కరీంనగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్దే విజయమని, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. నలభై ఏళ్లలో జరగని పనులు పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగాయని, పట్టణాలు, నగరాలను అభివృద్ధి చేసింది తామేనని, రేపు అభివృద్ధి చేసేది కూడా తామేనని చెప్పారు. నగర, పట్టణ పౌరులను ఓటడిగే హక్కు తమకే ఉందని స్పష్టం చేశారు. కరీంనగర్ శివారు చింతకుంటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పార్టీ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంతకు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో రెండుసార్లు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుని ఊహించని అభివృద్ధి సాధించామని గుర్తు చేశారు. బోయినపల్లి వినోద్‌కుమార్ ఎంపీగా ఉన్నపుడు కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీని సాధించి, రూ.వెయ్యి కోట్లతో నగరాన్ని అందంగా తీర్చిదిద్దామన్నారు. అంతే కాకుండా, నగరానికి దీటుగా జిల్లాలోని జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి మున్సిపాలిటీలను కూడా అభివృద్ధి చేశామన్నారు.
కేంద్ర, రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ అభివృద్ధిలో ఘోరంగా విఫలమయ్యాయని, అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ కరీంనగర్ అభివృద్ధికి ఒక్కపైసా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కరీంనగర్‌కు మంజూరై పెండింగ్‌లో ఉన్న 330 కోట్ల సీఎం అస్యూరెన్స్ పనులనైనా కొనసాగించాలని అనేకసార్లు కలెక్టర్‌కు, ఇతర అధికారులకు విన్నవించినా, ఆఖరికి రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించినా ఎలాంటి స్పందనా లేదన్నారు. 2023 నవంబర్ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కోసం ఖర్చు చేయ లేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా ఇప్పటి వరకు ఎలాంటి నిధులూ తేలేదని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ హయాంలో వేసిన రోడ్లపై ఇప్పుడు ఎక్కడైనా గుంతలు పడితే కనీసం వాటిని పూడ్చే పరిస్థితి కూడా ప్రస్తుత ప్రభుత్వానికి లేదని, రేపు కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఎవరు అధికారంలోకి వచ్చినా నగరాలు, పట్టణాలు కంపు కొడతాయని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అనేక పనులకు ప్రస్తుత ప్రభుత్వం మోకాలడ్డుతోందని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ముస్లిం మైనార్టీలకు ఈద్గా స్థలాన్ని ఇస్తే అడ్డుకుంటున్నారని, అంబేద్కర్ భవన్, షాదీఖానాలను పక్కన పడేశారని మండిపడ్డారు. తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తామని, త్వరలోనే కమిటీలు కూడా వేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జడ్పీ మాజీ చైర్ పర్సన్లు తుల ఉమ, విజయ, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.

19న కరీంనగర్‌కు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 19న కరీంనగర్‌కు వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించే ఆత్మీయ సత్కారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆయన సమక్షంలోనే అందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– గంగుల కమలాకర్, ఎమ్మెల్యే
కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు పోరాడాలి
పోరాటాల పురిటి గడ్డ కరీంనగర్ నుంచే మరో పోరాటం ఆరంభం కాబోతున్నది. ఆ పార్టీని గద్దె దించేందుకు ఇక్కడి నుంచి పోరాడాలి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే.. తట్టెడు మట్టి తీసింది లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు ఇద్దరు ముగ్గురు మంత్రులు వచ్చారు. కానీ, ఎక్కడా ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మార్పు వస్తుందని చెప్పారు. కానీ, నిజమైన మార్పు ఇప్పుడు వస్తున్నది. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్వైపే చూస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నా నియోజకవర్గంలో అత్యధికంగా బీఆర్ఎస్ సర్పంచులు గెలువడమే అందుకు నిదర్శనం. రానున్న ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయం.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే
ఒక్క రూపాయి కూడా రాలే..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలకు ఒక్క రూపాయి కూడా రాలేదు. పట్టణ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. ఏండ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని కరీంనగర్‌ను పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దింది. నా నియోజకవర్గ కేంద్రం హుస్నాబాద్ రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు. అసమర్థ ప్రభుత్వంలో నిధులు రావడమే కష్టంగా ఉంది. రేపు మున్సిపాలిటీలను పూర్తిగా పట్టించుకోరు.
– వొడితల సతీశ్‌కుమార్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే
రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం
గతంలో ఎవరూ చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారు. అన్ని పట్టణాలకు నిధులు ఇచ్చారు. చొప్పదండి మున్సిపాలిటీకి 140 కోట్లు తెచ్చి అభివృద్ధి చేశా. గ్రామంగా ఉన్న చొప్పదండిని పట్టణంగా తీర్చిదిద్దా. 100 పడకల దవాఖానను మంజూరు చేయించా. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలను గెలుచుకుని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో అసమర్ధ ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యం కాదు.
– సుంకె రవిశంకర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్‌కు ఎదురుగాలి
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నది. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకే గెలుపు అవకాశం ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా బీఆర్ఎస్ సత్తా చాటింది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. పోయిన పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం ఓట్లు సాధించిన ఘనత బీఆర్ఎస్ది. ఈ విషయాన్ని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ప్రస్తావించి అక్కడ బీఆర్ఎస్కు మొగ్గు ఉన్నదని అంగీకరించారు. కరీంనగర్ నగరానికి తలమానికంగా కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దానిని పట్టించుకోవడం లేదు. బ్రిడ్జిపై రెండేళ్ల కింద లైట్లు ఎలా వెలిగేవి? ఇప్పుడు ఎలా ఉన్నది. అంతా చీకటి అలుముకున్నది?
– బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ
కాంగ్రెస్, బీజేపీని నిలదీయాలి
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందనే నమ్మకం నాకున్నది. కరీంనగర్‌తోపాటు నా నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతానికిపైగా అభివృద్ధి జరిగింది. మిగిలిన 10 శాతం అభివృద్ధిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతున్నది. గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్నప్పుడు రూ.వెయ్యి కోట్లతో నగరాన్ని అంత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓట్లు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్, బీజేపీని నిలదీయాలి. ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించాలి.
– పాడి కౌశిక్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే