఆశయాల బాటలో నడుద్దాము మనమంత
ఆత్మగౌరవం తోటి బతుకుదాము మనమంతా!
– డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి, 98492 34725