e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home ఎడిట్‌ పేజీ నాటకమే జీవితం

నాటకమే జీవితం

తెలంగాణ అంటేనే కళాసంపదకు, కళాకారులకు, కళారూపాలకు నిలయం. అలాంటి కళారూపాల్లో నాటక కళ ఒకటి. నాటకం అంటేనే సజీవమైన జీవన రూపకం. ఒక సంపూర్ణ జీవితాన్ని ఆవిష్కరించే కళ నాటకం. జీవితమే ఒక నాటకరంగం అని ఆర్యోక్తి. అలాంటి నాటకరంగంలో మునిగి తేలి, నాటకాలను ఊరూరా ప్రదర్శింపజేసి వాటిని సమున్నతమైన స్థాయిలో నిలిపిన కళాతపస్వి శేషభట్టర్‌ నరసింహాచార్యులు. అర్ధ శతాబ్దంపైగా నాటక రంగమే ఊపిరిగా జీవించిన నిజమైన కళాస్రష్ట. ఉపాధ్యాయవృత్తిలో ఉంటూనే నాటకం కోసం పాటుపడిన ముద్దుబిడ్డ. కళాపిపాసి అయిన నరసింహాచార్యులు ఈ నెల 5వ తేదీనదివికేగడం కళామతల్లికి తీరనిలోటు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నాటకరంగానికి శేషభట్టర్‌ నరసింహాచార్యులు నిరుపమానమైన, నిస్వార్థమైన కళాసేవ చేశారు. శేషభట్టర్‌ నాటకరంగానికి సంబంధించి అన్ని విషయాల్లో సంపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నారు. నటన, సంగీతం, దర్శకత్వం, సాహిత్యం, మేకప్‌, కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌, హార్మోనియం వంటి వాటిల్లో ఆరితేరిన ఆయనను నాటకరంగ సర్వస్వంగా భావించవచ్చు. అంతరించిపోతున్న కళారంగానికి జవజీవాలను అందించి నాటకరంగాన్ని బతికించిన అసామాన్యమైన కళాకోవిదుడు ఆయన.

- Advertisement -

1932 సెప్టెంబర్‌ 6న బెంగళూరు సమీపంలోని చిక్కనాయకహళ్లిలో మాతామహుల ఇంట జన్మించిన నరసింహాచార్యులు నాటక రంగానికి విశిష్టసేవలందించారు. తన తల్లి సంగీతంలో, తన సోదరి గాత్రంలో రాణించడం వల్ల ఆయనకు సంగీతంపై మక్కువ ఏర్పడింది. దీంతో ఆయన వీణాశేషాచార్యుల వద్ద వీణావాదనలో కొంతకాలం శిక్షణ పొందారు. ఆ తర్వాత హార్మోనియంపై సాధన చేసి పలురాగాలను పలికించడం నేర్చుకున్నారు. నాటకరంగంపై మక్కువతోనే నాటకాలు రాసి, వాటిని స్వగ్రామమైన పెంట్లవెల్లిలో ప్రదర్శింపజేశారు. పాఠశాల విద్యార్థులతో సతీసావిత్రి, శ్రీకృష్ణ తులాభారం, సత్య హరిశ్చంద్ర వంటి నాటకాలను వేయించారు. తన 17వ ఏట ఉద్యోగంలో చేరిన నరసింహాచార్యులు 41 ఏండ్ల పాటు ఉపాధ్యాయుడిగా, 50 ఏండ్లకు పైగా నాటకరంగంలో జీవితాన్ని రసమయం చేసుకున్నారు. వృత్తిరీత్యా 1972లో నాగర్‌కర్నూల్‌లో స్థిరపడటంతో నరసింహాచార్యులు కళాజీవితం మలుపు తిరిగింది. ఆ రోజుల్లో జానపద నాటకాలపై ఉన్న ఆదరణతో 1977లో స్వయంగా ‘కళాభారతి’ అనే సాంస్కృతిక, కళాసంస్థను నెలకొల్పి ఈ సంస్థ ద్వారా నటనకు, ఆహార్యానికి మెరుగులు దిద్దారు. వీరి డ్రామా మెటీరియల్‌ కర్ణాటక ప్రాంతానికి కూడా ఎగుమతి కావడం గర్వకారణం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నాటకాలు వేసే వారే గాక, ఇతర జిల్లాలవారు కూడా కళాభారతి సంస్థ దగ్గర నుంచే అన్నీ తీసుకెళ్తుండేవారు. సంస్థ రూపొందించిన కిరీటాలు, చెమ్కీ మెటీరియల్‌ బెంగుళూరు సమీపంలోని మాండియాకు ఏండ్ల తరబడి ఎగుమతి కావడం విశేషం.

ప్రసిద్ధ నాటకాలైన చిరుతల రామాయణం, సతీసావిత్రి, బ్రహ్మంగారి చరిత్ర, చిరుతల భారతం, అల్లి అర్జున, కర్ణ దుశ్శాసన, ఎల్లమ్మ కథ, మల్లికార్జున కథ వంటి జానపద నాటక, సంప్రదాయ జానపద నృత్యాలకు ఆహార్యం అందించటం శేషభట్టర్‌ నాటక కళాభివేశానికి నిదర్శనం. నరసింహాచార్యులు ‘బాలనాగమ్మ’ నాటకాన్ని 40 సార్లు ప్రదర్శింపజేశారు. వీరపాండ్య కట్టబొమ్మన్‌, అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రక నాటకాలను, అప్పలాచార్య రాసిన మంచం మీద మనిషి, సందేశం వంటి సాంఘిక నాటకాలను కూడా ప్రదర్శింపజేశారు. అర్ధ శతాబ్దానికిపైగా నాటకరంగానికి విశేషమైన సేవలు చేసిన నరసింహాచార్యులు కళామతల్లి ఒడిలోకి జారుకోవడం పెను విషాదం. నిరంతరం కళామతల్లి సేవలో పునీతమైన నాటకరంగ ముద్దుబిడ్డ నరసింహాచార్యులు జిల్లాలో ఎందరో నటులకు శిక్షణ నిచ్చి, వారిలోని నటనావైదుష్యానికి ప్రాణం పోశారు. నాటకరంగానికి ఆయన చేసిన సేవ మరువలేనిది. నిత్యం కళారంగ సేవలో పునీతమైన నరసింహాచార్యులు నాటకరంగానికి మారుపేరు.

డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌,
9032844017

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana