కుంగింది ఎవరు? కూలింది ఎవరు?
అసత్యం వేయి గొంతులతో
విరుచుకుపడుతున్న వేళ
నిజాల నోళ్లు విప్పండి
మళ్లీ ఒకసారి చెప్పండి
కుంగింది కాంగ్రెస్
కూలింది అబద్ధాల కోటలు
మళ్లీ ఒకసారి చెప్పండి
కథ ఒడిసిన్దెవరిది?కాంగ్రెస్‌ది
తెలంగాణ మట్టి మీద ఆన
మేధావులూ…!
కట్టుకథలకు గంతలను విప్పి చెప్పండి
కాళేశ్వరం నీళ్లతో కాస్త
గొంతు తడుపుకొని చెప్పండి
పుండాకోరు మాటలు
పాలనకు గీటురాళ్లు కాదని
మేధావులూ
ఆకురాయి మీద గీసి చెప్పండి
కాళేశ్వరం పనికిరాదన్నారుగా!
మీ పనికిమాలిన మాటలను
కట్టకట్టి నిజాలని ఒప్పుకోండి
నిజం నిప్పుల కొలిమి.. అది కాలదు
నిజం సముద్రపు అల..అది మునుగదు
కాళేశ్వరం అంటే
మేడిగడ్డలో కుంగిన పిల్లర్ కాదు
మూడు బరాజ్‌లు
పందొమ్మిది పంపుహౌస్‌లు
ఇరవై రెండు లిఫ్ట్‌లు
ఇరవై రిజర్వాయర్లు
అది తెలంగాణ జల మంత్రం
కరువును దూరం చేసిన జల సూత్రం
బోధకునికి సాధకులు
చెబుతున్న సామాజిక పాఠాన్ని వినండి.
పిల్లర్ కుంగిందనే కిల్లర్ మాటలను ఆపండి
మీ కుట్రలు తెలిశాయి
అందరికీ తెలిసిపోయాయి
మీ ఉద్దేశపూర్వక తప్పిదాలను
చరిత్ర క్షమించదు
కాలము… క్షమించదు
ఈ పంటలను చంపిన
సస్య హంతకులను
క్షమించదుగాక క్షమించదు
మానవ నిర్మిత మహాద్భుతాలకు
గాయాలు లేవా?
గోదారమ్మ పొంగితే
పొరుగున పోలవరం
రెండుసార్లు కొట్టుకుపోలేదా?
మొన్నటికి మొన్న
ఎనభై వేల కోట్ల విలువైన
పచ్‌పద్ర క్రూడ్ డిస్టిలేషన్ రిఫైనరీ
ప్రారంభం కాకుండానే కాలిపోలేదా?
దీన్ని కాదంటారా? లేదంటారా?
నిపుణులు జర చెప్పండే
తెలంగాణ కన్నీళ్లను తుడిచిన
కాళేశ్వరాన్ని ఖతం చేసే శక్తి ఎవరికుంది?
సత్యాలు పోటెత్తినప్పుడు
అసత్యాలు కొట్టుకపోక తప్పదు
కాంగ్రెస్ కుటిలత్వాలు కాలిపోక తప్పదు
ఒక అడుగు తడబడ్డదని
దీర్ఘయాత్రను నిందిస్తారా?
మీది అబద్ధాల వేదిక
మీది అసత్యాల నాలుక
కాళేశ్వరం తెలంగాణ కంఠాభరణం
కోటి ఎకరాల మాగాణానికి జీవాధారం
ఎగువ భూముల గొంతు తడపడం కోసం
కరువు నేలల పైన
గంగమ్మను పారించడం కోసం
భగీరథ తపస్సులు చేసిన మహానేతకు
మీరెన్ని అబద్ధాల మాటలు అంటించినా
అతడెప్పటికీ నిజమై మళ్లీ నిలుస్తాడు
అతడు నిద్రలను లేపేవాడు
వలస నేలల్ని చూసి కలత చెందినవాడు
అతడు నీళ్ల కలలను కని
కాళేశ్వర కంఠాభరణమైనవాడు
అతడు ప్రతినపట్టి
పంతం నెగ్గించుకుని స్వరాష్ట్రం తెచ్చినాడు
కాళేశ్వరం నిజం
తెలంగాణ కన్నీళ్లను తుడిచింది నిజం
ఎగువ భూములనడగండి
నిజాలు నిర్భయంగా చెబుతాయి
కుట్రల గుట్టు విప్పుతాయి
కుతంత్రాలు ఎవరివో
న్యాయ దేవతే చెప్పింది
తల్లి స్తన్యం బిడ్డకందనప్పుడు
కేసీఆర్ పెట్టిన కేకే ‘జై తెలంగాణ’
కోటి ఎకరాల మాగాణానికి
కరువు నేలపైకి
గంగమ్మను మళ్లించిన కేసీఆర్ నిజం
కాళేశ్వరం నిజం
కాంగ్రెస్ పచ్చిగా అబద్ధం.
– జూలూరు గౌరీ శంకర్