MLC elections : బిహార్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలకు ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలతోపాటు బిహార్‌లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నలుగురు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో బిహార్‌కు చెందిన సినీ పరిశ్రమ భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ కూడా ఉన్నారు. ఆయనను బీజేపీ ఎన్నికల బరిలో దింపింది.
ఆయనతోపాటు డా.సంజయ్ మయూఖ్, అనిల్ కుమార్ ఠాకూర్, షీలా పండిట్లను అభ్యర్థులుగా ప్రకటించింది. వీరిలో సంజయ్ మయూఖ్ ఇప్పటికే కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇది వరకు రెండుసార్లు ఆయన విజయం సాధించారు. బిహార్‌లో తొమ్మిది సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం బిహార్‌లో బీజేపీ, జేడీయూ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జేడీయూ కూడా ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇందులో బిహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ కూడా ఉన్నారు. ఆయన పాట్నా జిల్లా నుంచి జేడీయూ తరఫున పోటీ చేయనున్నారు.
వీరితోపాటు భరతి మెహతా మధుబని స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే, వెస్ట్ చంపారన్ స్థానం నుంచి శివాని దేవి ప్రజాపతి పోటీ చేయనున్నారు. ఈ ముగ్గురిలో నితీష్ తనయుడు నిశాంత్ బిహార్ క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. నితీష్తన సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన తనయుడికి క్యాబినెట్ మంత్రి పదవి దక్కింది. ప్రస్తుతం ఆయన అక్కడ వైద్యారోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి అసెంబ్లీలో బలం ఉండటంతో బీజేపీ, జేడీయూ అభ్యర్థుల విజయం ఖాయంగా కనిపిస్తోంది.