కుంగిందన్నారు
కూలిందన్నారు అవినీతన్నారు
పనికిరాదన్నారు దండగన్నారు
ఇప్పుడు మల్లన్నసాగర్ నుండే
నిరంతరం నీళ్లు అంటున్నారు
ఎంతమార్పు వేగిరమ్ముగా ‘ప్రజా మార్పు’
పశువుల కాళ్లకు గాలి సోకినట్లు
వాళ్లకు కూడా ఏమన్నా సోకిందేమో
ఒకటే కుంటారు గెంతారు
దుష్ప్రచారం విపరీత వింత ప్రచారం
ప్రపంచంలో దేనికి మస్క లేనట్టు
పుట్టింది పుట్టినట్టే ఉన్నట్లు బీరాలు పలికిండ్రు
మూసీ సుందరీకరణకు
భాగ్యనగర్ మంచినీటికి
కేసీఆర్ కట్టిన కాళేశ్వరమే దిక్కాయే..
ఎటు పోయిండ్రు
లక్ష కోట్లు దోచిండ్రు కుంభకోణాలంటూ
కానుగాకుల మీద కత్తులు నూరిన మేధావులు
తాగు సాగు నీళ్లపై కారు కూతలు కూసిన
గొట్టాలు గళాలు, పాళీలకు చంద్రగ్రహణాలు
గంగానది కాలుష్యంలా
తెలంగాణపై విషం చిమ్మి అడ్డగోలు
ప్రకటనలు రాతలు
డెంగీ దోమల దాడులు
దోచుకున్నారంటూ దాచుకున్నారంటూ
జైలు తప్పదంటూ
నోటికెంతొస్తే అంత
మూసీ ప్రవాహపు చెత్తనోళ్లు
సొక్కమైన పత్తి పుల్లల్లా
ఇడుపులలికి చుక్కలు పెడుతుండ్రు
పల్లిరిగిన దువ్వెనతో పాపిటలు
తీసి పగులబడె నవ్వులు
అరవై ఏళ్లు జలగల్లా మన రుధిరాన్ని
పీలుస్తూ అధికారంలో ఉన్నారు
మనుషుల్లో ఎన్నడు మనుషులుగా లేరు
అధికార ఉగాదులన్నీ,
సంతక సంక్రాంతులన్నీ వాళ్ళవే
మొండి చేతుల్లో ఒక్క
జల కిరణమన్న ఉదయించలే
ప్రాణహిత ఎన్నికల
ప్రచారాస్త్రంగానే మిగిలింది
గంటెడు మన్ను తియ్యలే
వరిపోసంత వంతెన కట్టలేదు
పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచి
బతుకులు దేశమెల్లిపోతుంటే
వాళ్ళిక్కడ పతంగులు ఎగరేసి
తైతక్కలాడిండ్రు
టపాసులు కాల్చి
దీపావళులు జరిపిండ్రు
నీళ్ల జాడను కనుక్కోలే
వలసల నివారణకు ఒక్క
విధానమన్నా నోచుకోలే
కాళేశ్వరం జలేశ్వరం
యుగయుగాల జీవధార
నిండుకుండల్లా రిజర్వాయర్లు కాలువలు
ప్రతి నీటిబొట్టు కర్షక శ్రమకు అంకితమవుతుంది
నీటి అద్దాలలో
కోల్పోయిన బతుకులు
తలల్ని దువ్వుకుంటున్నాయి
పాడిపంటలు పొంగి పొరలి
పండు వెన్నెల కోలాటాలతో కైగట్టిన పాటలతో
గుండెలు గొంతెత్తి గళాలిప్పుతున్నాయి
మేఘాలు జులువ రాగాలై తాళాలెత్తి దరువులు
జల కవిత్వ గానాలకు
పరవశించి ప్రకృతి శివతాండవం నర్తిస్తుంది
రైతులు భుజాలపై శెల్లలతో తలెత్తే చిరునవ్వులు
కొత్త కొత్త పక్షులు చెట్ల కొమ్మలపై
గూళ్లల్లుకుంటున్నాయి
ఆకుపచ్చ హరిత వసంతానికి
చిరునామా కాళేశ్వరం
చేప పిల్లలు కాళేశ్వర యదార్థ
సత్యాన్ని విని గంతులేస్తున్నాయి
నిజాన్ని ఒప్పుకొన్న అబద్ధపు
నాయకులు తలలు వాలేస్తున్నారు
(మల్లన్న సాగర్ నుంచి మంచినీళ్ల ప్రాజెక్టుకు
శంకుస్థాపన చేసిన సందర్భంలో
ముఖ్యమంత్రి ప్రసంగం తీరుపై)
– వనపట్ల సుబ్బయ్య 94927 65358