తెలంగాణ వైతాళికులనదగిన సాంస్కృతిక శిఖరాల్లో బహుశా ముందుగా ప్రస్తావించుకోవలసిన పేరు ‘ఆంధ్ర పితామ మహ’ మాడపాటి హనుమంతరావు గారిది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోనే కాక, రాజకీయాల్లో కూడా ఉన్నత ప్రమాణాలను నెలకొల్పిన నేతగా మాడపాటి సుప్రసిద్ధులు.
తెలుగు సరే వారి మాతృభాషే కనక, చెప్పుకునే పనే లేదు! ఆ కాలపు చదువుకున్న తెలుగు వారికి ముఖ్యంగా జాతీయభావాలు కలిగిన కుటుంబ నేపథ్యం వున్నవారికి కొద్దోగొప్పో సంస్కృత భాషాసాహిత్యాలతో పరిచయం ఉండేది. ఆ మేరకు మాడపాటికీ సంస్కృతంలో ప్రవేశం కద్దు. అప్పటికే సాంస్కృతిక బహుళత్వానికి నెలవుగా మారిన హైదరాబాద్ నగరంలో చదువుకుని, స్థిరపడిన మాడపాటికి ఇంగ్లిష్, ఉర్దూ భాషాసాహిత్యాలతో లోతైన పరిచయం ఉండటంలో వింతేముంది? అలనాటి నైజాం ప్రాంతంలో అరవై లక్షల మంది జనం మాట్లాడే మరాఠీలోనూ, నలభై లక్షల మంది ప్రజలు మాట్లాడే కన్నడంలోనూ కూడా వారికి ఒకింత ప్రవేశం ఉండేదేమో! వాస్తవానికి ఇవన్నీ మాడపాటికే ప్రత్యేకమైన విశిష్టతలు కావు. స్వతంత్ర దేశంగా తర్ఫీదవుతున్న భారతదేశంలోని ఆధునిక అభ్యుదయ భావాలున్న మధ్యతరగతి బుద్ధిజీవులకు ఇవన్నీ సామాన్య గుణాలే! ముఖ్యంగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కృషిచేసే వారికి సంబంధించినంత వరకూ విస్తృత ప్రగతిశీల చింతనలో భాగమైనవే ఈ లక్షణాలన్నీ.
‘విభజించి పాలించడ’ మనే వ్యూహ రచనలో భాగంగా ఆనాటి పాలకవర్గాలు ప్రచారం చేసిన పరస్పర అసహన సంస్కృతి పుణ్యమాని, ఈ మూడు భాషల వారి మధ్య విభేదాలు తలెత్తేంత వరకూ, అన్ని భాషావర్గాల వారికి ఈ మూడు భాషల్లోనూ ‘వ్యావహారిక పరిజ్ఞానం’ ఉండేది.
‘తెలంగాణలో తెలుగు భాషకు గౌరవస్థానాన్ని కలిగించి, తెలుగువారికి తెలుగు భాషను నేర్పించిన ఘనత మాడపాటిదే’ నన్నారు తెలంగాణ ప్రజానాయకుడు రావి నారాయణరెడ్డి. తనబోటి యువకులనెందరినో మాడపాటి ప్రభావితులను చేశారని కూడా ఆరెన్ అన్నమాట గమనార్హం. నాటికీ నేటికీ తెలుగు ప్రజల హృదయపీఠాలను అధిష్ఠించివుండిన భాగ్యరెడ్డి వర్మ, బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి తదితరులు మాడపాటితో సత్సంబంధాలు కలిగివుండేవారు. వారందరూ, అటు రాజకీయవేత్తలుగానూ, ఇటు సాంస్కృతికరంగ ప్రముఖులుగానూ, సంఘసంస్కర్తలుగానూ బహుపాత్రాభినయం చేసినవారే. సాహిత్యరంంలో వారు చేసిన కృషి ప్రత్యేకించి ప్రస్తావించుకోవలసినది.
తెలుగు కథానికను ప్రబోధాత్మకత, సందేశాత్మకత అనే తప్పటడుగుల దశను దాటించి, మనోధర్మ విశ్లేషణ దిశగా నడిపిస్తూ, మాడపాటి 1912లోనే, ‘హృదయశల్యము’ అనే కథానిక రాశారు. ఆయన మరో డజను కథలు రాసినప్పటికీ, ఈ కథకు ప్రత్యేక ప్రాధాన్యం ప్రాచుర్యం దక్కడానికి కొన్ని కారణాలున్నాయి.
వాచ్యంగా ఎక్కడా చెప్పకపోయినా, ఇది గ్రామీణ కుటుంబ జీవిత నేపథ్యంతో రాసిన కథానిక కాదు! ఆధునిక సంస్కారం, దానిలో అవిభాజ్య భాగమైన స్త్రీ ఆత్మగౌరవం ఈ కథానికకు పూర్వరంగం. అత్యంత నాటకీయమైన పరిస్థితుల్లో, ఓ భర్త మనసులో తలెత్తిన అనుమానం, భార్య గుండెల్లో బాణంలా దిగబడి బాధపెట్టడమే ఈ కథానిక ఇతివృత్తం. అనుమానం తలెత్తడానికి కారణమైన వ్యక్తి ద్వారానే, అది తొలగిపోయేలా చెయ్యడం ఈ కథానికలోని నాటకీయ అంశం. ఇది పదమూడో శతాబ్దంలో, ఏదో కులీన కుటుంబంలో జరిగినట్లు రచయిత చిత్రించినప్పటికీ, అది సమకాలికులైన మధ్యతరగతి పాఠకులను ఉద్దేశించి రాసినదేనని అనిపిస్తుంది. అదే ఈ రచనలోని ఔచిత్యం కూడా. మిగతా విషయాల్లో ఇదీ సాదాసీదా కథానికే! ఆనాటి ప్రమాణాల మేరకు ఇది శిల్పసంపన్నమని చెప్పాలి. 1885లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం నేపథ్యంలో పుట్టుకొచ్చిన సంస్థ కాంగ్రెస్; జాతిజీవనంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పులను చూస్తూ పెరిగిన రచయిత దానికి తోబుట్టువుగా పుట్టిన మాడపాటి. (కాంగ్రెస్ స్థాపన, మాడపాటి పుట్టుక ఒకే సంవత్సరం జరిగాయి!) 1905-11 మధ్యకాలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన స్వదేశీ ఉద్యమంలో చదువుకున్న భారతీయ మహిళలు తొలిసారి పాల్గొన్నారు. ఆ ఉద్యమం చల్లబడే నాటికి మాడపాటి పాతికేండ్లు నిండిన యువకుడు. ఆయన స్వయంగా చూసిన లేదా విన్న సంఘటనలే ‘హృదయశల్యము’ కథానికకు ఇతివృత్తంగా తీసుకుని ఉండవచ్చుననిపిస్తుంది. తర్వాతి రోజుల్లో కొడవటిగంటి కుటుంబరావు ప్రతిపాదించిన ‘వాస్తవ జీవితం-జీవిత వాస్తవం’ సిద్ధాంతాన్ని అనువర్తింపచేసి చూస్తే, భార్యను అనుమానించిన భర్తలో మార్పు వచ్చినట్లు రాయడం ఆధునిక రచయితగా మాడపాటి కర్తవ్యం. దాన్నే ఆయన నెరవేర్చాడు.
ఈ కథానికకు చారిత్రకంగా ఉన్న మరో ప్రాముఖ్యమేమిటంటే, మధ్యతరతి తెలుగాడపడుచులు విద్య, ఉపాధిలాంటి విషయాల్లో ఎంత ముందడుగు వేసినా, మగపురుగుల ఆలోచనల్లో పెద్దగా మార్పు వచ్చినట్లు తోచదు. అలా, మాడపాటి కథానిక ప్రాసంగికత చెక్కుచెదరలేదనే చెప్పాలి! ఇది మాడపాటి రాసిన ఇతర కథానికలకూ వర్తిస్తుంది. నూరేండ్లకు పైగా మాడపాటి కళాఖండాలు నిలిచివున్నందుకు గర్వించాలో, రచయిత ఏ సమస్య విషయంలో ఆవేదనతో ఆ కథానికలు రాశాడో దాని తీవ్రత తగ్గిందేమో గానీ, పరిస్థితిలో రావలసినంత మార్పు రానందుకు చింతించాలో పాఠకులే తేల్చుకోవాలి!