ఏ కళకు సంబంధించిన ప్రక్రియలో అయినా కొన్ని నమూనాలు (patterns) వాడుకలో ఉంటాయి. ఎక్కువవరకు అవే చెలామణిలో ఉంటాయి కనుక, చాలా మంది కళాకారులు వాటినే అనుసరిస్తారు. కానీ ప్రయోగశీలత కలిగినవారిలో మాత్రం కొత్త రీతిలో రచనలు చేయాలనే కోరిక బలంగా ఉంటుంది. అంత మాత్రాన వాడుకలో ఉన్న నమూనాలు మంచివి కావని కాదు. కళను అభ్యసించేవారికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి కాబట్టి, అవి చాలా అవసరమైనవే. భిన్నమైన విధానాన్ని కోరుకునేవారిలో రెండురకాల వాళ్లుంటారు.
తమ అభిప్రాయానికి అనుగుణమైన పద్ధతిని ప్రారంభం నుంచి అమలు చేసేవారు కొందరైతే, కొంతకాలంపాటు రచనలు చేసిన తర్వాత అమలు చేసేవారు మరికొందరు. ఏ కాలంలో అయినా నిర్దిష్ట నమూనాలు (specific patterns),లేదా స్థిరమైన నమూనాలు (fixed patterns) ఆ కాలపు కళారంగంలో 95శాతం కంటే ఎక్కువగానే వాడుకలో ఉంటాయి. ఆ నమూనాలను ఛేదించే (బద్దలుకొట్టే) కళాకారులు అరుదైనట్టే, వారి రచనలను బాగా ఇష్టపడేవారు కూడా అరుదు గానే ఉంటారు. ఈ స్థిరమైన నమూనాలు ఎలా ఉంటాయో ఉదాహరణలతో పరిశీలిద్దాం.
వచన కవితలో శీర్షిక, ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు అనే నాలుగు భాగాలుండాలనీ, వాటిని ఆ క్రమంలోనే రాయాలని నిర్ణయించారు. వేగుంట మోహనప్రసాద్ ఈ fixed patternను బద్దలు కొడుతూ, ‘అట్లా అని పెద్ద బాధా ఉండదు’ అనే వాక్యం (పంక్తి)తో మొదలుపెడతాడు ఒక కవితను. ఈ వాక్యం కవిత మధ్యలోనో ముగింపులోనో రావాల్సిందని వెంటనే తెలిసిపోతుంది.సాహిత్యస్పృహ ఉన్న పాఠకునికి. అట్లా…అంటూ ప్రారంభమయ్యే పంక్తికి పైన వేరే పంక్తులుండాలి కదా? కానీ లేవు. సాధారణ పద్ధతినుంచి దూరంగా పోవడానికి ఇదొక చక్కని క్లాసికల్ ఉదాహరణ. ఈ వ్యాసరచయిత ఉత్తమ లాటి న్ అమెరికన్ కథలు అనే తన అనువాద గ్రంథాన్ని 2013లో ప్రచురించాడు.
అందులోని ఒక కథ పేరు చిరుతపులి కళ్లు. అది స్త్రీవాద కథ. దాన్ని రాసిన రచయిత్రి పేరు లూయిసా వాలెంజ్వేలా. అందులోని విశేషమేమంటే,కథ కొంతదూరం సాధారణ కథ నమూనాలో సాగిన తర్వాత వ్యాస రూపాన్ని సంతరించుకుంటుంది. తర్వాత ఒక నివేదిక (report) లాగా కనిపిస్తుంది. ముగింపు సైతం కొత్తదే. ఎట్లా అంటే, ఆ కథలోని ప్రధాన పాత్రకు ఆఖరున ఏం జరిగి ఉండవచ్చు. అనే విషయాన్ని తొమ్మిది చిన్న చిన్న వాక్యాల రూపంలో చెప్పింది రచయిత్రి! ఆ తొమ్మిదింటిలో ఏదైనా జరిగి ఉండవచ్చు అని సూచిస్తుందన్న మాట. ఇది కూడా fixed format నుంచి దూరంగా పోవడమే. ఇక కొన్ని కథలు, నవలల్లో సంఘటనల క్రమం విచిత్రంగా ఉంటుంది. ఉదాహరణకు మధ్యలో రావాల్సింది ముందుగా, మొదట్లో రావలసింది చివరన, ముగింపేమో ప్రారంభంలోనో మధ్యలోనో… ఇలా! కానీ నెరేషన్లో ఫ్లాష్‌బ్యాక్‌ను చొప్పించడం అరుదైన పద్ధతేమీ కాదు.
నిర్దిష్టమైన నమూనాలను బ్రేక్ చేయడమన్నది సంగీత రంగంలో కూడా ఎక్కువగానే కనపడుతుంది. సంగీత కచేరీల స్వరూపం అంటే వాటిలోని అంశాల స్వభావం, క్రమం ఎట్లా ఉండాలో చాలాకాలం క్రితమే అరియక్కుడి రామానుజ అయ్యర్ నిర్ణయించాడు. ముందు ఒక వర్ణంతో ప్రారంభించి తర్వాత నాలుగైదు కృతులను, ఆపైన రాగం తానం పల్లవిని పాడాలని సంగీత కచేరీకి సంబంధించిన ఒక నమూనాను నిర్దేశించాడాయన. తర్వాతికాలంలో దీనికి చివర్న తని ఆవర్తనం, జావళి, తిల్లానా, మంగళం మొదలైనవి చేరాయి.
నిజానికి అరియక్కుడి నిర్ధారించింది కూడా ఇరవయ్యో శతాబ్దం కంటె ముందు. నిర్దిష్టమైన రూపం లేకుండా crude formలో ఉన్నా నమూనాకు భిన్నమైనదే. ఆయన ప్రతిపాదించిన నమూనా చాలావరకు ఇప్పటికీ కొనసాగుతున్న మాట వాస్తవమే అయినా, టి.ఎమ్. కృష్ణ దీన్ని వ్యతిరేకిస్తాడు. కచేరీ స్వరూపాన్ని కమర్షియల్ మసాలా సినిమాలో లాగా స్థిరంగా ఉంచే అవసరం లేదని ఆయన ఉద్దేశం. దానికి అనుగుణంగా తన కచేరీని కొన్నిసార్లు వర్ణంతో కాకుండా ఆలాపన సహితమైన పెద్ద రాగంతో ప్రారంభించడం, కొన్నిసార్లు తనిఆవర్తనంను కచేరీలో రెండుసార్లు వాయింపజేయడం… ఇట్లాంటి కొన్ని ప్రయోగాలను చేస్తున్నాడాయన.
ఆయన పాటించే మరొక కొత్త విధానం ఏమంటే, వాద్య సహకారం అందించే accompanists ను దూరంగా కాకుండా తనకు దగ్గరగా కూర్చోబెట్టుకోవడం. వాళ్లకు కూడా తనకు దక్కినంత గౌరవం దొరకాలన్నది ఆయన ఉద్దేశం. ఈ విధానాన్ని నచ్చని, మెచ్చని సంగీత పండితులెందరో ఉన్నారు. పాశ్చాత్య సంగీత రంగాన్ని పరిశీలిస్తే, జాన్కోల్ట్రేన్ అనే సాక్సఫోన్ సంగీత కళాకారుడు, మైల్స్ డేవిస్ అనే ట్రంపెట్ వాద్యకారుడు కూడా ప్రయోగాల ద్వారా కొత్త పుంతలు తొక్కారని అంటారు. లలిత శాస్త్రీయ సంగీతాన్ని పరిశీలిస్తే, దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ‘రామచరణం రామచరణం, రామచరణం మాకు శరణం’ గీతంలో ఒక ప్రత్యేకత ఉన్నది. సాధారణంగా సినిమా పాటలలో గానీ, లలిత సంగీత గీతాలలో అన్ని చరణాలకూ ఒకే బాణీ ఉంటుంది. కానీ, ఈ గీతంలో ఒక్కో చరణానికి ఒక్కో బాణీ ఉండటం విశేషం. సంగీత కచేరీలలో ఒక్కో రాగానికి చెందిన బాణీలను వరుసగా కలిగిన రాగమాలికలు ఉండటం మామూలే కానీ, లలిత గీతాల్లో మాత్రం అది అరుదే.
మల్లీశ్వరి సినిమాలోని ‘మనసున మల్లెల మాలలూగెనే’ అనే పాటలో ఇదమిత్థమైన పల్లవి, చరణాలు ఉండవు. చివర్న వచ్చే రెండు పంక్తులలో పల్లవి ఉన్నట్టనిపించినా ఆ పంక్తులు తారుమారుగా ఉన్నాయి. నిర్దిష్టమైన నమూనాలలో ఉండే చరణాలైతే అసలే లేవు. ఈ సినిమాకు సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు.ఏకవీర సినిమాలో కేవీమహదేవన్ కూడా ఇటువంటి ప్రయోగాన్నే చేశాడు. ‘ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ’లో కూడా పల్లవి, చరణాలు లేవు. అది ఒక వచన కవితా పఠనంలాగా ఉంటుంది. ఏఆర్ రెహమాన్ తన కొత్త కొత్త ప్రయోగాల ద్వారా సినిమా సంగీతాన్ని ఒక మలుపు తిప్పాడనటంలో అనుమానం లేదు. రాక్ స్టార్ సినిమాలో ‘ఫిర్ సే ఉడ్ చలా’ పాటను వింటే అందులోని ప్రత్యేకత తెలుస్తుంది. దానిలో ఒక లయ ఉన్నప్పటికీ melodic phrases లేవు. పల్ల వి, చరణాలు కూడా లేవు. మొత్తానికి పాట లాగా కాకుండా ఒక abstract formను (నైరూప్య ఆకృతిని) సంతరించుకున్నది.
మల్లీశ్వరి సినిమాలో మరొక రకమైన వైచిత్రి కనిపిస్తుంది మనకు. ఆఖరున భానుమతి నృత్యంతో కూడిన సంగీత రూపకం ప్రదర్శితం అవుతున్నప్పుడు నాగరాజు (ఎన్టీ రామారావు) కోటలోకి ప్రవేశించాడనే వార్త తెలియడంతో పాట, ప్రదర్శన రెండూ కొంతసేపు మధ్యలోనే ఆగి తర్వాత మళ్లీ కొనసాగుతాయి.
సంప్రదాయ పద్ధతులను పాటించే కళాకారులు పాఠకుల నుంచి, శ్రోతల నుంచి, వీక్షకుల నుంచి, తోటి కళాకారుల నుంచి ఇబ్బందులను ఎదుర్కొనడం అరుదు. వారి కళలో వివాదాస్పదమైనదేదీ ఉండక పోవడమే అందుకు కారణం. చుట్టూ ఉన్న మనుషుల లాగా సంప్రదాయబద్ధమైన ఊహలను, రచనా విధానాలను సొంతం చేసుకోవడం ఒకరకంగా సేఫ్! కానీ ప్రయోగాలు చేస్తే కష్టాలను ఆహ్వానించిన వాళ్లమవుతాం! అది ఒక రకంగా ఏటికి ఎదురీదడమే. పరిచయం, అవగాహన లేని కొత్త ఆవిష్కరణలు, తమ అనుభవంలోకి రాని కొత్త విషయాలు చాలా మందికి నచ్చకపోవడమే కాకుండా కొందరికి కోపాన్ని తెప్పిస్తాయి కూడా. ఇటాలియన్ శాస్త్రవేత్త అయిన గెలీలియోను దీనికి ఒక మంచి ఉదాహరణగా చూప వచ్చు. ఆయన చేసిన ఖగోళశాస్త్ర పరమైన ఆవిష్కరణలు తమ విశ్వాసాలకు భిన్నంగా ఉండటం వల్ల మత ఛాందసులు పెద్ద ఎత్తున వ్యతిరేకతను తెలిపారు. తన జీవితపు చివరి భాగాన్ని జైలులో గడపాల్సి వచ్చింది ఆయనకు!
బాలమురళీ కృష్ణ కూడా సంగీతంలో కొత్త ప్రయోగాలు చేసి సంప్రదాయ విద్వాంసుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆయన కేవలం మూడు స్వరాలతోనే సర్వశ్రీ, ఓంకారి, గణపతి అనే రాగాలను, నాలుగు స్వరాలతో మహతి, లవంగి, సిద్ధి, సుముఖం అనే రాగాలను సృష్టించాడు. కానీ సంప్రదాయం ప్రకారం ఏ కృతి (composition) లోనైనా కనీసం ఐదు స్వరాలుండాలన్నది నియమం అట. సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉన్న కళాకారులు ఇట్లా మామూలు పద్ధతి నుంచి దూరంగా పోయి ఖండన మండనలకు గురవుతారు.
కానీ, ఏ రంగంలోనైనా ప్ర యోగాలు చేయకపోతే ఆ రం గంలో ఎదుగుదల, పరిపూర్ణ వి కాసం సిద్ధించవు. స్థిరమైన న మూనాలను బద్దలు కొట్టడం ప్రయోగం కిందికే వస్తుంది.
ఎలనాగ
98669 45424