‘కులమూ, మతమూ పిచ్చి మెండుగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆయనను ఆడించే చంద్రబాబు సహా తెలంగాణ మేలు కోరేవారి ముసుగులో ఉన్న వారందరూ కలిసి మిడుతల దండు వలె మీదపడుతున్నరు. తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు తప్పవని వెక్కిరించినవారు… ఇపుడు కాంగ్రెస్ రూపంలో ఆ వెక్కిరింతలను నెరవేర్చే కుతంత్రంలో ఉన్నరు. తెలంగాణపై పగ తీర్చుకోవాలని తహతహలాడుతున్నరు…’
‘బంగాళాఖాతంలో ధరణిని కలిపి వెనుకటి పెత్తందారీ పాలనకు తలుపులు బార్లా తీయాలని చూస్తున్నడు రేవంత్‌రెడ్డి. పూటకో కీచులాటతో పుణ్యకాలం గడిపేసే కాంగ్రెస్ అరాచక పాలన వస్తే… మేనకోడలు పెండ్లికి మొహం చాటేసే మేనమామ లెక్క కల్యాణలక్ష్మి సాయం అందనివ్వడు, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలుండవు, పుట్టిన బిడ్డకు కిట్ అందదు, బడికెళ్లే కాలంలో రుచికరమైన శ్రేష్ఠమైన అల్పాహారం అందదు…
పై వాక్యాలు నేను ఇదే ‘వేదిక’ పేజీలో, 2023, నవంబర్ 22న రాసిన వ్యాసంలోనివి. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పట్ల బహుపరాక్ అంటూ నాడు తెలంగాణ సమాజాన్ని హెచ్చరించిన. అవన్నీ ఈరోజు నిజం అవడానికి కారణం నాకు జ్యోతిష్యంలో ప్రవేశం ఉండటం కాదు, తెలంగాణ ఆత్మ ఉండటం; రేవంత్ రెడ్డి వికృత మనస్తత్వం, కాంగ్రెస్ పార్టీ అరాచకం గురించిన అంచనా ఉండటం!
Write hard and clear about what hurts- మనను బాధించే, అతలాకుతలం చేసే విషయాల గురించి తీవ్రంగా, స్పష్టంగా రాయాలని అంటరు ఎర్నెస్ట్ హెమింగ్వే. నేడు తెలంగాణ పడుతున్న బాధ గురించి, అతలాకుతలమైన మన జీవితాల గురించి మనం తప్పక ఆలోచించాలె. ఈన గాచి నక్కల పాలైన చేను గతి పట్టింది ఈ రోజు తెలంగాణకు.
పుట్టినప్పటి నుంచి కాటికి పోయేవరకూ ప్రతి ఒక్కరికీ ఉండే అన్ని అవసరాలు తీర్చడం కోసం నిరంతరం పనిచేసిండు తండ్రిలాంటి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలోనే ఎవరి ఊహలకూ అందని ఎన్నో విధాన నిర్ణయాలు తీసుకున్నరు, విజయవంతంగా అమలుచేసిన్రు తన పదేండ్ల పాలనలో. ప్రత్యర్థి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి మనకు ఎలాంటి సహకారమూ అందించకపోయినా వెనుకడుగు వేయలేదు.
పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కొక్క పైసా కూడబెట్టే ఇంటి పెద్ద లాగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం పట్ల ప్రత్యేక దృష్టిపెట్టి సంపద సృష్టించిండు. ఆ సంపదను సవ్యంగా, సమర్థవంతంగా అందరికీ పంచిండు. నిరుపేదలకు ఇంకా ఎక్కువ పంచిండు. కాబట్టే నేడు కేసీఆర్ పదే పదే ప్రజలకు యాదికి ఒస్తున్నడు. అయ్యో సారును పోగొట్టుకుంటిమే అని వలపోస్తున్నరు. సారే రావాలి, కారే కావాలి అంటున్నరు. ‘సారే’ జహాసే అచ్చా అంటున్నరు. తెలంగాణ పల్లెల్లో ఇదే మార్మోగుతున్నది, పాటలుగా మాత్రమే కాదు, ఆకాంక్షల రూపంలో కూడా.
Telangana needs to be re-invented. Telangana needs to be re-oriented- అన్నరు సీఎం కేసీఆర్ 2018 ‘ఇండియా టుడే’ సదస్సులో. సర్వనాశనమైన తెలంగాణను మళ్లా నిలబెట్టడానికి కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నరు.
అసలు తెలంగాణ పొడ గిట్టని; ఇంకా చెప్పాల్నంటే తెలంగాణ పుట్టుకనే గిట్టని నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా ఎన్నోసార్లు విషం కక్కిండు మనపైన. ద్వేషం తప్ప మరొకటి తెలియని cold blooded పార్టీ బీజేపీ. యుగాల నాటి భరతవర్ష సామరస్య సంస్కృతిని, సమభావనను బొందపెట్టి మనుషులను వారు వేసుకునే బట్టలను బట్టి, తినే తిండిని బట్టి, కొలిచే దేవుడిని బట్టి విభజిస్తూ ఒకరిపై ఒకరిని ఉసిగొల్పుతూ పబ్బం గడుపుకొంటున్నది. పేదరిక నిర్మూలన, నిరుద్యోగం పెచ్చరిల్లుతూ ఉంటే పట్టించుకోరు కానీ కోటిన్నర లక్షల అప్పు చేసి తన మిత్రులకు పంచిపెడుతున్నరు.
పన్నెండు లక్షల కోట్లు సంపన్నులకు బెయిల్ అవుట్ ప్యాకేజీలు ఇచ్చిన్రు. ఇదేమని అడిగితే ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతున్నరు. ప్రత్యర్థి పార్టీల ముఖ్యమంత్రులను సైతం జైలుకు పంపుతున్నరు. ఎన్నికల కమిషన్, విజిలెన్స్ కమిషన్, కొండొకచో న్యాయవ్యవస్థ కూడా వీరికి వంతపాడటం దురదృష్టకరం. ఉత్తర భారతదేశం నేడు దుర్భర దారిద్య్రంలో; మితిమీరిన జనాభాతో; పెచ్చరిల్లిన పేదరికం, నిరుద్యోగంతో కునారిల్లుతున్నది. అందుకు ఏకైక కారణం ఆయా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు. మతం మత్తులో తమను ముంచి, పేదరికంలో తోసింది వీరే అని గ్రహించిన ఉత్తర భారతీయులు నేడు తిరగబడుతున్నరు. బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతున్నది. కాబట్టే ఆ పార్టీ దక్షిణ రాష్ర్టాలపై పడ్డది.
కేసీఆర్ పాలనలో దేశ జీడీపీకి ఎక్కువ కంట్రిబ్యూట్ చేసింది తెలంగాణ రాష్ట్రం. సమర్థమైన జనాభా నియంత్రణతో మనముంటే, నేడు అదే శాపంగా మనకు పార్లమెంట్ సీట్ల పెంపు చేయడం లేదు. పార్లమెంట్లో మన వాణి వినిపించకుండా, వినిపించినా పీలగా ఉండేలా పన్నాగం పన్నుతున్నది బీజేపీ. సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు బాగుండి, అందరికీ అభివృద్ధి-సంక్షేమంలో సముచిత వాటా దక్కే విధానానికి బీజేపీ దూరం. గుప్పెడు మంది కోసమే పనిచేసింది బీజేపీ పదేండ్ల తమ పాలనలో. రైతులు, నిరుపేదలు అంటే ఆ పార్టీకి అసహ్యం! వారిని బిచ్చగాళ్లుగా భావిస్తది కాబట్టే కష్టాల్లో ఉన్నపుడు ఇచ్చే ఊరటను కూడా వడ్డీతో సహా వసూలు చేయాలనుకునే గుజరాతీ వ్యాపార మనస్తత్వమే ఎన్డీయే డీఎన్ఏ!
కేసీఆర్ చెప్పే ఎన్నో అంశాలు గమనిస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది వారి వ్యాపార ధోరణి. ఒకసారి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కేసీఆర్ ‘రైతుబంధు’ గురించి చెప్తే, కేంద్రమంత్రి అన్న మాట మీరు ఇచ్చిన డబ్బును వారు ఎన్ని ఇన్స్టాల్మెంట్లలో తిరిగి చెల్లిస్తరు?. ఇదీ వారి సహృదయం!! మరొక మంత్రి పీయూష్ గోయల్ నూకల బియ్యం పంచండి మీ ప్రజలకు. వారు తింటరు అన్నరు. ధరల పెరుగుదలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెటకారాలకు లెక్కే లేదు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టకపోతే మీకు అప్పులు పుట్టకుండా చేస్తమని కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది మోదీ ప్రభుత్వం! మన రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకాలు పెడుతూ మరొకవైపు రాజకీయంగా దెబ్బతీయాలని ఎన్నో కుట్రలు చేసింది. తన ప్రభుత్వాన్ని పడదోయాలని వచ్చిన బీజేపీ అధిష్ఠాన దూతలకు కేసీఆర్ చిప్పకూడు తినిపించారనే కక్షతో ఆయన కుటుంబంపై పగబట్టింది. అయినా వెరవకుండా రెండు జాతీయ పార్టీలతో యుద్ధం చేస్తున్నది బీఆర్ఎస్.
ఒకవైపు అసమర్థ, అవినీతి, అరాచక కాంగ్రెస్ మరొకవైపు భ్రష్ట, నికృష్ట, మతపిచ్చి బీజేపీ. తెలంగాణను సర్వనాశనం చేస్తూ ఒకరు, దేశాన్నే ద్వేషగుండంగా మారుస్తూ మరొకరు! వీరిరువురి పట్లా అప్రమత్తంగా ఉండాలె, తెలంగాణను కాపాడుకోవాలె. పదేండ్ల వెలుగు జిలుగుల పాలన మళ్లీ రావాలె. అత్యధికంగా బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉండాలె. తెలంగాణ సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ ఎవ్వరితోనైనా కొట్లాడి మనకు రావాల్సినవి తెస్తది.
2011లో పిడికెడు మందితో ప్రయాణం మొదలుపెట్టి, శూన్యం నుంచి సునామీ సృష్టించి, రాష్ర్టాన్నే సాధించిన నాయకుడు; సకల జనుల సమష్టి కృషితో తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన పాలన అతిత్వరలోనే తిరిగి రావాల్సిన అవసరం ఉన్నది. మన జీవితాలు పూర్తిగా చితికిపోకముందే మారాకు వేయవలసి ఉన్నది.
420 మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి అబద్ధాలన్నీ అయిపోయి, ప్రజల తిరుగుబాటుకు అసహనానికి గురై బూతులకు దిగుతున్నడు. వాటిని ప్రసారం చేసే మీడియాను దబాయిస్తున్నడు. కేసీఆర్ పాలనపై విషం చిమ్మడంలో కాంగ్రెస్ పార్టీకి నాడు వంతపాడిన మేధావులు నేడు మౌన సమాధిలో ఉన్నరు. ప్రగతిభవన్ విలాసాలంటూ అన్యాయపు ఆరోపణలు గుప్పించిన్రు. సచివాలయంపైనా అధమ స్థాయి ఆరోపణలు చేసిన్రు. నేడు అక్కడే కూచొని పాలిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎంలు అద్దం ముందు నిలబడి తమ అబద్ధాలను తలచుకుంటూనే ఉంటరు. నాడు తాము విమర్శించిన అధికారులనే నేడు కీలక పదవుల్లో కూచోబెట్టిన్రు.
రెండు ప్రమాదాలు జరిగినై కాంగ్రెస్ వల్ల ఒకటి, కేసీఆర్ అభివృద్ధి-సంక్షేమాల పాలనకు ముగింపు; రెండు, ఏ ఆరోపణలు చేసి, కేసీఆర్‌ను ప్రజాకంటకుడిగా చిత్రించి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన్రో వాటిని మరిచి అసలైన లోక కంటకులుగా ప్రవర్తించడం. హక్కుల గురించి ప్రశ్నిస్తే చెప్పుతో కొడతమని కేసీఆర్ పాలనలో ఏ మంత్రీ అనలేదు; ప్రాజెక్టులలో నిండుగా నీళ్లున్నా కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టే కుట్రతో పొలాలను ఎండబెట్టిన్రు. ఉద్యమకారులను జైళ్లకు పంపుతున్నరు. పల్లె-పట్నం తేడా లేకుండా అంతటా కరెంటు కోతలు. పౌండ్రక వాసుదేవుడిలా తానే అసలైన ఉద్యమకారుడిని అని పోజు కొడుతున్న రేవంత్‌రెడ్డి కోతలు! వీటిని సహిస్తున్న మేధావి వర్గం!
ఎంత విషాద స్థితి మన తెలంగాణది. సహిద్దామా వీరిని? భరిద్దామా ఈ అరాచకం? నికార్సయిన తెలంగాణ బిడ్డలు, ముఖ్యంగా యువత ఆలోచించాలె. నివురుగప్పిన మన చైతన్యం మళ్లీ ఎగిసిపడాలె. కుల, మత, కుట్ర రాజకీయాలకు తెర దించాలె. వాటిలో అందెవేసిన రెండు జాతీయ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలె.
ప్రాంతీయ అస్తిత్వం నిలబెట్టాలె. రేపు ఈ సమయానికి మొదలయ్యే ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలే గెలువాలె. ప్రజల ప్రతినిధి బీఆర్ఎస్కు పట్టం కట్టాలె. ప్రజా శత్రువులతో కేసీఆర్ బలంగా కలబడాలంటే… మీ కోసమే తలపడాలంటే… కేసీఆర్ గెలువాలె. అదే తెలంగాణ గెలుపు; రేపటి మేలి మలుపు. సారుపై అకారణ కోపం మాని, మన కోసం ఆయనకు మద్దతు పలకాలె. నిజంగా చెప్తున్న ‘సారే’ జహాసే అచ్చా!
శ్రీశైల్ రెడ్డి పంజుగుల
90309 97371