Iron Tablets | ఐరన్ ట్యాబ్లెట్లను వాడుతున్నారా.. అయితే ఈ సూచనలను పాటించాల్సిందే..
దేశంలో రక్తహీనత (అనీమియా) ఇప్పటికీ ప్రధాన ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. శరీరానికి అవసరమైన ఇనుము (ఐరన్) లోపించడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది.
Iron Tablets | దేశంలో రక్తహీనత (అనీమియా) ఇప్పటికీ ప్రధాన ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. శరీరానికి అవసరమైన ఇనుము (ఐరన్) లోపించడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. అయితే ఐరన్ లోపాన్ని భర్తీ చేసేందుకు చాలా మంది ఐరన్ ట్యాబ్లెట్లను తీసుకుంటున్నప్పటికీ, వాటిని సరైన పద్ధతిలో తీసుకోకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐరన్ శరీర ఎదుగుదల, అభివృద్ధికి అత్యంత అవసరమైన ఖనిజం. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే కండరాల్లో ఆక్సిజన్‌ను నిల్వ చేసే మయోగ్లోబిన్, కొన్ని హార్మోన్ల ఉత్పత్తికి కూడా ఐరన్ అవసరం. అందువల్ల ఐరన్ లోపం ఉంటే వైద్యుల సలహా మేరకు ఐరన్ అధికంగా ఉండే ఆహారంతోపాటు సప్లిమెంట్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
ఎప్పుడు తీసుకోవాలి..
అయితే ఐరన్ ట్యాబ్లెట్లను ఎప్పుడు, ఎలా తీసుకోవాలన్నది కూడా చాలా ముఖ్యం. నిపుణుల సూచనల ప్రకారం ఐరన్ ట్యాబ్లెట్లను ఉదయం పరగడుపున తీసుకోవడం ఉత్తమం. చాలామంది రోజూ తీసుకుంటే త్వరగా హిమోగ్లోబిన్ పెరుగుతుందని భావిస్తారు. కానీ కొన్ని పరిశోధనల ప్రకారం ప్రత్యామ్నాయ రోజుల్లో (ఒక రోజు విడిచి ఒక రోజు) తీసుకోవడం వల్ల శరీరం ఐరన్‌ను మరింత సమర్థవంతంగా గ్రహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఐరన్ సప్లిమెంట్లతోపాటు విటమిన్-సి తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. నారింజ రసం లేదా నిమ్మరసం వంటి విటమిన్-సి పానీయాలతో ఐరన్ ట్యాబ్లెట్లను తీసుకుంటే శరీరంలో ఐరన్ శోషణ మెరుగుపడుతుంది. దీంతో ఐరన్ స్థాయిలు పెరగడంలో సహాయపడుతుంది.
వీటితో కలిపి వద్దు..
అదే సమయంలో కొన్ని పదార్థాలతో కలిసి ఐరన్ ట్యాబ్లెట్లను తీసుకోవడం మానుకోవాలి. ముఖ్యంగా టీ, కాఫీ, కాల్షియం సప్లిమెంట్లతో ఐరన్ ట్యాబ్లెట్లను తీసుకుంటే ఐరన్ శోషణ తగ్గే అవకాశం ఉంటుంది. టీలో ఉండే టానిన్లు, కాఫీలోని కెఫిన్, కాల్షియం వంటి పదార్థాలు శరీరం ఐరన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవడం ప్రారంభించిన తర్వాత కొద్ది రోజుల్లోనే హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి. అయితే శరీరంలోని ఐరన్ నిల్వలు పూర్తిగా పునరుద్ధరించబడటానికి మరింత సమయం అవసరం అవుతుంది. అందుకే ఐరన్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చినా వైద్యుల సూచన మేరకు కనీసం మూడు నుంచి ఆరు నెలల పాటు సప్లిమెంట్లను కొనసాగించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపాన్ని సరిచేయడంలో ట్యాబ్లెట్లు మాత్రమే కాకుండా సరైన పద్ధతిలో వాటిని తీసుకోవడం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పరగడుపున తీసుకోవడం, విటమిన్-సితో కలిపి వాడడం, టీ-కాఫీకి దూరంగా ఉండడం, చికిత్సను మధ్యలో ఆపకుండా కొనసాగించడం వంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తే రక్తహీనత నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

