కాళేశ్వరం ప్రాజెక్టు సాధించిన పురోగతి కండ్ల ముందు కనిపిస్తున్నా.. కుట్రపూరితంగా, రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు కట్టగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటులో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ అడ్డగోలుగా మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణ రైతు బిడ్డల రక్తం మరుగుతున్నది. అరవై ఏండ్లపాటు తెలంగాణను నిర్లక్ష్యం చేసిన పార్టీల నేతలు, బాగు చేసినోళ్లను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారు. శత్రువు కుట్రకు కొందరు తెలంగాణకు చెందిన ఇంటి దొంగలే ఆజ్యం పోస్తున్న వైనం అర్థం చేసుకోవాలి?
ప్రజలను వంచించి, అధికారాన్ని చేతబట్టి, రాష్ట్ర సంపదను లూటీ చేస్తున్న మోసగాళ్లు అజ్ఞానంతో వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. రెండున్నరేండ్ల కింద ఇదే తప్పుడు మాటలతో ప్రజలను తప్పుదోవపట్టించారు. రెండు పార్టీల లోపాయికారి ఒప్పందంలో కాంగ్రెస్ గద్దెనెక్కింది. బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందనే ప్రచారం చేశాయి తెలంగాణ వ్యతిరేకశక్తులు.
తెలంగాణ వాటర్ హబ్‌గా మారడం, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఘనంగా పుంజుకోవడం వెనుక కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది. తెలంగాణ పల్లెలు నేడు ప్రగతి కేంద్రాలుగా పురోగతి సాధించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కారణం. రాష్ట్ర తలసరి ఆదాయం, స్టేట్ ఓన్ రెవెన్యూ పెరగడంలో కాళేశ్వరం ప్రాజెక్టు అందించిన ఫలాలు ఉన్నాయి. మొత్తంగా రాష్ట్ర అభివృద్ధికి రైతు ప్రగతి కారణమైతే, రైతు ప్రగతికి కాళేశ్వరం కారణం. ఈ వాస్తవాన్ని కొందరు వక్రీకరిస్తుంటే కొందరు ఎందుకు స్పందించడంలేదు? ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్, బీజేపీ నేతలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి కేసీఆర్ పాలనను బద్నాం చేస్తుంటే.. కొందరికి చీమ కుట్టినైట్టెనా ఎందుకు అనిపించడం లేదు?
కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి ఇప్పటికే మోసపోయిన సంగతైతే అర్థం కావాలి కదా! మరెందుకు నోర్లు మూతపడుతున్నాయి? పౌర సమాజం స్పృహ కోల్పోయి, నోరు మూసుకొని ఉంటే ఎవరికి నష్టం? ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను నిలువరించడం ప్రతి ఒక్కరి బాధ్యత కదా! సంస్థలు, సంఘాలు, వ్యక్తులు, మేధావులుగా ఎవరికి వారుగా అన్యాయాలు, అప్రజాస్వామిక విధానాలు, పాలకుల దోపిడీపై పోరాడాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై బాధితులు పోరాడుతున్నారు.. సత్ఫలితాలు సాధిస్తున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రైతులు, రైతు బిడ్డలు, తెలంగాణవాదులు ఐక్యంగా గళమెత్తాలి. కేసీఆర్‌కు వంకలు పెట్టుకుంటూ పబ్బం గడుపుతున్న కొందరు మేధావులు ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి. మేడిగడ్డలో రెండు పిల్లర్లు బాగుచేయదానికి మేస్త్రీలు దొరకట్లేదా? సిమెంట్ దొరుకుతలేదా? అని కొందరు రైతులు నిలదీస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో కనిపిస్తున్నాయి. సామాన్య రైతులకు వచ్చిన సందేహం మేధావులు అని చెప్పుకొనే వాళ్లకు ఎందుకు రావడంలేదో! తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టుకోవడంలో కూడా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఇది ఆలోచించాల్సిన అవసరమున్నది. తెలంగాణ సమాజం అట్లా ఘాటుగా స్పందిస్తేనే కాంగ్రెస్ పాలకులు దుష్ప్రచారం చేసి తప్పించుకోలేరు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు అడ్డగోలుగా నోరు పారేసుకోలేరు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడుతారు… ఈ విషయం కొందరు ఎందుకు అర్థం చేసుకోవడంలేదు?
అడ్డగోలుగా జరుగుతున్న దుష్ప్రచారంపై మౌనంగా ఉంటే, అది అంగీకారంలా భావిస్తారు. మరింత రెచ్చిపోయి విమర్శిస్తారు.. విమర్శిస్తున్నారు. అసలు కుట్రకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఆఖరికి కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం పేరుతో పక్క రాష్ర్టాలకు నీళ్లను తరలించుకొనిపోవడమే అసలు కుట్ర. అసలు సంగతి ఇదే. ఇప్పటికే ఆ దిశగా చంద్రబాబునాయుడు, మోదీ ప్రభుత్వం కలిసి కుట్రలు పన్నుతున్న విషయం మనకు అర్థం కావాలి కదా? ఒకపక్క గోదావరి మీద కాళేశ్వరం కూలిపోయిందని, మరోపక్క కృష్ణా నుంచి మనకు నీటి వాటా లేదని, ఇట్లా అనేక వంకలు పెట్టి మన నీళ్లను శాశ్వతంగా తరలించుకుపోయే కుట్రను ఇంకా పసిగట్టకపోతే మనల్ని ఎవరు క్షమిస్తారు? కంచే చేను మేసినట్టు, రక్షకుడే భక్షకుడిగా మారినట్టుగా నదీ జలాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఉన్నది. ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఆంధ్రా, ఉత్తరాది వాళ్లు పబ్బం గడుపుకొనే పెను ప్రమాదం ముంచుకొస్తున్నది. ఇంక తెలంగాణ సమాజానికి ఎవరు చైతన్యాన్ని నింపాలి?
తెలంగాణ ద్రోహులు ఇంతటి కుట్రలు చేస్తుంటే అడ్డుకోలేమా? అంత వెనుకబడి ఉన్నామా? మనకు మనమే అర్థం కాకుండా పోతున్నామని అర్థమా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇకనైనా మనకంటూ సొంత ఆలోచనలు ఉండవా? ఏది వాస్తవం, ఎవరు మన కోసం పని చేస్తున్నారు? అనే అవగాహన ఉండాలి. ఓటును సరిగ్గా వినియోగించుకోకుంటే అది ఎంత ప్రమాదకరమైనదో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్‌ను తెచ్చి నెత్తిన పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వరకు అన్నీ అర్థం చేసుకోవాలి. అంత అర్థం కాకపోవడానికి, అత్యాశకు పోయి, మన నెత్తిన మనమే చేయి పెట్టుకునేందుకు మనమేమైనా భస్మాసురులమా? ఇప్పటికైనా మేలుకోకపోతే మళ్ల 50 ఏండ్ల కిందటి పరిస్థితి లెక్క పల్లెలు నీటికి కరువై సాగు భూములు మళ్ల ఎండిపోతే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూలిపోయి, అన్ని రంగాలు కుదేలైపోయి.. యుద్ధానంతర పరిస్థితిని తెలంగాణ ఎదుర్కోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.!
రమేశ్ హజారి