తెలంగాణ మలిదశ ఉద్యమ నేపథ్యంగా వచ్చిన సాహిత్య ప్రక్రియలలో కవిత్వం ముఖ్యమైన ప్రక్రియ. స్పష్టమైన సందేశంతో మార్పును తెలిపే ‘ఆత్మగౌరవ’ ప్రక్రియగా ముందుకుసాగింది. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని జనానికి అర్థమయ్యే విధంగా, క్లిష్టమైన పదాలను తగ్గించి కవులు, కవయిత్రులు కవిత్వం రాశారు.
స్థానిక పదాలకు, నినాదాలకు అధికమైన ప్రాధాన్యం ఇస్తూనే.. ఆగ్రహం, నిరసన చైతన్యం, వ్యంగ్యం ఉద్యమ పిలుపు, సామాజిక, సాంస్కృతిక అవగాహన కలిగించే శబ్దతత్వం ఈ మలిదశ ఉద్యమ కవిత్వంలో వెలుగుచూసింది. ఈ సందర్భంలో తెలంగాణలో ఏ పల్లెను మందలించిన ఓ మాటై, పాటై, కథై, కవితై వెల్లువెత్తింది.
‘ఇక్కడ పోరాటం మాత్రమే
వారసత్వంగా వస్తున్న ఆస్తి’ – అన్న పసునూరి రవీందర్ (లడాయి, పుట. 22) మాటలు నిజం చేస్తూ ఈ పోకడ కొత్తగా కలం పట్టిన కవుల కలాలకు సానబెట్టింది. మేటి కవుల కలాల్ని మరింత పదునుపెట్టింది. ఈ కొత్త పాత ల కలయికను ఈ దశలోనే అధికంగా చూస్తాం. ఈ కాలంలో ప్రతి జిల్లా, పట్ట ణ, పల్లె ప్రాంతాల నుంచి ప్రచురించబడిన కవిత సంకలనాలే దీనికి తార్కా ణం. ఈ దశలోనే మునుపెన్నడూ చూడని కొత్త నెత్తురు పురుడు పోసుకొని వెచ్చని వాసనతో కవిత్వాన్ని విస్తృతంగా ఎగజల్లింది. తెలంగాణ తన సాంస్కృతిక వారసత్వాన్ని, పోరాటతత్వాన్ని కొత్తగా నిర్మించుకున్న పద్ధతిని ఇది ఆవిష్కరించింది.
ఈ మలిదశ ఉద్యమ కవిత్వం ‘శిరసు’ కవుల ఆత్మస్వరూపం (Soul-form) ‘నల్లవలస’ నుంచి మొదలై అసంఖ్యాకమైన ఉద్యమ కవిత్వానికి జీవం పోసింది. ఈ ‘నల్లవలస’ వేల మెదళ్లను తట్టిలేపింది. కొత్త నినాదాలతో ఏరులై పారింది. దీని తర్వాత దాదాపుగా 130 పై చిలుకు కవుల కవితలతో జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో తెచ్చిన ‘పొక్కిలి’ తెలంగాణ సాహిత్యంలో నూతన అధ్యాయానికి నాంది పలికింది.
ఇట్లా సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంపాదకత్వంలో ‘మత్తడి’, వేముగంటి మురళీకృష్ణ (సం) ‘మునుం’, సుంకర రమేశ్ ‘తెలంగాణ కవిత’, అనిశెట్టి రజిత (సం) ‘జిగర్’, క్విట్ తెలంగాణ, సుంకిరెడ్డి ‘దాలి’, అల్లం నారాయణ ‘యాది-మనాది’, నందిని సిధారెడ్డి ‘ఇక్కడి చెట్ల గాలి’, ‘నది పుట్టువడి’, అందెశ్రీ ‘నిప్పులవాగు’, అన్నవరం దేవేందర్ (సం) ‘వల్లుబండ’, ‘తొవ్వ’, తెరవే ‘గాయి’, ఎనిశెట్టి శంకర్ ‘సోయి’, వంగా గాలిరెడ్డి ‘కదం కదం’, డప్పోల్ల రమేష్ ‘మెతుకు సీమ’, దాసోజు జ్ఞానేశ్వర్ ‘రణగీతం’, వెంకట్ ‘వర్జి’, గ్యార యాదయ్య ‘ఎర్కోషి’, కాసుల ప్రతాపరెడ్డి ‘గుక్క’, బూర్ల వెంకటేశ్వర్లు ‘వాకిలి’, కందుకూరి శ్రీరాములు ‘తెలంగాణ రథం’, వరంగల్ రచయితలు సంఘం ‘ధోఖాంధ్రప్రదేశ్’, నలిమెల భాస్కర్ ‘ఉడాన్’ (తె.కవిత్వం హిందీలోకి అనువాదం) మొదలైన కవిత్వం చూడవచ్చు.
ఈ ఉద్యమ దశలో భాష ప్రధానమైన భూమిక పోషించింది. అత్యధికంగా తెలంగాణ తెలుగు పదాలు జీవం పోసుకొని కండ్లముందు కదులుతాయి.
సామాజిక, సాసంస్కృతిక పునాది గల తెలంగాణలో అత్యధిక సాహితీ సృజన మలిదశ ఉద్యమంలో జరిగిందంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో మరేయితర ఉద్యమంలో భాగంగా వచ్చిన సాహిత్యాన్ని ఇంతగా చూడలేము. భవిష్యత్తు పరిశోధకులు ఈ ఉద్యమ సాహిత్యాన్ని నిగ్గుతేల్చాలి.
– డాక్టర్ జీడి రమేశ్ 96527 56516