సూర్యాపేట, జనవరి 12 (నమస్తే తెలంగాణ): వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రకటన వెలువడిన నాటి నుంచి ఆశావహుల్లో టెన్షన్ రెట్టింపవుతోంది. అన్నా.. రిజర్వేషన్లు ఎలా ఉంటాయి… మారతాయా… మారకుండా పాత రిజర్వేషన్లే కంటి న్యూ అవుతాయా…అంటూ లీడర్లు ఆరా తీస్తుండటం వినిపిస్తోంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయడంతో పాటు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవుతుండటం తో ఆశావహులు రిజర్వేషన్లు, ఖర్చు తదితర అంశాలపై చర్చోపచర్చలు వినిపిస్తున్నాయి.
ఆయా రాజకీయ పార్టీల తరఫున పోటీలో నిలవాలనుకునే వారు ఎక్కడో ఒక చోట రిజర్వేషన్ కలిసి వస్తుందనే ఆశతో ఒక్కొక్కరు రెండేసి వార్డులపై గురిపెట్టి తమకు దగ్గరగా ఉండే నాయకులతో మాట్లాడుతూ పెద్ద నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతుండగా.. బరిలో నిలవాలనుకుంటున్న ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీల్లోని ఓటరు జాబితా షెడ్యూల్ను వెలువరించి ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించింది. ఇక మిగిలింది ఫైనల్ జాబితా, రిజర్వేషన్లు మాత్రమే. దీంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికలు పక్కా అని తేలడంతో జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మొత్తం ఐదు మున్సిపాలిటీల్లోని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సూర్యాపేటలో 48, కోదాడలో 35, హుజూర్నగర్లో 28 వార్డులతో పాటు నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో 15 చొప్పున మొత్తం జిల్లాలో 141 వార్డుల్లో సందడి మొదలైంది. ఆయా వార్డుల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు రిజర్వేషన్లపై సొంతంగా ఓ అంచనాకు వస్తున్నారు.
రిజర్వేషన్లను బట్టి భార్యాభర్తల్లో ఎవరో ఒకరు పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. తమ వార్డులతో పాటు అతి సమీపంలో ఉండే వార్డుల్లో కులాల వారీగా జనాభా, ఓటర్ల సంఖ్యతో రిజర్వేషన్లపై చర్చిస్తూ రెండేసి వార్డులపై దృష్టి పెట్టి ఎక్కడ కలిసొస్తే అక్కడ నిలబడాలనే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చైర్మన్గా పోటీ చేయాలనుకునే కొంతమంది నిధులు సమకూర్చుకుంటూ తమను ముందుగా ప్రకటిస్తే ఖర్చుల సంగతి తామే చూసుకుంటామంటూ ఆయా రాజకీయ పార్టీల అధిష్టానాల వద్ద పైరవీలు చేసుకుంటున్నారు. సూర్యాపేట, కోదాడలో ఈ సంఖ్య కాస్త ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.
టిక్కెట్ల కోసం జోరుగా ప్రయత్నాలు..
వార్డుల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు రిజర్వేషన్లు ఎక్కడ కలిసి వస్తే అక్కడే పోటీ అన్న ఆలోచనతో రెండు మూడు వార్డులపై దృష్టిపెట్టి పెద్ద నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటూ..మరో పక్క ఎన్నికల ఖర్చుల నిమిత్తం నిధులు సమకూర్చుకునే పనిలో పడ్డారు. గత మున్సిపల్ ఎన్నికల్లో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ మున్సిపాలిటీల్లో ఒక్కో అభ్యర్థి రూ.20 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు చేయగా నేరేడుచర్ల, తిరుమలగిరిలో రూ.20 నుంచి 30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు నాడు పోటీ చేసిన అభ్యర్థులే చెబుతున్నారు.
కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మున్సిపాలిటీల్లో ఓటర్లకు రూ.1500 నుంచి 2వేల వరకు పంచినట్లు ప్రచారం జరగడంతో ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు రూ.40 నుంచి 50 లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఆశావహులు నిధుల సోర్స్ చూసుకుంటూ ఇండ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు తాకట్టు పెట్టి అప్పుల కోసం తిరుగుతున్నారు. మరి నామినేషన్లు వేసి, ఉపసంహరణ గడువు ముగిసే నాటికి ఏం జరుగుతుందో.. పోటీలో నిలవాలనుకునే ఉత్సాహవంతులు ఎంత మందిని అదృష్టం వరిస్తుందో తెలియదు కానీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహుల్లో మాత్రం టెన్షన్ మొదలైంది.