మహబూబ్‌నగర్‌లో గతంలో తాగునీటి కోసం.. రహదారులు.. దవాఖానలు లేక ఇబ్బందులు పడితే కేసీఆర్ హయాంలో రూ.వందల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేపట్టినట్లు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేశారు. కానీ తాము చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ కొనసాగించడం లేదని ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలో ఆధునిక మార్కెట్ల కోసం.. స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపడితే పూర్తి చేయడం లేదని దుయ్యబట్టారు. వెయ్యి పడకల దవాఖానను తీసుకొస్తే నిర్మాణం పూర్తయినా మిషనరీ కోసం రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. దవాఖాన ఎదుట టూరిజం హోటళ్లు, షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలనుకుంటే పునాదులకే పరిమితమయ్యాయన్నారు. రూ.కోట్లు ఖర్చుపెట్టి మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తే అసంపూర్తిగా పనులు వదిలేశారన్నారు. శిల్పారామం బూజు కూడా దులుపలేని స్థితి నెలక్నొదన్నారు.
పాలమూరు పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలోని 14 లక్షల ఎకరాలకు నీరు అందించే కార్యక్రమం చేపట్టినా కొద్దిపాటి పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద మత్స్యకారులు, ఆరె కటికలు, ఇతర కులాల వారికి అందుబాటులో మార్కెట్ అవకాశం కల్పిస్తే దాన్ని మార్చి గ్రంథాలయం కట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గ్రంథాలయం కట్టాలంటే వేరే స్థలాలు లేవా..? చుట్టూ గోడలు పెట్టి.. పైన రేకులేస్తే అయిపోయే మార్కెట్‌కు ఇతర వాటికి వినియోగిస్తున్నారని విమర్శించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని పక్కకు పెట్టి ఈ రెండేళ్లలో కొత్తగా తీసుకొచ్చింది ఏమిటో ప్రజలకు తెలపాలని సవాల్ విసిరారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా జరిగిందా? అంటూ ప్రశ్నించారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తాను కష్టపడి మున్సిపాలిటీకి రూ.120 కోట్లు మంజూరు చేయిస్తే వీటితో వార్డుల్లో పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేషన్‌ను మనమే సాధించుకున్నాం.. ఈ ఎన్నికల్లో కూడా కార్పొరేషన్‌ను గెలిచి మన తడాఖా చూపించాలని పార్టీ శ్రేణులను కోరారు.
మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సూచించారు.
మహబూబ్‌నగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘రెండు సంవత్సరాల్లో ఒక్క వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీతో లబ్ధి జరగలేదు.. మళ్లీ పరిశ్రమలు రావాలన్నా.. పాలమూరు-రంగారెడ్డి పూర్తి కావాలన్నా.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి, అప్పుడే సాధ్యమవుతుందని.. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును మళ్ళీ చేయొద్దని ఈసారి.. మున్సిపల్ ఎన్నికల నుంచి జైత్రయాత్ర మొదలుపెడదాం’.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లా కేంద్రంలో జరిగిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టే కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రేవంత్‌రెడ్డి కావాలనే పక్కన పెట్టారని కేటీఆర్ విమర్శించారు. లక్షలాది ఎకరాలకు గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వడంతో వలస పోయిన ప్రతి మహబూబ్ నగర్ బిడ్డ తిరిగి వచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.
కానీ మహబూబ్‌నగర్ బిడ్డను అని చెప్పుకునే రేవంత్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కావాలనే అడ్డుకుంటున్నారన్నారు. రూ.30 వేల కోట్లతో 90 శాతం పనులు పూర్తి చేసినా.. కనీసం మిగిలిపోయిన 10 శాతం పనులు పూర్తి చేయలేక కావాలని ఆపుతున్నారన్నారు. కేవలం కేసీఆర్‌కి పేరు వస్తుందన్న దురుద్దేశంతో, తమ పాత బాస్ చంద్రబాబుకి కోపం వస్తుందన్న ఏకైక కారణంతోనే ఈ రెండేళ్లు పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నారని ఆరోపించారు. కనీసం రైతన్నలకు యూరియా బస్తాలు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం, రైతన్నలకు మంచి చేసి మహబూబ్‌నగర్‌ను సస్యశ్యామలం చేస్తామని చెప్తే ఎవరు నమ్ముతారని కేటీఆర్ ప్రశ్నించారు. 17వ తేదీన పాలమూరుకు వస్తున్న ముఖ్యమంత్రి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన పదుల సంఖ్యలో పరిశ్రమలన్నీ తిరిగి ఎందుకు వెళ్లిపోయాయో పాలమూరు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
ఈ రెండు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమనైనా కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్‌కు తీసుకువచ్చిందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ఐటీ టవర్‌ని ఎందుకు పక్కన పెట్టారని కేటీఆర్ రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. రూ.9,500 కోట్లతో అమరరాజా వంటి కంపెనీ భారీ పెట్టుబడులను తెలంగాణకు, ముఖ్యంగా మహబూబ్‌నగర్‌కే తీసుకువచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌కు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. పెండ్లిళ్లకు, చావులకు వెళ్లడం తప్పించి ఎన్నికైన తర్వాత ప్రజలకు చేయడానికి మొన్నటి దాకా ఒక్క రూపాయి కూడా లేదు అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా చెబుతున్నారు అన్న విషయాన్ని మహబూబ్‌నగర్ ప్రజలు గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా అభివృద్ధి లేదన్నారు. అందుకే మరోసారి బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆరు గ్యారెంటీలు.. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉన్న పథకాలు పోయాయన్నారు. రైతుబంధు కేసీఆర్ 2 పంటలకు ఇస్తే.. రేవంత్ 3 పంటలకు ఇస్తానని చెప్పాడు. వృద్ధులకు డబుల్ పింఛన్ అన్నారు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం అని హామీ ఇచ్చారని, కానీ మేము ఆ రోజే చెప్పాం కాంగ్రెస్ బంగారమిచ్చే బ్యాచ్ కాదు.. పుస్తెలు ఎత్తుకుపోయే బ్యాచ్ అని కేటీఆర్ అన్నారు.
పాలమూరు బిడ్డ రేవంత్‌కు బంగారం దొరకడం లేదా? ఉన్న హామీలే అమలు చేయడం చేతకాని రేవంత్ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూ.కోటి కోట్లు ఉన్నాయా? అబద్ధాలు ఆడినా అతికినట్టు ఉండాలి. కానీ రేవంత్ సిగ్గులేకుండా అబద్ధాలు ఆడుతున్నాడని విమర్శించారు. రెండేళ్ల రేవంత్ పాలనలో ఏ వర్గానికి అభివృద్ధి ఫలాలు దక్కలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉందని కేటీఆర్ విమర్శించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే.. పంచాయతీలకి తాగునీటి నుంచి మొదలుకొని పారిశుధ్యం దాకా అన్ని రంగాల్లో కేసీఆర్ అద్భుతమైన ప్రగతి సాధించేలా గ్రామాలను తీర్చిదిద్దారు. రెండు సంవత్సరాల కాలంలో ఉన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రేవంత్ పక్కన పెట్టాడని, ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీల అమలు గురించి రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తే రేవంత్ బూతులు తిడుతున్నాడన్నారు.
అందుకే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు ప్రజలు నిలిచారని కేటీఆర్ అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో ముందుకు పోవాలి, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పార్టీ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, అబ్దుల్హ్రమాన్, శివరాజ్, ఆంజనేయులు, మూస నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్/మూసాపేట, జనవరి 12 : జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. డీసీసీబి మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్ కుమారుడు ప్రవీణ్‌తోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కారెక్కారు. అలాగే మాచన్‌పల్లికి కాంగ్రెస్ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆ పార్టీ గ్రామ ఉప అధ్యక్షుడు హరికృష్ణతో పాటు చౌదర్పల్లికికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపు మేరకు దేవరకద్ర నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీశ్రేణులు కేటీఆర్ సభకు తరలివెళ్లారు. భూత్పూర్లో మోటర్ సైకిల్ ర్యాలీని ఆల ప్రారంభించి తరలివెళ్లారు. అడ్డాకులకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఖాజామైనొద్దీన్, నిరంజన్గోరి, నసీర్‌తోపాటు ఆయన మద్దతుదారులతో పాటు బీజేపీకి చెందిన అరుణ్‌కుమార్, పలువురు బీఆర్ఎస్లో చేరారు. వీరికి కేటీఆర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే ఆల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీనరసింహా యాదవ్, సురేందర్‌రెడ్డి, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.