కత్తులు సాధారణ జీవితం నుంచి యుద్ధరంగం వరకు ఎన్ని రకాలుగా ఏ విధంగా ఉన్నాయి వాటి పేర్లు లక్షణాలు ఎలా ఉంటాయో వివరించే ప్రాచీన శాస్త్రీయ గ్రంథం ‘ఖడ్గ లక్షణ శిరోమణి’. కత్తుల గురించిన వివరణలు గల తెలుగు పద్య కావ్యం ఇదొక్కటే లభ్యమైంది. ఇది కూడా భారతీయ భాషల్లోని ప్రాచీన శాస్త్రీయ గ్రంథాలను వెలికితీసి అచ్చు వేయించాలన్న ఆశయంతో మదరాసు రాష్ట్ర ప్రభుత్వం 1950లో దీనిని ప్రచురించింది.
గ్రంథ రచయిత కవి నవనప్ప. ఇతడు నల్ల పిచ్చయ్య కుమారుడు. నవనప్ప తన తండ్రి నల్ల పిచ్చయ్య రాయరఘునాథ రాజుచే సమ్మానితుడనియు, తాను వారి తనయుడు విజయరఘునాథరాజు నాజ్ఞనీయగా ఈ కృతి రచించితినని చెప్పుకొన్నాడు. రాయరఘునాథరాజు క్రీ.శ.1769-89 వరకు పుదుక్కోటను పాలించిన తొండమాన్ రాజు. ఇతడు భాషాపోషకుడగు విద్వత్ప్రభువు. ఇతని కొడుకు విజయరఘునాథరాజు 1769-1807 మధ్య పరిపాలించాడు. ఈ కాలంలోనే కవి నవనప్ప ఈ గ్రంథాన్ని పుదుక్కోటలోనే రచించాడు.
ఈ గ్రంథంలో 77 పద్యాలున్నాయి. కొన్ని సాంకేతిక పదజాల విశేషంతో ఉన్నాయి. రచయిత ఇష్టదేవతా ప్రార్థన కాగానే ఆ కాలంలోని కత్తులు తయారు చేసే ఐదుగురు నిపుణులను పేర్కొన్నారు.
తిరుమల చిదంబరుడు: ఇతడు కత్తుల తయారీలో అమితమైన నైపుణ్యం గలవాడు. విశ్వకర్మను మించిన ప్రజ్ఞాశాలి.
చిగిలి లష్మౌరాముడు: ఇతడు సకల ఖడ్గముల క్రమమునెరిగినవాడు.
శెంకి సుమాలు: పనివారలందరిలో పండితుడు.
అషకుశాయి: ఖడ్గపరీక్ష యందు నిపుణులు
సుభాభక్తుడు: పై లక్షణాలు గలవాడు, గొప్ప పనివాడు.
కత్తుల వివరణకు ముందు వచనంలో అసి అను పేరు గల ముప్ఫై రెండు రకాల ఆయుధాల పేర్లు తెలిపి అవి లక్ష్మీనారాయణ సంవాదం అనే కావ్యంలో ఎలా వివరించబడినాయో, అదేవిధంగా ఈ కావ్యంలో కత్తుల గురించి వివరిస్తానని వారు పేర్కొన్నారు (లక్ష్మీనారాయణ సంవాదం అనే కావ్యం ఇప్పుడు అలభ్యం).
‘పూర్వంబున హరిహర బ్రహ్మాదులకు నిఖిల సురాసుర మానవ లోకంబులకై విశ్వకర్మచే లక్షణశాస్త్ర విరాజితంబుగా నిర్మితంబులైన అసి, ముద్గర, ముసల, కోహణ, కణ, కంపిణి, శిల్లు, భల్లాతక, భిండివాల, కరవాల, కుంతల, కోదండ, కఠారి, తోమర, పరశు, త్రిశూల, వజ్రముష్టి, గద, అవుది, అంగల, అంతక, పంకిణి, చక్ర, సబళ, ఈటి, ఇనుపకోల, శలకట్టి, పట్టిశ, ప్రకూర్మ, నఖర, మయూర్ధండనారసంబు మొదలగు ఆయుధాలు పేర్కొని వాటిని తెలుగులో వివరించెదనని చెప్పారు. దాదాపు 140 రకాల కత్తుల గురించి విశ్లేషిస్తూ ఆ కాలంలో ఉన్న ఉర్దూ, అరబ్బీ, పారశీక భాషల పేర్లు అలాగే ఉంచి వివరించారు. ఫిరంగిని అతను ఒక రకమైన కత్తిగానే భావించాడు. సూరై, త్యాగ, ఖండామిస్త్రి, అబ్బాసి మొదలగు ఉర్దూ పదములు, ఇతర భాషాపదములు ఉపయోగించాడు. మొదటి పద్యాలలో పేర్లను వివరించి, తర్వాతి భాగాల్లో వాటి లక్షణాలు వివరించారు.
పై పేర్లలో ఫిరంగి అనునది ఒక కత్తి, సైఫ్ అనునది నిలువు కత్తి (straight sword), గురుదా అనునది కత్తులు చేసే ఇనుమ ఖనిజం, సురై అనునది సిరియా భాషలో కత్తి, త్యాగ అనునది సాధారణమైన ఖడ్గం. ఇక లక్షణాలలో చూరి అంటే కొచ్చటి కొస గలది. (sharp pointed end). దోర్యాలు అనునది గీతల ముద్రలు గలది. జిహ్వర్ అంటే పదునైన వంకర కొసగలది. వాయుదార అంటే పదునైనది. ఈ కత్తుల గుణదోషాలు ప్రమాదాలు ప్రమాణాలు అన్నీ పద్యాలలో వివరించారు కవి. ఉదాహరణకు ఒక పద్యం చూడండి.
గడుసును వాయుదాల్ కడవెళ్ల నొకరీతి
లా గనుపట్టు డోర్యాలు మూడు
ఈగకాళ్లకు సమం బింపైన దుగళము
లవకాయ రీతినుండు పంక
పొడుగైదు జానలు పొల్లక పెనుకయు
వెడలుపు మూడు వేళ్ళడరు నలుపు
చంద్రవంకలు జేర్చి సన్నబిందులు పైని
యుంచి ముందిరలుండు మించెనేని
తే.గీ.:కత్తి పట్టిన చేతంబు గతిని వెలయు
తావు నిరంపు త్యాగదై దనరు చూరి
వంపవచ్చును బిగువుతో వంపి జూడ
జాతి మకరంబు లీరీతి సరసనుండు
మకరముల్ అనే జాతి ఖడ్గాల లక్షణాలు వివరించారు పై పద్యంలో కవి. పొడువు ఐదు జానలు, మూడు వేళ్ళ వెడల్పు, ఈగ కాళ్ళకు సమానమైన పదును మూడు గీతలు కలవి. ఖడ్గశాస్త్రం వేదకాలం నుంచే ప్రాచుర్యంలో ఉంది. అగ్ని పురాణం, బృహత్సంహిత, శుక్రనీతి, మహాభారతం, శివతత్త రత్నాకరం లాంటి ప్రాచీన గ్రంథాలలో ఖడ్గ లక్షణాలు వివరాలు ఉన్నట్టు పెద్దలు పేర్కొన్నారు.
హస్తంబులు, మకరంబులు, జవబల్, మక్కై, వాజిలల్ కిరై మాని ఫిరంగు, తురా ఫిరంగు, యెక్కెల్ ఫిరంగు, గోర్యా ఫిరంగు, కుష్కీ ఫిరంగు, పూర్తి కాల్ సైఫ్, నుక్కాసైఫ్, మకరబ్ సైఫ్, రుకమ్మి సైఫ్, యిసుపాత్ సైఫ్, మళయవారి సైఫ్, వులాంధ సైఫ్, జజ్ఞాసైఫ్, పుతన్ క సైఫ్, కుష్కీ సైఫ్, యిసుపాత చాంద్ బందర్, గోవా బందర్, మహమద్ బందర్, బెల్ బందర్, నాట్ బందర్, ఆరా బందర్, ఫ్రాన్స్ బందర్, జ్ఞా బందర్, పూతన్ కేసీ బందర్, యెనా బందర్, మహ్మద్ బందర్, బందర లయిమాని, మోనాభి బందర్, తినాబి బందర్, వురేబం, పాంబందర్, డ్యాలు బందర్, బత్తాలి బందర్, మారాషాసురై, కాయన్ తే బందర్, ఇంగ్ల్లిష్ బందర్, యిందుస్తానీ సురై, భుజకా సురై, రాజాషాసురై, కంచకా సురై, పప్పషాసురై, అంబబాగీసురైఔ, వాసికుని సురై, సాదా లాగుబ్రాల్ సురై, సుదా దౌలా సురై, కల్కత్తాసురై, కత్తాసుకా సురై, సిద్ధోట్కుకా సురై, సురతా నిశాయి సురై, కతియ కెరాట్ సురై, బండవాన్ త్యాగ, ప్యహం తాగ, అంబరీ త్యాగ, రుమీ త్యాగ, గుజరాత్ త్యాగ, బద్యాశిత్యాగ, హిరాకిత్యాగ, వర కుసిల్ త్యాగ, అబ్దాల త్యాగ, జహాశా త్యాగ, ముత్తాన్ త్యాగ, బగ్దాత్యాగ, బహోరి త్యాగ, లహూరి త్యాగ, అకుపరి త్యాగ, అపరంగజ్యపి త్యాగ, మౌవల త్యాగ, నిరవరి త్యాగ, బువాన్ త్యాగ, అషజ్జా త్యాగ, జికర త్యాగ, దేప గది చాండ్యా త్యాగ, బంగాళి త్యాగ…
– చేపూరి శ్రీరాం అష్టావధాని, హన్మకొండ