కవిత్వం మనిషిని మృదువుగా పలకరిస్తుంది. కళాత్మక వ్యక్తీకరణను పరిచయం చేస్తుంది. జీవితాన్ని సౌందర్యీకరిస్తుంది. ప్రతి కవికీ ఓ పుట్టుక ఉంటుంది. తనదైన నేపథ్యం ఉంటుంది. జీవితానుభవ సంపద కవిత్వంలోకి తొంగి చూస్తుంది. సంకుచితమైన పరిధిని దాటి విశాలమైన జీవన ప్రాంగణాల్లోకి మనిషిని నడిపించాల్సిన బాధ్యత కవిత్వానిదే. కొత్త కవులు మంచి పరిణతిని, ఆరోగ్యప్రదమైన వాక్యాన్ని రాయాలనుకున్నప్పుడు తమ ముందుతరాన్ని తప్పకుండా చదవాలి. సాహిత్య క్షేత్రంలో అడుగుపెట్టిన తర్వాత మడికట్టుకొని కూర్చోకూడదు.
ఇప్పటివరకు సాహిత్యానికి సంబంధించి తర్వాత తరాన్ని తయారుచేసుకునే విషయంలో రచయితలు కూడా వెనుకబడ్డారు. ఇప్పటికీ చాలామంది రచయితలు తమ సాహిత్యం గురించి వ్యాసా లు రాయాలని, అసలు నన్ను ఎవరు గుర్తించడం లేద ని, అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందని వాపోతుంటారు. సాహిత్యంలో కవిత్వం పరిధి చాలా చిన్నది. కవిత్వాన్ని ఆస్వాదించేవాళ్లు, చదివేవాళ్ల గ్రాఫ్ 21వ శతాబ్దం నుంచి బాగా పడిపోయింది. దీనికి చాలా కారణాలున్నాయి.
తమ రచనల ద్వారా శాంతిని, విశాల దృక్పథాన్ని ఆశించే రచయితలే కుంచించుకోవడం, ఒక కవి అంటే మరో కవికి పడకపోవడం ఇట్లాంటివి ఎలాంటి సందేశాలిస్తాయో తెలియంది కాదు. ఎవరో గుర్తించడం కోసం, అవార్డుల కోసం కవి త్వ రచన చేసినప్పుడు తప్పకుండా అసంతృప్తి పేరుకుపోతుంది. ఆత్మ సంతృప్తి కోసం అనే మాట భారంగానైనా ఒప్పుకోక తప్పదు. మన రచన ముందు మన హృదయాన్ని తాకినప్పుడు, మనం ఏమైతే రాశామో అది మనలను కదిలించగలిగినప్పుడు అంతకుమించిన ఆనందం ఏముంటుంది?
అనేక సభల్లో పాల్గొన్న అనుభవంతో ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒకానొక సభలో ఒక రచయిత ‘వా డు వేదిక మీద ఉంటే నేను వేదిక ఎక్కను’ అన్నాడు. ఇద్దరూ పెద్ద రచయితలే. నేను విస్తుపోయాను. అలాగే వ్యాసాలు రాస్తున్న సందర్భంలో ‘ఆ కవి గురించి కూడా వ్యాసం రాశావా, వాడి వ్యక్తిగత జీవితం నీకు తెలుసా’ అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
నేటి కవులు తమ ముందు తరం కవులను ఎంతమాత్రం చదివారో బేరీజు వేసుకోవాలి. ముందు తరం
రచయితలు ఇప్పుడు ఈ తరం రచయితలను ఏమన్నా చదువుతున్నారేమో ఆలోచించుకోవాలి. ప్రతి తరంలోనూ సమూహాలుంటాయి. అయితే, ఈ సమూహాలన్నీ సాహిత్యాన్ని తర్వాత తరానికి అందించే ప్రయత్నంలో విఫలమవుతున్నాయి. ఇప్పటికీ ఏడాది కాలంలో పదుల సంఖ్యలో కవిత్వ సంపుటాలు వస్తున్నప్పటికీ, ఆ కవిత్వం ఎంతమందికి చేరుతుంది. ప్రసారమవుతుందా, ప్రచారం జరుగుతుందా అంటే చాలా తక్కువే.
సాహిత్యాన్ని యువత వద్దకు లేదా పాఠశాల స్థాయికి తీసుకువెళ్లాలంటే రచయితలుగా మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి. సొంతంగా పది వాక్యాలు కూడా రాయలేని తరం ఒకటి ఇప్పుడు నడుస్తున్నది. అందుకే భవిష్యత్తు తరాలకు సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచేందుకు గాను కవులుగా మనం ఏం చేయాలో ఆలోచించాలి.
సాహిత్యవేత్తల వ్యక్తిగత జీవితాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు. ఒక కవిగా, మరో కవి వాక్యం నన్ను ఆకర్షిస్తే, ఆ కవిత్వంలోకి నేను హాయిగా వెళ్లగలిగితే, ఆ కవిత్వాన్ని, ఆ కవిని ఇష్టపడతాను. అతని వ్యక్తిగత జీవితం వైపు తొంగి చూడ్డానికి నాకు ఎలాంటి హక్కు లేదు. అతను ఫలానా ఆఫీసులో పని చేస్తాడు, లేదా అతను ఫలానా వీధిలో ఉం టాడు. అనుకొని ఆ ఆఫీసులోకి, అతని ఇంట్లోకి తొం గిచూసి వ్యాసాలు రాయలేం. ఈ లోకాన్ని వదిలివెళ్లి న శ్రీశ్రీ గురించి, చలం గురించి, తిలక్ గురించి ఇక ఇట్లాంటి రచయితల మీద అప్పుడప్పుడు ఏవో రాసి వాద ప్రతి వాదనలు దిగడం కూడా మనం చూస్తుంటాం.
అయితే, అట్లాంటి వాదనలకు శ్రీశ్రీ గానీ, చలం గాని, తిలక్ గాని వచ్చి సమాధానాలు ఇవ్వలేరు. ఆయా కాలాల్లో వారు రచనలు చేసి ఉంటారు. అప్ప టి పరిస్థితులు, ఆ సమాజం గురించి కొద్దో, గొప్పో ప్రభావమై ఉంటారు. చనిపోయినవారి సాహిత్యం గురించి ఇప్పుడు చర్చలు చేసి, మనం కొత్తగా ఏం నిర్ధారిస్తాం? ఒకవేళ వారి సాహిత్యంలో ఆ కాలపు విమర్శకులు చూడలేని, చెప్పలేని విషయాన్ని పాజిటివ్‌గా చెప్తే కచ్చితంగా మనం స్వీకరించవచ్చు. అసలు మన ముందు లేని వారి సాహిత్యం గురించి చర్చించుకొని మనలో మనం వర్గాలుగా విడిపోవడం కూ డా సమంజసం కాదు. మార్క్సిస్టు రచయితలు సం ప్రదాయ రచయితను కూడా చదవాలి. సంప్రదాయ రచయితలు మార్క్సిస్టు రచయితను కూడా చదవాలి. అస్తిత్వ ఉద్యమాలను గౌరవించాలి. అన్ని పవనాలను ఆహ్వానించాలి. సమాజాన్ని వెనుకకు నడిపించడం, భావోద్వేగాలను అనవసరంగా రెచ్చగొట్టడం లాంటి రచనలను ప్రేమించాల్సిన అవసరం లేదు.
అప్పుడప్పుడు చిన్నచిన్న వర్క్‌షాప్‌లు నిర్వహించుకోవాలి. ఇట్లాంటి కార్యాచరణను రూపొందించుకోవడానికి ముందు రచయితలు అంతా ఏకం కావాలి. మనం ఏ దృక్పథానికి చెందిన రచయిత అయినా పర్వాలేదు, ముందు సాహిత్యం పట్ల ఆసక్తిని, దాని విలువను తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. సాహిత్యం జీవితాన్ని ఉన్నతీకరుస్తుంది, వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుందని సభల్లో సమావేశాల్లో చెప్పే మనం ముఠాలుగా విడిపోవడం ఎలాంటి సందేశాన్నిస్తుం ది? అవార్డులు రాలేదని బాధపడ టం, దిగులు చెందడం, ఫలానా న్యాయనిర్ణేత నాకు అన్యాయం చేశాడనడం.. ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేయాలి. అవార్డుల కోసం, గుర్తింపుల కోసం రచన చేస్తే అట్లాంటి రచన అత్యంత త్వర గా మరుగున పడిపోతుంది.
ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం, సాహిత్యాన్ని తర్వాత తరానికి అందించడం అని నమ్మేవాళ్లు ఏకం కావాలి. రచయితలంతా ఏకమై తరచుగా విద్యాలయాలను సందర్శించడం, కనీసం బతిమాలైన ఒక గంట పాటు అరువు తీసుకోవడం, ఆ గంటను చైతన్యవంతంగా, సమర్థవంతంగా వినియోగించుకోవడం పట్ల ఆలోచించాలి. ఉపాధ్యాయులను బృందాలుగా కలుపుకొని సాహిత్యాన్ని ఒక ఐదు నిమిషాలు పాఠశాలలో పరిచయం చేయమని బతిమిలాడాలి. కవు లు, రచయితలు వేలకు వేలు పెట్టి ముద్రించుకున్న పుస్తకాలు సరైన చోటుకి చేరడం లేదు. జిల్లా రచయితల సంఘాలు బలపడాలి. మంచి వాతావరణంలో నెలకు ఒక్క కార్యక్రమమైనా జరుపుకోవాలి. ఎక్కడికి వీలైతే అక్కడికి మనమే వెళ్లిపోవాలి.
ఆదివారం అపార్ట్మెంట్లో ఉండే అమ్మలందరినీ ఒప్పించి, కాసేపు సాహిత్య రుచిని చూపించాలి. అమ్మలు కచ్చితంగా పిల్లల దగ్గరికి ఆ కథను, కవితను చేరవేస్తారు. మహి ళా సంఘాల సమావేశాల్లోనూ కవులు పాల్గొనాలి. సాహిత్యం ముఖ్యంగా కవిత్వం పాఠకుల నుంచి కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. కవులరా మనం ఇకనైనా మేల్కోవాలి. దగ్గరలు, దూరా లు తగ్గించుకోవాలి. కవిత్వం అంతఃసంస్కారం అని చెప్పితీరాలి. అంటే, మన నుంచే ప్రారంభం కావాలి. ప్రసారం, ప్రచారం మీద దృష్టిపెట్టాలి. రేపటి తరం కోసం మనమే ముందుకుపోక తప్పదు.
– డాక్టర్ సుంకర గోపాల్ 94926 38547