సామాజిక, రాజకీయ, ఆర్థికాంశాలపై పలు పత్రికలకు వ్యాసాలు, కవితలు, పుస్తక సమీక్షలు రాసే రచయిత బద్రి నర్సన్లో కథలు రాసే కోణం కూడా ఉన్నదని నాకు మెల్లిగా తెలిసింది. తెలిసిన వెంటనే ఆయన రాసిన తొలి కథల పుస్తకం ‘దారి తెలిసిన మేఘం’ చదివాను. అందులో ఉన్న కథలు చదివాక రచయితతో ముచ్చట్లు పెట్టాలనిపించింది. అందులో భాగంగానే ఈ ఇంటర్వూ. నేనేం అడిగానో, రచయిత బద్రి నర్సన్ ఏం చెప్పారో కింద ఉన్న ప్రశ్న, జవాబుల్లో తెలుసుకుందాం.
జవాబు: ఇది సాధారణంగా నేను ఎదుర్కొనే ప్రశ్ననే. గత పదేండ్లుగా పత్రికలకు వ్యాసాలు రాస్తున్నప్పుడు వాటిలో కొన్ని సంఘటనలు, సందర్భాలు కథలకు సరిగ్గా సరిపోతాయనిపిస్తుంటుంది. పుస్తక సమీక్షలు, సామాజిక, రాజకీయ అంశాలపై వ్యాసాలు రాస్తున్నా… కథగా మలచానిపించే సందర్భాలు నన్ను వెంటాడుతాయి. ఇంతకాలంగా ఎడిట్ పేజీలకు తోడు ఆదివారం పత్రికలకు కూడా ఎన్నో వ్యాసాలు రాశాను. మరి కథలు రాస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందా? రాశాక ఎవరూ వేసుకోకపోతే వాటిని ఏం చేసుకోవాలనే సందిగ్ధం కొంత వెనక్కి లాగేది.
జ: కవిత్వంలో శ్రీశ్రీని, వచనంలో చలంను ఇష్టపడే మధ్య తరానికి చెందినవాడిని. కథ రాస్తే కొత్తగా, భిన్నంగా ఏదైనా రాయాలనిపించేది. ధైర్యం చేసి మొదటి కథ 2016లో రాశాను. అదే ఈ సంపుటిలో ఉన్న ‘ఎంగిలి’ అనే కథ. ఈ కథను ఒక పత్రికకు పంపితే మూణ్నెళ్ల తర్వాత ఫోన్ చేసి ఓ మాట చెప్పారు. ‘దీన్ని వేస్తే ఇన్నాళ్ల నీ పరువుతో పాటు మా పత్రిక పరువు కూడా పోతుంది’ అని. షాక్ తిన్నాను. అంత ఘోరంగా రాశానా అని తికమక పడ్డాను. అయినా ఎందుకో ఆ కథ మాయలో పడిపోయాను. సెకండ్ ఒపీనియన్‌గా మరో పత్రికకు పంపాను. కథ అచ్చయింది. ఉదయం నుంచే ఫోన్‌కాల్స్ మొదలయ్యాయి. అందరూ కథ కొత్తగా, గమ్మత్తుగా ఉన్నదన్నవారే కానీ, ఎవరూ తప్పుబట్టలేదు. ఒకరు నాటికగా మలుచుకుంటామన్నారు.
జ: చాలా ఉన్నాయి. 2017లో ఢిల్లీలో నిఖిత ఆజాద్ అనే యువతి ‘హ్యాపీ టు బ్లీడ్ అనే యాప్ తెరిచిన వార్త వింతగా, సాహసంగా తోచింది. స్త్రీల పీరియడ్స్‌కు సంబంధించిన విషయమది. చూడగానే దీనిపై కథ రాయాల్సిందే అనిపించింది. ఆ అంశంపై ‘మరక మంచిదే’ అని తెగించి రాశాను. ఆ కథ వచ్చాక ‘ఏంటయ్యా.. మరీ ఇలా రాస్తారా!’ అని మెచ్చుకోలుగా మాట్లాడిన మహిళలే అధికం. ఇలాంటి కథ ఓ మగాడు రాయడం చిత్రంగా ఉందన్నారు. ఈ కథ ఓ మహిళా మ్యాగజైన్లో వేసుకున్నారు. కన్నడంలోకి తర్జుమా అయింది.అలాంటిదే మరో సంఘటన. మీరట్‌కు చెందిన ఒక తలారి కుటుంబం మూడు తరాలుగా ఖైదీలకు మరణశిక్ష అమలు చేస్తున్నదని ఓ ఇంగ్లీష్ పత్రికలో చదివాను. తమ చేతులతో ఉరితాడు ఖైదీ మెడకు బిగించి మీట నొక్కుతారు. విలవిలా తన్నుకొని ప్రాణాలు విడిచినవారి ముఖాలు, చూపులు వెంటాడుతాయట. సమాజం కిరాతకుడిగా చూసే ఈ కర్కశ వృత్తి తనతోనే ఆగిపోవాలని ఆయన వేదనతో అన్నారు. జైలు ఉద్యోగులే ఈ పనెందుకు చేయరనే కోణంలో ‘ఈ శిక్ష మాకొద్దు’ అనే కథ రాశాను. ఈ కథకు ‘తెల్సా’ అనే అమెరికా సంఘం కథల పోటీలో బహుమతి వచ్చింది.
జ: ‘దారి తెలిసిన మేఘం’ కథ అంతా కల్పనే. ఢిల్లీ యూనివర్సిటీలో రీసెర్చ్ చేయడానికి వెళ్లిన హైదరాబాద్ అమ్మాయి సుజన. అక్కడ పరిచయమైన సలీమ్ కేంద్ర బిందువులుగా సాగే కథ ఇది. మతం కన్నా జీవితం గొప్పదని చెప్పాలని రాసిన ఈ కథ నేటి అవసరం. అందుకే, ఈ కథ పేరే సంపుటికి శీర్షికగా తీసుకున్నాను. ఇలా కదిలించిన విషయాలతో అడపా దడపా కథలు రాయడం. ఏడాదికి ఒకటి, రెండు పత్రికల్లో రావడం కొనసాగుతున్నది. వీటిలో కొన్ని కథల పోటీల్లో గెలిచాయి. మూడు కథలకు ముల్కనూర్ గ్రంథాలయం వాళ్లు బహుమతులిచ్చారు.
జ: నేడు రచయితలకు అందుబాటులో ఉన్న భిన్న సాహిత్య ప్రక్రియల్లో కథ, నవలల్లోనే సమాజాన్ని లోతుగా, వివరంగా విశ్లేషించడానికి వీలవుతుంది. కథల్లో చర్చించే అంశాలు మనిషి చుట్టే తిరుగుతాయి. కథారచన పేలవంగా ఉంటే ఎంత మంచి విషయమైనా తేలిపోతుంది. ఎంత గొప్పగా రాయగలిగినా ఎంచుకున్న కథా వస్తువు మనిషికి దూరంగా ఉంటే ప్రయోజనం శూన్యం. కొత్తగా కథలు రాస్తున్నవాళ్లలో అన్ని రకాలున్నారు. కథలు చదవడం వల్ల ఎవరికివారు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం వెతుక్కోవచ్చని నా అభిప్రాయం.
– దాసరి నాగభూషణం