ఖమ్మం కమాన్‌బజార్, ఆగస్టు 13 : రాష్ట్రంలో విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు స్పష్టం చేశారు. అందుకే ఏ సమస్యనూ పరిష్కరించడం లేదని, పైగా విద్యార్థులనే సమస్యల్లోకి నెట్టివేస్తోందని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని; విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులు గురువారం ఖమ్మం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.పది వేల కోట్లకు పైగా ఉపకార వేతనాలు, ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.
అయినా వీటిని విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, కమీషన్లు వచ్చే పనులకే బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు. సవతి తల్లి ప్రేమకు ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు. కనీసం విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని నియమించుకోలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను చెప్పుకునేందుకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి వద్దకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అన్ని సబ్జెక్టులు బోధించేందుకు తగినంతమంది అధ్యాపకులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తామంటూ సాక్షాత్తూ అసెంబ్లీలోనే మాటలతో కోటలు కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో ఏమీ చేయలేదని విద్యార్థులు విమర్శించారు. ఖమ్మంలో ఉన్న బీపీఈడీ కళాశాల విద్యార్థినులకు హాస్టల్ వసతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు కిలోమీటర్ల దూరంలో వసతి పొందుతున్న విద్యార్థినులు ఉదయం ఐదు గంటలకు అంతదూరం నడిచి గ్రౌండ్‌కు రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి సంక్షేమ హాస్టళ్లలో సంక్షేమమే లేకుండా చేసిన దౌర్భాగ్యం కాంగ్రెస్ సర్కారుదేనని విమర్శించారు. జిల్లాలోని విద్యారంగ సమస్యలను పరిష్కరించకుంటే జిల్లాలోని ముగ్గురు మంత్రులను కూడా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రవీణ్, వంకాయల రాజు, సాత్విక, దొంతబోయిన వెంకటేశ్, వేలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు.