‘రెండు స్మార్ట్ ఫోన్లివ్వండి..’
‘ఒకేసారి రెండేందుకు సార్..’
‘ఒకటి కొడుక్కు మరొకటి కూతురుకు!’
‘అతడు ఆయుధాల్లా వాటిని వెదుకుతూండగా
తండ్రి అన్నాడు..
‘ఒకరు ఇంజనీరింగ్..
మరొకరు ఎంబీఏ.. ఆన్లైన్ పాఠాలు’
మొత్తం ఇరవై రెండున్నర వేలు..
‘జాగ్రత్త సర్.. పిల్లలు’
అన్నీ ఐదువందల మోదీ నోట్లు ఇస్తూ..
‘ఎందుకట అంత జాగ్రత్త’ అన్నాడతను
‘దేవుడే రక్షించాలె పిల్లల్ని’
‘అదే ఎందుకు.. వై?’
అతని ముఖంనిండా కల్లోల సముద్రం
‘ముజాహిద్దీన్లకు రాకెట్ గన్లనిస్తున్నారు మరి’
ఆ తండ్రి షాప్ బయటికొచ్చి తలెత్తి చూశాడు
ఎదురుగా యాభై రెండు ఫీట్ల
సినిమా హీరోయిన్ హోర్డింగ్ కడ్తున్నారు
కన్ను గీటుతూ ముఖం.. అర్ధనగ్న ఆర్భాటం
ప్రక్కనున్న టీవీ షాప్ బయట ఫిఫ్టీ ఫైవించ్ టీవీ డిస్ప్ల్లేలో
ఒక రాజకీయ నాయకుడి అరుపులు..
‘మనుషులు మాట్లాడే బూతు భాష
నియంత్రణకు చట్టాలు చేయాలె’
ఎవరో ముసలి జస్టిస్ నిరర్థక గోల
‘నడివీధిలో పద్దెనిమిది మంది మహిళలను
తాలిబాన్ల బహిరంగ కాల్చివేత’- స్క్రోలింగ్
ఉల్లంఘన.. ఉల్లంఘన..
అరిచి కరిచి చరిచి.. ఒళ్ళు మరిచి
రాజ్యాంగ ప్రతులను మంటల్లో కాల్చివేస్తూ కేకలు
బ్లేడ్బ్యాచ్పై బాకుబ్యాచ్ దాడి
అంతా దండుపాళ్యం సంస్కృతి.. నిశ్శబ్దంగా
‘వాచ్, లూట్ అండ్ కిల్’
ఈ దేశపు పట్టాలన్ని సముద్రగర్భంలోకే –
2
ఆ రాత్రి రెండు గంటలకు
ఆయన రహస్యంగా గమనించాడు
మూడు గదులను
భార్య, ఇంజినీరింగ్ కొడుకు, ఎంబీఏ కూతురు..
అందరూ స్మార్ట్ ఫోన్లలో బిజీ.. వెలుగుతున్న ముఖాలతో
అమ్మాయి యూట్యూబ్లో
భార్య గూగుల్లో ‘బోల్ట్ షోలో’ మైమరచి
కుమార శేఖరుడు ‘హాట్ ఓషియన్’లో తలమునకలు
అందరూ విడివిడిగా ‘ఆన్లైన్’
జ్ఞాన సముపార్జనలో నిమగ్నమై…
3
అప్పుడా తండ్రి గబగబా ముందు గదిలోకొచ్చి
ఎదుట గోడకు వేలాడుతున్న దేశ పటాన్ని మడచి దాచి
ఒక తెల్లని రోలింగ్ బోర్డు తగిలించి
ఎర్రని మార్కర్ రాశాడు
‘కలుపు కుళ్ళు కంపులో నా దేశం’ అని
4
సమయం మించిపోతోంది..
ప్రక్షాళించాలి అగ్నిచికిత్సతో
ఎవరు.. ఎవరిని.. ఎప్పుడు.. ఎక్కడి నుంచి.?
రామా చంద్రమౌళి
93901 09993