కోరపండ్ల తోడేళ్లు మళ్లీ తొంగిచూస్తున్నాయి. జిత్తులమారి నక్కలు నాలుకలు తడుపుకుంటున్నాయి. తెర్లయిన తెలంగాణ తేరుకున్నది. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో వెలుగుబాటలో అడుగులు వేస్తున్నది. తెలంగాణ సోయిలేని మోసకారి పాలన రాగానే పొరుగుదోపిడీ రేచులు చొంగలు కార్చుకుంటున్నాయి. దొంగలకు సద్దికట్టే ఇంటోడు దోబూచులాడుతున్నాడు. శ్మశానాల వంటి నిఘంటువుల్లో తెలంగాణ అస్తిత్వాన్ని పాతిపెట్టేందుకు ద్రోహులు సమకడుతున్నారు. విగ్రహాల పేరిట నిగ్రహాన్ని పరీక్షకు పెడుతున్నారు. నెత్తుటి త్యాగాలకు కొత్త అర్థాలు తీస్తున్నారు. పొరుగు బానిసల చెడగొట్టు మాటలు తల్లి తెలంగాణ గుండెలను పొడిచే ఈటెలవుతున్నాయి. ఇక చాలు. ఇక చాలు.. ఈ కుట్రలు కూహకాలు.. కాళన్న చెప్పినట్టు ఈ దోపిడీ ఎత్తుగడలు ఇంకానా.. ఇకపై సాగవని పొలిమేరల దాకా తరిమికొడదాం.. కుట్రబాజీ కూటాలను కలంపోటుతో కడిగేద్దాం..
తెలంగాణకు ఉపిరి ఊది ఊది
ఢిల్లీ గద్దెనే కదిలించిండు
కనుచూపుమేర లేని తెలంగాణ తీరాన్ని
పాణం అడ్డుపెట్టి సాధించిండు
బక్కపలుచని మనిషి అని అనుకోకుండ్రి
ఉక్కు గుండెలు ఉన్న ఉక్కు సంకల్పం తాను
పాణందేముందన్న తెలంగాణము కన్నా
అన్న తెగువ కన్నబిడ్డ
జనుల నరనరాలలో తెలంగాణమై పలికిండు
సోయి తెల్వదన్నోళ్ల నోళ్లు మూయించి
తెలంగాణ జాతి గౌరవ పతాకమై ఎగిరిండు
ప్రాజెక్టులై గలగల పారి పచ్చని పంటలై
రైతు ఇంట్లో పండుగయ్యి నవ్విండు
కళ్యాణలక్ష్మి అయి ఆడబిడ్డలకు అన్న అయిండు
వయసు మీద పడి
ఒరిగిపోతున్న వృద్ధాప్యం చేతిలో
పింఛను కర్ర అయ్యి నిలబెట్టిండు
బిందెలల్ల మిషన్ భగీరథ అయి
ఇంటింటి దాహం తీర్చిండు
పుట్టబోయే బిడ్డలకు మేనమామ అయి
కేసీఆర్ కిట్టు పంపిండు
జూన్ 2 తారీఖు చరిత
మరువని శిలాక్షరాలతో
తెలంగాణను చెక్కిన శిల్పి అతను
తెలంగాణను గుండెకు హత్తుకున్న
ఆత్మగౌరవమతను
ఆయుష్మాన్భవ..ఆయుష్మాన్భవ
అంటున్నది తెలంగాణము నీ ప్రాణం
– గుండెల్లి ఇస్తారి 9849983874

వీరుల చరిత్ర ఈ తెలంగాణ
అమ్మ తెలంగాణ అవని చరిత్ర
పోరువీరుల త్యాగం పొడిచిన పొద్దు
చెరగని వీరుల చరిత్ర తెలంగాణ
రాష్ట్ర సాధన రణ చరిత్ర
పోరాటాల నేల
కన్నది వీరులను కడుపునిండా
సమరాల పుడమి సాధించిన ఘనత
సాక్ష్యమే తెలంగాణ
సాగింది తెలంగాణ సమరం
ఊగింది ఉద్యమం ఉయ్యాలలా
ఊరూవాడ ఉద్యమం ఉరుములు, మెరుపులు
రాష్ట్రమొచ్చే దాకా రణం ఆగనంది
ఆగలే తెలంగాణ ఆమరణ నిరాహార దీక్షలు
వచ్చేదాకా ప్రాణం వదిలిన త్యాగం
తెచ్చేదాక తెలంగాణ తెగించిన ప్రాణం
త్యాగమే లేకుంటే తల్లి తెలంగాణ
ఆంధ్రుల చేతుల్లో అణగిపోవు
పోరు పురిటినొప్పుల పొద్దు తెలంగాణ
తల్లి తెలంగాణ తనువు పుట్టింది
అమ్మ తెలంగాణ అవతరించింది
– దేవరపాగ కృష్ణయ్య 9963449579

తేటగీతి
వీరపుత్రులు కన్నట్టి శూర వనిత
నా తెలంగాణ రాష్ట్రము నాల్గు దిక్కులందు
నవరత్న కాంతులు రాశి పగిది
ప్రజ్వరిల్లుచు నుండును ప్రజల కొరకు
తేటగీతి
జూను రెండున వచ్చేను జనుల బ్రోవ
స్వేచ్ఛ వాయు ప్రసాదించ స్వచ్ఛమైన
జీవితానికి నూతన చిగురువేయ
సంతసమున జనులు చిందుల్సల్పుచుంద్రు
తేటగీతి
ముళ్లకంచెలు దాటిరి ముందుకురికి
లాఠీదెబ్బలు తిన్నారు పోటీపడుతూ
బూటుదెబ్బలు పడినారు భూమి కొరకు
బాష్పవాయు పీల్చిరి బ్రతుకు కొరకు
ఆటవెలది
పాడి పంటలన్నీ పరవళ్లు తొక్కగా
మురిసినాది తల్లి ముద్దుగాను
నదుల నీరు పారె నాట్యమ్మె యాడుతూ
యెదల యందు వలుపు ముదము నొందె
– జాదవ్ పుండలిక్రావు పాటిల్ 9441333315

ఆకాశం నుంచి వంగిన
నక్షత్రాల కొమ్మ నా నేల
పచ్చదనాల హారమై మిలమిల
మెరిసిపోతున్నది నా నేల
కంటి నుంచి జారిన నీటిబొట్టు
చెంపల మీదే ఆవిరైన దృశ్యాలు
ఇప్పుడు కానరావు
అప్పుపత్రాల పచ్చబొట్టు
పొడిపించుకున్న
ఉరితాళ్ల నీడలన్నీ
వడ్లరాశుల నిలయాలైనవి
దశాబ్దాల కాలం చేసిన
గాయాలకు లేపనం
తంగేడు వనంలో విహరిస్తున్న
పక్షుల కువకువలు
నీళ్ల గలగలలే కలలైన చోట
గేట్ల మీంచి దుంకుతున్న ప్రవాహం
ఒక సాకరమైన నమ్మకం
స్వేచ్ఛ ఒక్కటే రెక్కలు తొడుక్కోలేదు
విశ్వాసంతో కూడిన మనిషితనం కూడా
తలెత్తుకున్న నా నేల
నీలికళ్ల సొగసుదరి
గోరింక చూపును అద్దుకోవాల్సిన
పుష్కరకాల వేళ
అస్పష్ట నీడలు చిక్కుముళ్లేస్తున్నాయి
మళ్లీ పాదాలని వెనక్కి నూకేస్తున్నాయి
ఓ నా వీర నేల
మళ్లీ ఒకసారి ప్రతిధ్వనించు
– వేముగంటి మురళి 6302507317

ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాం
కొండను ఎక్కబోతూనే
ఎన్నిసార్లు జారిపడ్డాం?
తిమింగలాలు ఊపేసిన
సముద్రంలో నావలమై
ఎన్నిసార్లు వీపు చరచుకున్నాం?
ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఒక రోశయ్య, మళ్లీ ఎన్టీఆర్
కానీ మొన్ననే జయంతుడు కావలసిన సురవరం ఏమయ్యాడు?
ఈ మూర్తులన్నీ దేనికి సంకేతం?
తెలంగాణ తల్లి చేతి నుండి
బతుకమ్మ ఎక్కడ జారిపడింది?
తల్లి తెలంగాణ..
నీ జాలిచూపులు మాకు తెలిశాయి
నీ ఆర్తి గీసిన నిశ్శబ్ద సందేశం
మమ్మల్ని చేరుతోంది.
మా కత్తి కిందికి దించలేదు
అనేక ప్రాణాల రక్త సంగీతం
ఇంకా వినబడుతూనే ఉంది.
ఈ సంబరానికేనా తల్లులు
తమ పిల్లల్ని వథ్యశిలపై ఎక్కించారు?
ఈ కాలుష్యపు కుట్రలకేనా
పిడుగుల ఆర్భాటపు
మేఘాలను లెక్కచేయకుండా
సబ్బండవర్ణాలు ముందుకు దూకింది?
మళ్లీ వీరకావ్యాలు రాసుకుంటున్నాం
అగ్గి గుండెలమై పిడికిలిస్తాం
నిన్నటి వీరుడు ఎత్తిపట్టిన
కత్తులకు కొత్త ప్రాణమై పూస్తాం
పడమటి కొండ మాపులో
నిశ్శబ్దమైన ఊపిరులం మళ్లీ
తూర్పులమై ఉదయిస్తాం
– డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్రాజు 9676096614