ఇద్దరి మధ్యన నదులు నిర్జీవమైనప్పుడు
కలిసి పారిన నదుల నుంచి కాపిచ్చుక నీళ్లు తెచ్చి సజీవం చేసుకోవాలి
అగ్ని గుండాలను ఎవరు ఇష్టపడతారు మేఘాలు పంపిన తడిని తప్ప
దాన్ని అడ్డుకట్టలతో నిలుపుకోవాలి
లేదా క్రొత్తవి కట్టే ప్రయత్నాలు చెయ్యాలి
మట్టి, విత్తనాన్ని కలిపి నేలను పచ్చగా అలికి ఆకలిని తూడ్చేటట్లు చూడాలి
ఇద్దరు కలిస్తే ఆకాశ కొమ్మని
ఎక్కవచ్చు నేలపైన ఏ సహాయం
లేక ఎగిరినది ఏమున్నది చెప్పు
ఒంటరితనము కళ్ళు మూసుకుని
తడుముకోవడమే తప్ప
భూమి సూర్యుడికి తాళ్లు అల్లుకొని
గాలిలో ఈదుతున్నది
కిరణం గాలి తేమతో కలిసి
ఇంద్రధనుస్సు అయ్యింది
ఎగిరే పక్షికి గాలి ఆధారమే
ఏ జీవికైనా ఒక దాపు అవసరమే
మాట లేకపోతే నీవైనా
జీవితాన్ని ఎగర లేవు
ఇచ్చిన మాటకు కట్టుబడకపోతే
అందరి కడుపులకు కన్నీళ్ళు రుద్దినట్టే
– గుండెల్లి ఇస్తారి 9849983874