రంగారెడ్డి, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టింగ్‌ల కోసం పోటీ తీవ్రంగా ఉన్నది. కీలకమైన కార్యాలయాల్లో పోస్టింగ్‌ల కోసం అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పి విధుల్లో చేరుతున్నారన్న ఆరోపణలున్నాయి. రెవెన్యూ, విద్యుత్, రిజిస్ట్రేషన్, మున్సిపల్, పంచాయతీ, ఎంపీడీవో కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌లుగా మారాయని పలువురు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విధుల్లో చేరినప్పటి నుంచే లంచంగా చెల్లించిన మొత్తాన్ని రాబట్టేందుకు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని.. ఓవైపు ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా ఆ ఆఫీసర్ల తీరులో మార్పు రావడంలేదని పలువురు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా కొంతమంది అధికారులు విధుల్లో చేరినప్పటి నుంచే ఫైల్‌కు ఇంత చెల్లించాలని నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారని.. వారు చెప్పిన విధంగా లంచాన్ని చెల్లించకుంటే ఆ ఫైల్‌ను పెండింగ్‌లో పెడుతున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. జిల్లాలో భూముల ధరలు పెరగడంతోపాటు నిర్మాణ రంగమూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ నేపథ్యంలో భూముల బదలాయింపు, నిర్మాణాల అనుమతులు, రికార్డుల్లో మార్పులు, చేర్పులు, రిజిస్ట్రేషన్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది అధికారులు లేనిపోని అడ్డంకులు సృష్టించి పెద్ద ఎత్తున డబ్బులు డిమాం డ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఆరు నెలల్లోనే పదుల సంఖ్యలో పట్టుబడిన అధికారులు..
జిల్లాలో గడిచిన ఆరు నెలల్లో అవినీతికి పాల్పడుతూ 20 మంది వరకు అధికారులు ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డారు. కీలకమైన శాఖల్లో పనిచేస్తున్న అధికారులు లంచాలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా వారికి దొరికిపోయారు. తలకొండపల్లి, ఆమనగల్లు తహసీల్దార్లతోపాటు తలకొండపల్లి, ఇబ్రహీంపట్నం ఆర్ఐలు, అలాగే, నందిగామ ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి, కొత్తూరు మండలానికి చెందిన మరో పం చాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
వనస్థలిపురం, పెద్దఅంబర్‌పేట సబ్రిజిస్ట్రార్లు, ఆదిబట్ల, నార్సింగి వంటి ప్రాంతాల్లో పనిచేసిన టీపీవోలు కూడా లంచం తీసుకుం టూ దొరికిపోయారు. అలాగే, రంగారెడ్డి కలెక్టరేట్లో పనిచేస్తున్న ల్యాండ్ రికార్డు ఏవో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దొరికిపోయారు. అలాగే, విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న పలువురు ఏఈలు, ఏడీఈలు, లైన్మన్లు కూడా అవినీతి నిరోధకశాఖ అదికారులకు పట్టుబడ్డారు. కాగా, జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.