ఒంటిపై పచ్చబొట్లు
మెడలో తాయెత్తు
దారుఢ్య ఉక్కు శరీరం!
తూటాల రక్తంతో అభిషేకమైనట్టు
ఆపాదమస్తకం!
నిర్దోషి ఆదివాసి శవం!!
ఈ శవానికి సంబంధించిన వారు
ఎవరైన వచ్చి వంద ప్రశ్నలకు
సమాధానాలు చెప్పి
వారి ఆచారాల ప్రకారం
అంత్యక్రియలు జరుపుకోవచ్చును!!
గుర్తింపబడని ఈ అడవిలోని శవాన్ని
ఎవరూ గుర్తించడానికి రావడం లేదు
భయంతో ఎవరు వస్తారు!
ఎవరూ ఎరుకపట్టకున్నా!
పార్థివ శరీరాన్ని పంచభూతాలు
గుర్తుపట్టాయి మరి!
ఇక తమలో నిరభ్యంతరంగా
కలిపేసుకుంటాయి
ఏ అడ్డూ లేదు!!
గుర్తింపబడని శవం అనాథ అయినా
ప్రపంచానికి చరిత్రగా కావాల్సిందే
– కందాళై రాఘవాచార్య 87905 93638