నిశ్శబ్దంలో నేను మునకేసానో
నిశ్శబ్దమే నన్ను కమ్మేసిందో
మౌనం నా చిరునామా అయి కూర్చుంది
మౌనమే నా ఆచ్ఛాదనా అయిపోయింది
నా లోపలి
ఒక్కో మాటా శబ్దాన్ని కోల్పోయి
ధ్వని రహితమైపోయింది
నేనో తీగ తెగిన సితారానైపోయాను
విన్నవీ కన్నవీ చదివినవీ మాటలన్నీ
నా లోపలెక్కడో తల్లడం మల్లడం అయ్యాయి
ఉబికుబికి రగిలి రగిలి
మనసులో భూకంపం పుట్టించాయి
బద్దలవుతానేమోనని భయమేసి
మాటలన్నింటిని మూటగట్టి
పుస్తకాల బీరువాలోకి విసిరేసాను
అప్పటికే బీరువాలో కొలువుదీరిన
టాగోర్, ఇలియట్, గురజాడ,
శ్రీశ్రీ, కాళోజీ, సచ్చిదానందన్
గుల్జార్, జయంత్ మహాపాత్ర,
వీ.వీ., శివారెడ్డి ఒకరేమిటి
అంతా మాటలకు
కళారూపమిచ్చిన అక్షర శిల్పులు
అందరినీ చూడగానే ఉలిక్కిపడ్డ
మూటలోని నా మాటలు
ఒక్కొక్కరినీ ఒక్కో పుటనీ
తరచి తరచి తెరిచి చూస్తూ
కదిలిపోయాయి కంపించిపోయాయి
ఆ మాటల్లో ఏదో విద్యుత్తు ప్రవహించింది
సొంత స్వరమే లేని ఆ మాటలు
గొంతు సవరించుకున్నాయి
మాటలన్నీ ఒక్కసారిగా మూటను బద్దలు కొట్టి
బీరువా అద్దాలను దాటి
ఆర్తిగా నన్ను చేరాయి
ఉక్కిరిబిక్కిరైన నేనేమో
ధ్వనిమయమైన మాటలకు
నా లోపలి యాతనను జోడించి
కాగితాలపైకి దించేసాను
అంతే నా మౌనం బద్దలైంది
నిశ్శబ్దం పటాపంచలైంది
కవిత్వం గొప్ప ఆలంబనైంది
నాకెంతో ఆసరైంది
వారాల ఆనంద్
94405 01281