చండీగఢ్: పొలాల్లోని మోటార్లను దొంగలు చోరీ చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో మోటార్లను కాపాడుకునేందుకు క్యూఆర్ కోడ్ ద్వారా దొంగలకు డబ్బు చెల్లిస్తామని రైతులు వేడుకుంటున్నారు. (Motors Thieves) పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తమ పొలాల్లోని వ్యవసాయ మోటార్లు చోరీ కావడంపై పాఖీ కలాన్ గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల కిందట ఒక్క రాత్రిలోనే పొలాల నుంచి సుమారు 15 మోటార్లు చోరీ అయ్యాయి. తాజాగా మళ్లీ సుమారు 25 మోటార్లు దొంగతనానికి గురయ్యాయి.
కాగా, మోటార్ల చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆ గ్రామ రైతులు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. తమ పొలాల్లోని మోటార్లను దొంగించవద్దని, దానికి బదులుగా క్యూఆర్ కోడ్ డిజిటల్ పేమెంట్ స్కానర్ ద్వారా డబ్బులు తీసుకోవాలని దొంగలను కోరారు. ఈ మేరకు తమ పొలాల వద్ద ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.