ఒక్కో మతం ఒక్కో ప్రదేశాన్ని సందర్శిస్తుంది. వివిధ తీర్థయాత్రలు, జాతరలకు తరలుతుంది. ఒక్కో వర్గం ఒక్కో దైవాన్ని ఆరాధిస్తుంది. ఇవన్నీ వేర్వేరు సీజన్లలో, వేర్వేరు రోజుల్లో వారి వారి నమ్మకాలు, విశ్వాసాల మేరకు జరుగుతుండటాన్ని మనమంతా చూస్తుంటాం. కుల, మతాలకతీతంగా తమందరి బంగరు భవిత కాంక్షించి, నవీన భారతావని కోసం తెలంగాణ ఒడి నుంచి సరికొత్తగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్). ఈ పార్టీ తొలి బహిరంగ సభ అసలు సిసలైన సంరంభంగా, యావత్భారత జాతి జాతరలా, ప్రజా సమూహాల ప్రవాహంతో ఖమ్మం వెంకటాయపాలెం కుంభమేళాను తలపించింది.
భిన్న సంస్కృతులు, వైవిధ్య సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వమై మహాత్ముడు తలచిన భారతదేశ నికార్సయిన ఆత్మను బీఆర్ఎస్ తొట్ట తొలి సభ శుభారంభాన ఆవిష్కరించింది. చరిత్రలో చెరిగిపోని ముద్రవేసింది. భిన్నవర్గాలు, మతాల సమ్మేళనంగా జనసంద్రమైంది. ఈ నేల ఈనిందా అనే విధంగా సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. కనుచూపునకు అందని, చేతి కెమెరాలకు చిక్కని, డ్రోన్ కెమెరాల రౌండ్ల పరిధికి మించి జనచేతన కెరటాలుగా ఉప్పొంగింది. అఖండ ప్రజా సమూహాలతో భారతజాతిని జాగృతం చేసింది. ‘భళా బీఆర్ఎస్ భళా’ అంటూ అధికార పార్టీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే తామున్నామని సప్త సముద్రాల సంగమంగా సాక్షాత్కరించింది. దేశ రాజకీయాల్లో కొంగొత్త ఒరవడికి, సమకాలీన విప్లవానికి నాంది పలికింది. ఉత్తరాది, దక్షిణాది రాష్ర్టాలనే భేదం లేకుండా భారత జాతిని ఏకం చేయడానికి బాటలు వేసింది. జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు బీజం పడింది. బీఆర్ఎస్ మొట్టమొదటి భారీ బహిరంగ సభగా ఖమ్మం గడ్డ యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకొన్నది.
సగటు జీవికి హాని తలపెడుతున్న దేశ ఏలికల పాపాలకు చరమగీతమై గొంతెత్తింది. రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్యస్ఫూర్తికి గొడ్డలిపెట్టుగా పరిణమించిన పాలక ప్రభువుల నిజస్వరూపంపై కన్నెర్ర జేసింది. సాహసోపేతంగా బీఆర్ఎస్ మనందరి మంచికోసం స్థాపించిన కేసీఆర్‌పై అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించింది. ముగ్గురు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ అగ్రనేత వంటి మహామహులను ఖమ్మం గుమ్మానికి రప్పించిన కేసీఆర్ శక్తిసామర్థ్యాలకు జేజేలు చెప్పింది. దేశంలో ఏడెనిమిది జాతీయ పార్టీలు, దాదాపు మూడు వేల ప్రాంతీయ పార్టీలున్నప్పటికీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్గా అవతరించిన తొలిసభతోనే పెను సంచలనం సృష్టించడాన్ని గర్వంగా చాటింది. దేశంలోనే గుర్తింపున్న రాష్ర్టాల్లో ఒకటైన దేవభూమి కేరళ సీఎం ఎర్రన్న పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఖమ్మం వేదికగా తూర్పారాబట్టారు.
దేశంలో ప్రజాపాలన ఆవశ్యకతను ఎర్రన్న ఎలుగెత్తారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ పథకాలను చూసి నేర్చుకోవలసి ఉన్నదని దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వేధింపులను కండ్లకు కట్టారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన అనివార్యతను ఉటంకించారు. భగత్‌సింగ్ జన్మించిన నేల పంజాబ్ సీఎం భగవంత్ సింగ్మాన్ బీజేపీ సర్కార్ పెడధోరణులు, పోకడలపై అఖండ ప్రజాసమూహాలను ఆలోచింపజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నాడు అండగా నిలబడిన సీపీఐ దిగ్గజం డి.రాజా కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష తీరును ఎండగట్టారు. గోరంత కూడా మేలు చేయకుండానే కొండంత ప్రచారం చేసుకునే సెంట్రల్‌లోని బీజేపీ ప్రభుత్వమెక్కడ, కొండంత మేలు చేస్తూ గోరంతైనా పబ్లిసిటీ చేసుకోని తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ ఎక్కడ అంటూ నక్కకూ, నాగలోకానికి ఉన్న తేడాను యూపీ మాజీ ముఖ్యమంత్రి సమాజ్‌వాదీ పార్టీ సారథి అఖిలేష్ యాదవ్ విశదీకరించారు. బీఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కీలకోపన్యాసంలో ప్రపంచంలోనే భారతదేశానికి ఉన్న సకల సౌభాగ్యాలను ప్రస్తావించారు.
దేశంలో 1.40 లక్షల టీఎంసీలు నమోదయ్యే వర్షపాతంలో సగం ఆవిరైపోయినా, మిగతా 70 వేల టీఎంసీల పరిమాణంలో నీటి సౌలభ్యంగా ఇంతటి అపార జలసంపద ఉండి కూడా యాచకం ఏమిటంటూ అనేక అంశాలపై యావన్మంది భారతీయులను ఖమ్మం గడ్డపై నుంచి ఆలోచింపజేశారు. సౌరశక్తి సహా సకల సహజ వనరులు ప్రజా ప్రయోజనాలకు ఒనగూడాలని దృఢంగా ఆకాంక్షించారు. దేశ సంపదను సగటు పౌరులకు సమానంగా అనుభవంలోకి తెచ్చేదే బీఆర్ఎస్ అని తేల్చిచెప్పారు.
దేశంలోని ప్రతి పౌరుని మదిలో బీఆర్ఎస్ పంథా కదలాడేలా అరుదైన, అత్యంత విలువైన, అనితర సాధ్యమైన ఉపన్యాసాన్ని కేసీఆర్ సుసంపన్నం చేశారు. తెలంగాణ తరహా ఉచిత విద్యుత్, రైతుబంధు, దళితబంధు వంటి విప్లవాత్మక పథకాలతో తెలుగు రాష్ర్టాలు సహా దక్షిణాది మొదలు దేశంలోని 29 రాష్ర్టాల సర్వతోముఖాభివృద్ధికి బీఆర్ఎస్ సంసిద్ధతను, విధానాలను యావత్ దేశ ప్రజల ముందుంచారు. మహిళల అభ్యున్నతికి పాటుపడేలా లింగసమాన పరిపాలనా ఫలాలు అందుబాటులోకి తెస్తామని ప్రస్తావించారు. సకలరంగాల ప్రైవేటైజేషన్‌కు కేరాఫ్ అయిన నరేంద్ర మోదీని వచ్చేఏడాదిలో ఇంటికి పంపి తీరుతామని అశేష జనవాహిని ఎత్తిన పిడికిలి సాక్షిగా ప్రతినబూనారు. ‘అగ్నిపథ్’ వంటి అసంబద్ధ నిర్ణయాలను పునఃసమీక్షిస్తామని వెల్లడించారు. కేసీఆర్ ప్రతిధ్వనించిన విజయబావుటా రణధ్వని ప్రకంపనల నడుమ ఖమ్మం కుంభమేళా దేశ రాజకీయాల్లో సమూల, సరికొత్త మలుపునకు మార్గం వేసింది.
(వ్యాసకర్త: ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ప్రతినిధి)
-ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384