ఆ రోజు పాప హుషారుగా
వచ్చి చెబుతోంది
కొరియర్లో పుస్తకమొకటి
వచ్చిందని, పేజీలు తిప్పుతూ
వాసన చూస్తోంది. నేనా పుస్తకాన్ని
చేతిలోకి తీసుకొని
కవర్ పేజీ పైనున్న అక్షరాలను
సుతారంగా తడిమాను.
‘గ్రంథాలయం’ అని రాసున్న
శీర్షికలోంచి ఒక్కొక్క అక్షరమూ
గాల్లోకి లేచి నన్ను సీతాకోక
చిలుక లాగా చుట్టుముట్ట సాగాయి.
ఏండ్లనాటి ఏదైతే ఒక వృక్షం
తన ఎండుటాకులను రాల్చుకున్నట్టు
మసక వెలుతురులోని మసిబారిన
ఆ గ్రంథాలయపు గది గోడలు
ఎదురుగా పుస్తకాల్లోని బిల్వ
పత్రాలను రాల్చుకుంటున్నాయ్.
చిన్నతనంలో, నాన్న నా చేయి
పట్టుకుని రోజు ఇక్కడికే
తీసుకొచ్చేవాడు. అప్పుడు
ఇక్కడ రెండే పొడుగాటి చెక్కబల్లలు.
ముక్కుపై జారిపోతూ ఉండే
పెద్ద కళ్లద్దాలూ, తెల్లని లాల్చీలో
ఆ పక్కనే కుర్చీలో నిశ్శబ్దంగా
సేదతీరే మా లైబ్రేరియన్ మాష్టారు.
నాన్న తన కోసం ఏవో కొన్ని
వార్తా పత్రికలను తీసుకొని
నా చేతిలో కొన్ని రాకుమారుల
బొమ్మలున్న పుస్తకాలను పెట్టేవాడు.
ఆ బొమ్మలను సుతారంగా
తాకినప్పుడల్లా ఒక్కసారి పుటల్లోంచి
పెద్ద పెద్ద సకిలింపులతో
గుర్రాలన్నీ బయటకు పరుగెత్తేవి.
కిచకిచమంటూ పక్షుల గుంపులన్నీ
ఆ పుస్తకాల్లోంచి బయటికి
రివ్వున ఎగిరిపోయేవి.
గుర్రపు డెక్కల చప్పుళ్లు, ఏనుగుల
ఘీంకారాలూ, సింహాల
గర్జనలతో ఆ గది అంతా
దద్దరిల్లిపోయేది.
ఆ వెంటనే రాకుమారిని
తీసుకొని రత్న ఖచిత
బంగారు రథమొకటి
బయటికి రివ్వున పరుగెత్తేది.
ఈ రోజు నాన్న లేడు. అలానే
ఆ బొమ్మలున్న పుస్తకాల్లోని
రకరకాల జంతువులూ,
అడవీ, రాకుమారీ.
ఆ కుర్చీ ఖాళీగా
ఎవరి కోసమో ఇంకా
ఎదురుచూస్తున్నట్టు. ఇప్పుడక్కడున్న
కొన్ని పుస్తకాలను,
ఇనప అలమార్లనీ, గోడల్నీ
తాకినప్పుడల్లా నాలో
నిశ్శబ్దంగా ఉండిపోయిన
ఏవో తంత్రులను మీటుతున్నట్టు ఒక
నిర్వేదమో, స్తబ్ధతో తెలియని వెలితి.
కొన్ని తరాల నుంచి నా కోసం
దాచిపెట్టుకున్న
గాఢమైన పరిమళాలేవో గది
అంతా పరుచుకుంటున్నాయి.
గడిచిన కాలాల్లోంచి
జ్ఞాపకాలను తవ్వుకుంటూ
కలల్లోంచి వస్తున్నట్టు అప్పుడప్పుడూ
ఇక్కడికి ఎవరో వస్తూ వెళ్తున్నారు.
శతాబ్దాల చరిత్రలనూ,
చందమామలనూ, బాల్యాన్నీ,
నవ్వులనూ, ఆక్రందలనలనూ అన్నీ
తన గర్భంలో దాచుకున్నట్టు
ఇప్పుడూ అంతే గంభీరంగా
ఉందీ గ్రంథాలయం.
ఇంకా రాబోయే తరాలకు
ఇంతే తలెత్తుకొని గంభీరంగా,
నిశ్శబ్దంగా ఉంటానని
హామీ ఇస్తున్నట్టు ఉంది.
– శ్రీధర్ చందుపట్ల 9493122742