నేను రోజులో ఒక్కసారైనా
నా బాల్యంలోకి వెళ్లి
తిరిగి ప్రస్తుతానికి చేరుకుంటాను!
విశాలమైన రోడ్లపై వరుస వాహనాలను తప్పుకొని
ముందుకు వెళ్దామనుకున్నప్పుడు
సుతిలీతాడు మధ్యలో వరుసగా నడుస్తూ
దోస్తులతో రైలు ఆట ఆడిన ఆ రోజుల్లోకి వెళ్లి వస్తాను!
ఫుట్‌పాత్‌ల పక్కన చిన్న చిన్న గుడారాల ముందు
కొలిమి ఊదుతూ కత్తుల సాన పట్టే…
యదార్థ జీవితాలను చూస్తున్నప్పుడు-
మా వీధిలోని రంగన్న తాత
కొలిమి తిత్తిని ఆడించుకుంటూ..
బండి చక్రాలకు పట్టాలు కడుతూ..
ఊపిరితిత్తుల చికిత్స పొందుతూ
ఆగిపోయిన ఊపిరిని తడిమి చూస్తుంటాను!
ఎర్రగడ్డ బస్టాప్ దగ్గర కర్రతో చేసిన
వస్తువులను చూస్తున్నప్పుడు
మా ఇంటి పక్కనే ఉండే
వడ్ల చంద్రప్ప తాత తయారుచేసే..
మన్నికైన రెండు ఎద్దుల బండ్లు గుర్తుకొస్తాయి-
సంక్రాంతి నాడు ఇంటిల్లిపాది
ఆ బండి పైన ఎక్కి ఊరంతా తిరిగిన
ఆ రోజుల్లోకి ఒక్కసారైనా వెళ్లి వస్తుంటాను!
గంగారం గుడి పక్కన
కుండల దుకాణం రామయ్యను చూస్తుంటే
మా ఇంటి వెనకాల విశాలమైన వాకిలి నిండా
బట్టీ నుంచి తీసి పేర్చిన కుండలు చూసి
అబ్బురపోయే కుమ్మరి ఎల్లప్ప గుర్తుకొస్తుంటాడు!
మా కాలనీలోని డ్రై క్లీనింగ్ షాప్‌లో
బట్టల మూటలు చూసినప్పుడు
ఇంటిల్లిపాది మురికి బట్టలను మూటగట్టుకొని
చీదరించుకోకుండా చెరువుకు తీసుకెళ్లి
మల్లె పువ్వులసొంటి మడతేసిన బట్టలు తీసుకొచ్చే
చాకలి బాలకృష్ణ గుర్తుకొస్తుంటాడు!
అడుగడుగునా జ్ఞాపకాల చిట్టాల్లోని
వ్యక్తులందరూ మాయమైపోతున్నారు
అప్పుడప్పుడు.. నా బాల్యంలోకి వెళ్లి వాళ్లను
పరామర్శించి వస్తూనే ఉంటాను!
– జయంతి వాసరచెట్ల 99855 25355