దేవుడిచ్చిన గొప్ప వరం బాల్యం. ఎలాంటి అరమరికల్లేకుండా గడిచిపోయే నిష్కల్మశమైన జీవితం బాల్యం. ఇది అమూల్యమైనది, వెలకట్టలేనిది. అందుకే బుడతలు ఏది రాసినా అవన్నీ నిజాలే ఉంటాయి. చిట్టి పొట్టి నడకలతో బడికి వెళ్లి తరగతి గదిలో పాఠాలు వింటూ చదువుతూ, గురువుల సూచనలతో కథలు, గేయాలు చదువుతూ తమ చిట్టి పొట్టి చేతులతో రచనలు చేస్తూ బాలసాహిత్యంలో కదం తొక్కుతున్నారు.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో నీతిని బోధించే మంచి కథలను పెద్దలు చెప్పేవారు. మరిప్పుడు అవి విచ్ఛిన్నమై, ఎవరికి వారుగా ఉంటున్నారు. పిల్లలకు కథలు చెప్పేవారే కరువయ్యారు. వారికి నైతిక, సక్రమ ప్రవర్తనను తెలియజేపే బాధ్యతను నేడు బాల సాహిత్యకారులు తమ భుజాల మీద మోస్తున్నారనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. వీరు కథలను రాస్తూ పిల్లల చేత చదివిస్తున్నారు. పిల్లలకు పెద్దవాళ్లు లేని లోటును తీరుస్తున్నారు. మన రాష్ట్రంలో బాల సాహిత్యానికి విశేష కృషిచేస్తూ బడిపిల్లల రచనలను బాల చెలిమి ప్రచురణలుగా పుస్తకాలుగా ముద్రించడం ఆనందదాయకం. చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ బాల సాహిత్యానికి ఇస్తున్న ప్రోత్సాహం వెన్నుదన్ను వెలకట్టలేనిది. బాల సాహిత్యానికి అకాడమీ ఊపిరులూదుతున్నది. ‘సిద్దిపేట బడిపిల్లల కథలు’ పుస్తకం సంకలనంగా తీసుకువచ్చి ఆర్థికంగా రచయితలను, చిన్నారులను ప్రోత్సహిస్తున్నది. బడి పిల్లలను బాల రచయితలుగా తీర్చిదిద్దుతున్నది. ఈ పుస్తకంలో మొత్తం 27 కథలున్నాయి. ప్రతి కథలో ఏదో ఒక చక్కటి నీతి, కథకు తగిన చిత్రాలను అందించడం అదనపు బలం.
ఆడపిల్లలను తక్కువ చూడకుండా మగపిల్లలతో సమానంగా పెంచాలనే సందేశంతో ‘ఆడపిల్ల ఆప్యాయత’ కథను సాయికుమార్ చక్కగా వర్ణించిన విధానం ఆకట్టుకునే విధంగా ఉన్నది. మగ పిల్లలను ఎక్కువ చేస్తూ, ఆడపిల్లలపై వివక్ష చూపే తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే చక్కటి కథ ఇది. మరో కథ ‘అత్యాశ’. ఇందులో మనిషికి ఆశ ఉండాలి, కానీ అత్యాశ మరి ప్రమాదకరం. అత్యాశతో ఉండేవారికి జీవితంలో అపాయాలు ఎదురవుతాయనే నీతిని సృజన్‌కుమార్ వివరించాడు.
చిన్నారి శ్రీజ రాసిన ‘స్నేహం విలువ’ కథ స్నేహానికి డబ్బు, అందం, ఆకారం, కులమతాలతో సంబంధం లేదు. అందరూ కలసిమెలిసి ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకోవడమే స్నేహం గొప్పతనం అంటూ చక్కగా వివరించిన విధానం బాగుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఆరోగ్యంగా జీవిస్తాం. ఎలాంటి రోగాలు దరిచేరవు అనే సందేశంతో ‘ఆరోగ్యం’ అనే కథలో శివలీల చక్కగా వివరించింది. ఈ కథను చదివితే ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన కలుగుతుంది.
తేజశ్రీ రాసిన ‘అంగట్లో అన్యాయం’ కథలో అపకారికి ఉపకారం చేసేవారే గొప్పవారు. మనకు కీడు చేశారని మనసులో పెట్టుకోకుండా మంచి చేయాలని, చిన్నారి రాసిన ఈ కథ పాఠకులను ఆలోచింపజేస్తుంది. అందరూ కలసి ఉంటేనే సుఖం ఉంటుంది. ఎవరికి వారుగా ఉంటే కష్టాలే అని ‘చెరువు’ కథలో అనూష వివరించిన తీరు చాలా బాగుంది. ఇంకా ‘చెలిమి’, ‘మంచి మిత్రుడు’, ‘దానం విలువ’ వంటి ఎన్నో కథలు మంచి సందేశంతో కూడుకొని ఉన్నాయి. ఈ పుస్తకంలోని ప్రతి కథ దేనికదే గొప్పది అని చెప్పవచ్చు. ఇలాంటి కథలు మరెన్నో చిన్నారుల కలం నుంచి జాలువారాలని కోరుకుంటూ వారికి అభినందనలు. ‘సిద్దిపేట బడిపిల్లల కథలు’ పుస్తకానికి చిత్రకారుడు కూరెళ్ల వేసిన కవర్‌పేజీ ఆకర్షణీయంగా ఉన్నది.
– యాడవరం చంద్రకాంత్ గౌడ్ 94417 62105