సుమారు 150 ఏండ్లు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర వారు వారితో కొట్లాడి, నెహ్రూని బలవంతపెట్టి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించుకున్నారు. అయినా ప్రతి విషయంలో తమిళులని విమర్శిస్తూనే, వారితో పోటీ పడుతుంటారు. వారి భాషకు ప్రాచీన భాష హోదా వచ్చాక తమ భాషకు కూడా ఆ హోదా కావాలని చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టులో కేసు వేశారు.
అయితే వారి ఆదికవి నన్నయ (11వ శతాబ్దం)గా చూపటంతో ఆంధ్ర భాషా సాహిత్యానికి 1000 ఏండ్ల చరిత్ర కూడా లేదనీ, పైగా నన్నయ రాసినది మూలకథ కాదు, అనువాదమనీ హైకోర్టు కేసు కొట్టివేసింది. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడి స్వరాష్ట్రం తెచ్చుకున్నాక అప్పటి ముఖ్యమంత్రి ఆ కేసును పునరుద్ధరించి 1వ శతాబ్దం నుంచీ ఉన్న తెలుగు శాసనాలు, సాహిత్యం చూపగా తెలుగుకు ప్రాచీన హోదా వచ్చింది.
హోదా వచ్చింది తెలుగుకే కానీ, ఆంధ్ర భాషకు కాదు. నిజానికి వచ్చే 40 ఏండ్లలో కనుమరుగయ్యే 45 భాషలలో ఆంధ్రం కూడా ఉందని ఒక సర్వేలో యూనెస్కో చెప్పింది.
ఇక 1956 నుంచీ బ్రతికున్న తెలంగాణ వారే కాకుండా 1వ శతాబ్దం నుంచీ 19 శతాబ్దాలలో వివిధ రంగాలలో నిష్ణాతులై ఖ్యాతి గడించిన వారు కూడా ఆంధ్ర రాజకీయ నాయకుల వివక్షకు, అణచివేతకు గురయ్యారు. ఈ వ్యాసంలో ఆంధ్రులు రాసిన సాహిత్య చరిత్రల్లో మరుగునపడేసిన ఈ ప్రాంత కవులు, పండితుల గురించి తెలుసుకుందాం! నన్నయ కాలానికి (11వ శతాబ్దం) వెయ్యేండ్ల ముందే ఇతర భాషల్లో కూడా తెలంగాణలో సాహిత్యం వెలువడిందనీ, వందేండ్ల ముందే తెలుగులో మూలగ్రంథం రాయబడిందనీ ఈ ప్రాంతం బహు భాషల సాహిత్య నిలయంగా వర్ధిల్లిందనీ కూడా చరిత్రకారులు గుర్తించాలి.
ఈ క్రింది సాహిత్య ప్రక్రియల్లో ఆంధ్రులు వెలువరించిన చరిత్రల్లో అన్నీ మొట్టమొదటగా ఆంధ్ర కవులు రాసినట్టు లిఖించారు. అది పరిశీలించాలి.
Telangana | తెలంగాణలో మొట్టమొదటి కవి గుణాఢ్యుడు (1వ శతాబ్దం). హాల శాతవాహనుడి ఆస్థాన కవి అయిన ఈయన ‘బృహత్కథ’ అన్న ఉద్గ్రంథం రచించాడు. దాని అనువాదాలు సంస్కృతంలో ఉన్నాయి. అది ప్రాకృతంలో రాయబడింది. మెదక్ జిల్లా కొండాపూరులో జన్మించిన గుణాఢ్యుడు ఆదిలాబాద్‌లో ఎక్కువకాలం జీవించాడు. తెలుగులో మొట్టమొదటి పద్య సంకలనాన్ని హాలుడు అనే రాజు 700 పద్యాల ‘గాథ సప్త శతి’ అన్న పుస్తకంగా తీసుకువచ్చాడు. 273 ప్రాకృత కవులు పద్యాలు అవి. వాటిల్లో చాలా తెలుగు పదాలు కనిపిస్తాయి. 1వ శతాబ్దానికి చెందిన హాలుడు మొట్టమొదటి సంకలనకర్త.
‘ఉత్తర రామ చరిత్ర’ (సంస్కృతం) లిఖించిన భవ భూతి (680-750 క్రీ.శ.) నిజామాబాద్‌లో బోధన్‌కు చెందిన కవి ‘మాలతీ మాధవం’, ‘మహావీరచరితం’ అనే ఇంకో రెండు గ్రంథాలు రచించినా మొట్టమొదటగా కరుణరసాన్ని సాహిత్యంలో చొప్పించిన ‘ఉత్తర రామ చరిత్ర’ ఎక్కువ ఖ్యాతి పొందింది. నన్నయ రాసిన రీతిలో ఆయన కంటే 150 ఏండ్ల ముందు వేసిన శిలాశాసనంలో సంస్కృతం చేత ప్రభావితమైన తెలుగు కన్పిస్తుంది. దానినే నన్నయ అనుకరించాడు. తెలంగాణలో జీవించిన పంపకవి వేములవాడ చాళుక్య రాజైన రెండవ అరికేసరి ఆస్థాన కవి. కన్నడ భాషల్లో ‘ఆది పురాణం’ (జైన పురాణం) ‘విక్రమార్క విజయం’ (పంప భారతం) అనే గ్రంథాలు కన్నడంలో రచించి, ‘కవితా గుణార్ణవ’ అన్న బిరుదు పొందాడు.
‘కంద పద్యం రాయనివాడు కవి కాదు’ అన్నది ప్రసిద్ధ నానుడి. మొట్టమొదటగా తెలుగు సాహ్యితానికి కంద పద్యాన్ని పరిచయం చేసినది పంపకవి సోదరుడైన జినవల్లభుడు. సంస్కృతం, తెలుగు, కన్నడంలో రాయబడిన ‘కుర్క్యాల బొమ్మలమ్మ గుట్ట’ (కరీంనగర్) శాసనంలో (946 క్రీ.శ.) జిన వల్లభుడు కందపద్యాలు రాశాడు. ఆంధ్రవారి ఆదికవి నన్నయ అయితే, తెలంగాణ తెలుగువారి ఆదికవి మల్లియ రేచన (10వ శతాబ్దం) నన్నయ కంటే ఒక శతాబ్దం ముందే రాసిన గ్రంథం ‘కవి జనాశ్రయము’ మొట్టమొదటిగా తెలుగులో రాయబడిన మూలగ్రంథంగా నిలుస్తుంది. తెలుగు ఛందస్సు మీద రచన, అది 2016లో ప్రచురింపబడింది. ఆంధ్ర రాజకీయాలు మరుగున పడేసిన మహానుభావుడు ఆది కవి మల్లియరేచన!
జంట కవుల రచన మొట్టమొదట తెలంగాణలోనే జరిగింది. బుద్ధారెడ్డి కొడుకులు కాచ, విఠలరెడ్డి కవిద్వయం ద్విపద ఛందస్సులో‘ఉత్తర రామాయణం’ రచించి, ఆయనకు అంకితమిచ్చారు. సమైక్య రాష్ట్ర చరిత్రకారులు మొట్టమొదటి కవిద్వయంగా నంది మల్లయ్య, ఘంట సింగనలను చిత్రించారు. కానీ, అది తప్పు.
తెలంగాణలో 10వ శతాబ్దంలో ఎన్నో సంస్కృతగ్రంథాలు రాయబడ్డాయి. జినవల్లభుడి ‘మహావీర స్తోత్రం’, ఇంకొక కవి రాసిన ‘శ్రీ ధర్మపురి క్షేత్ర మహాత్మ్యం’, శ్రీ పతి పండితుడు రాసిన ‘శ్రీకర భాష్యం’ (950 క్రీ.శ.), గుజరాత్ నుంచి వచ్చి వేములవాడలో చాళుక్యులకు గురువుగా స్థిరపడిన సోమదేవ సూరి రచించిన ‘కథా సరిత్సాగరం’, ‘యశ తిలక చంపూ’ (భైరవ తంత్రం’ (1000 క్రీ.శ.) కొన్ని ఉద్గ్రంథాలు మాత్రమే. తెలంగాణ గడ్డ గర్వించదగిన సాహిత్యం వెలువడింది ఆ శతాబ్దంలో. వృత్తరీతిలో వేసిన మొట్టమొదటి శిలా శాసనం 11వ శతాబ్దంలో వేసిన ‘కామసాని శాసనం’. కన్నడ, తెలుగు భాషలలో చంపకమాల, ఉత్పలమాల పద్యాలున్నాయి ఈ శాసనంలో.
1వ శతాబ్దం నుంచీ తెలంగాణలో ప్రాకృతం, సంస్కృతం, కన్నడం తెలుగు భాషలలో రచనలు, శిలా శాసనాలు విరివిగా వచ్చాయి. అయితే సమైక్య (?) రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా అణచివేయబడిన చరిత్ర అడుగున ఇవన్నీ మరుగున పడ్డాయి. ఇప్పుడు తెలంగాణ సాహిత్య చరిత్రకారులు వీటన్నింటినీ బయటకు తేవాలి. 10వ శతాబ్దం తర్వాత కూడా చాలా సాహిత్య ప్రక్రియల్లో ఆంధ్ర చరిత్రకారులు రాసిన ఆంధ్ర కవుల కంటే ముందే తెలంగాణ కవులు ముందుగా ఆయా ప్రక్రియల్లో రచనలు చేశారు. దాదాపు 22 ప్రక్రియల్లో వారు ముందున్నారనే సంగతి చాలా జాగ్రత్తగా ఆంధ్ర చరిత్రకారులు దాచిపెట్టారు.
మొట్టమొదటి వీరశైవ కవి అయిన మల్లికార్జున పండితుడు (1120-1190 క్రీ.శ.) ‘శివతత్వసారం’, ‘శ్రీ గిరి మల్లికార్జున శతకం’ రచించాడు. మొట్టమొదటి శతక కవి కూడా అయిన ఈయన సంస్కృతంలో ‘శ్రీముఖ దర్శన గద్య’, ‘లింగోద్భవ గద్య’ ‘అక్షరాంక గద్య’ (మల్లికేశ్వర గద్య అని కూడా అంటారు) అనే రచనలు చేశాడు. ఇందులో చివరిది అతి కష్టమైన అక్షరమాల ప్రక్రియ. మొట్టమొదటి దేశి కవి పాల్కుర్కి సోమనాథుడు తెలుగులో పౌరాణిక, చారిత్రక, శతక, ఉదాహరణ, గద్య, రగడ రచనలు చేసిన మహాకవి. మొట్టమొదటి ద్విపద కావ్యం ఈయన రచించిన ‘బసవ పురాణమే’!
తెలుగులో మొట్టమొదటి రామాయణ రచన చేసినది గోన బుద్ధారెడ్డి. రంగనాథ రామాయణంగా ప్రాచుర్యం పొందిన, ఈ గ్రంథంలో వాల్మీకీ రామాయణంలో లేని కథలు కన్పిస్తాయి. అహల్య శాపం, లక్ష్మణ రేఖ, ఉడుత సాయం, సులోచన కథ, ఊర్మిళ నిద్ర, లక్ష్మణుడి నవ్వు మొదలైనవి ఈయన ఊహా సృష్టి అని చాలామందికి తెలియదు. ఎంత భావుకత, మేధ కావాలి ఇలా సృష్టించటానికి!
తెలుగులో మొట్టమొదటి రామాయణ రచన చేసినది గోన బుద్ధారెడ్డి. రంగనాథ రామాయణంగా ప్రాచుర్యం పొందిన, ఈ గ్రంథంలో వాల్మీకి రామాయణంలో లేని కథలు కన్పిస్తాయి. అహల్య శాపం, లక్ష్మణరేఖ, ఉడుతసాయం, సులోచన కథ, ఊర్మిళ నిద్ర, లక్ష్మణుడి నవ్వు మొదలైనవి ఈయన ఊహా సృష్టి అని చాలామందికి తెలియదు. ఎంత భావుకత, మేధ కావాలి ఇలా సృష్టించటానికి! జంట కవుల రచన మొట్టమొదట తెలంగాణలోనే జరిగింది. బుద్ధారెడ్డి కొడుకులు కాచ, విఠలరెడ్డి కవిద్వయం ద్విపద ఛందస్సులో ‘ఉత్తర రామాయణం’ రచించి, ఆయనకు అంకితమిచ్చారు. సమైక్య రాష్ట్ర చరిత్రకారులు మొట్టమొదటి కవిద్వయంగా నంది మల్లయ్య, ఘంట సింగనలను చిత్రించారు. కానీ, అది తప్పు.
తెలుగులో మొట్టమొదటి భక్తిరచనలు చేసినది సంతూరు గ్రామంలో జన్మించిన కృష్ణమాచారి. 4 లక్షల రచనలు చేసిన ఈయనకు ప్రతాపరుద్రుడు 50 గ్రామాలు కలిగిన అగ్రహారం బహూకరించాడు. ఈ కవి సంతూరు దగ్గర కల్లూరు అనే గ్రామాన్ని నిర్మించాడు. మార్గరీతిలో తెలుగులో మొట్టమొదటి పురాణాన్ని రచించినవాడు వరంగల్ జిల్లాకు చెదిన మారన (1280-1333 క్రీ.శ.). ‘మార్కండేయ పురాణం’ తెలుగులో అనువదించిన మారన ప్రతాపరుద్రుని మీద మహమ్మదీయుల దండ్రయాత్రల గురించి ప్రస్తావించలేదు కాబట్టి మారన 1303 క్రీ.శ. కంటే ముందు జీవించాడని భావించవచ్చు.
ఈయన వాడిన ‘ప్రవర’ అన్న పదం నుంచే అల్లసాని పెద్దన ప్రవరాఖ్యుడు జన్మించాడని ప్రతీతి. మారన పద్యరీతిని పోతన కూడా అనుసరించాడు. తెలుగులో చంపూ పద్యరీతిలో మొదటగా వెలువడింది ‘భాస్కర రామాయణం’. ఈ కావ్యాన్ని హళక్కి భాస్కరుడు మొదలుపెట్టగా, మల్లికార్జున భట్టు (భాస్కరుని కుమారుడు), కుమార రుద్రదేవుడు (భాస్కరుని శిష్యుడు) సాకల్య అయ్యలార్యుడు (భాస్కరుని స్నేహితుడు) పూర్తిచేశారు. మత్తకోకిల, తరళం, పృథ్వి వంటి రీతులు ఉపయోగించి యుద్ధం, సాహసం, ప్రేమ మొదలైన వాటిని చాలా ప్రతిభావంతంగా రచించారు ఈ తెలంగాణ తెలుగు కవులు.
మొట్టమొదటగా తెలుగు సాహ్యితానికి కంద పద్యాన్ని పరిచయం చేసినది పంపకవి సోదరుడైన జినవల్లభుడు.
తెలుగులో మొట్టమొదటి పద్య సంకలనం చేసినవారు కరీంనగర్ జిల్లాకు చెందిన మడికి సింగన. ‘సకలనీతి సమ్మతము’ అనే ఈ సంకలనంతో పాటు ‘పద్మ పురాణోత్తర ఖండము, భాగవత దశమ స్కంధము’, ‘జ్ఞాన వాసిష్ఠ రామాయణము’ అనే గ్రంథాలను కూడా రచించాడు సింగన. 1వ శతాబ్దంలో ‘గాథా సప్త శతి’ (ప్రాకృతం) సంకలనం వెలువడిన దాదాపు 13 శతాబ్దాల తర్వాత సింగన చేసిన సంకలనం రెండవ పుస్తకం అని చెప్పవచ్చు. తెలుగులో గొప్ప పద్యాల సంకలనకర్తగా ఖ్యాతి సింగనకే చెందుతుంది.
ఇక బమ్మెరకు చెందిన పోతన మొట్టమొదటి తెలుగు భాగవతకర్త. సంస్కృతంలో వేదవ్యాసుని విరచితమైన ‘భాగవత మహాపురాణా’నికి అత్యంత మృదుమధురంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యేరీతిలో ఎంతో లాలిత్యమైన పదాలతో భక్తిరస ప్రధానంగా పోతన (1, 2, 3, 4,7, 8, 9,10 స్కంధాలు), గంగన (5వ స్కంధం), సింగన (6వ స్కంధం), నారయ (11, 12 స్కంధాలు) రచించిన తెలుగు భాగవతం తెలంగాణ సాహిత్య చరిత్రకే మకుటాయమానంగా నిలుస్తుంది.
హరిశ్చంద్రుని కథను ఒక పూర్తి పద్య సాహిత్యరూపంగా మొట్టమొదటగా మలచినవాడు గౌరన (1400-1450 క్రీ.శ.). అతని రచనలు ద్విపద ఛందస్సులో రాసిన ‘హరిశ్చంద్రోపాఖ్యానము (1440 క్రీ.శ.), ‘నవనాథ చరిత్రము (1445 క్రీ.శ.), సంస్కృతంలో రాసిన ‘లక్షణ దీపిక’ ఈ గ్రంథం తెలుగులో ఉపయోగింపబడని సుమారు 50 ఛందోరీతుల గురించి వివరిస్తుంది. మొట్టమొదటగా తెలుగులో ఊహాజనిత రచనలు (ఫిక్షన్) చేసినవారు నూతన కవి సూరన, చరిగొండ ధర్మన. వారిద్దరూ పురాణాల్లో, భాగవతంలో ఉన్న వ్యక్తులను, దేవుళ్లను తీసుకొని తమ అద్భుత ఊహ జోడించి రచనలు చేశారు.
సూరన రచించిన ‘ధనాభిరామం’లో కుబేరుడు, మన్మథుల మధ్య విచిత్రమైన సంభాషణ ఉంటుంది. ధనం గొప్పదా, అందం గొప్పదా? అని వారిద్దరూ వాదించుకొని, అది తేలక భీమేశ్వరుడిని తీర్పు చెప్పమంటారు. ఆయన రెండూ వేటికవే గొప్పవని తేలుస్తాడు. ధర్మన తన రచన ‘చిత్ర భారతం’లో సంస్కృత భారతంలోని కొందరు వ్యక్తుల చుట్టూ కథలల్లాడు. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం, ‘పారిజాతాపహరణం’, ‘ఉషా అనిరుద్ధుల పరిణయం’ వంటి కథలు ధర్మన సృష్టించినవే! తర్వాతి కాలంలోని ప్రబంధ కవులందరికీ ధర్మన కవితా రీతి, ఛందస్సు, భావనాత్మక ఆలోచనలు మార్గాలు చూపాయి.
మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం రాసిన ఘను డు పొన్నికంటి తెలగన్న. అద్భుతమైన వర్ణనలు కలిగిన తన యయాతి కథను అచ్చ తెలుగు కావ్యంగా మలచి అమీన్ ఖాన్‌కు (ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానంలోని ఒక ఉద్యోగి) అంకితమిచ్చాడు. ఈ సంస్కా రం ఇంకెక్కడైనా కనపడుతుందా? తెలుగులో మొట్టమొదటి నిరోష్ట్యకావ్యం ‘దాశరథ రాజనందన’ రాసిన మరిగంటి సింగరాచార్యులు కూడా అచ్చ తెలుగునే ఉపయోగించాడు. సహజకవి అయిన ఈయన తన 9వ సంవత్సరం నుంచి 20వ ఏడుదాకా రచనలు చేశాడు. త్యర్థి కావ్యాలు కూడా రచించాడు. ఏకామ్రనాథుడు రచించిన ‘ప్రతాపరుద్ర’ (1550 క్రీ.శ.) తెలుగులో మొట్టమొదటి గద్యరచన. కాకతీయ రాజుల వైభవం ఈ రచన ద్వారా తెలుస్తుంది.
16వ శతాబ్దానికి చెందిన కందుకూరి రుద్రకవిని ఆంధ్ర కవిగా ముద్రవేసి, శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానకవిగా చిత్రీకరించారు సమైక్యవాదులు. కానీ, ఆయన ఊరైన కందుకూరు, ఇబ్రహీం కుతుబ్ షా ఆయనకు బహూకరించిన చింతలపాలెం నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఆయన ‘జనార్దన శతకము, సుగ్రీవ విజయము, నిరంకుశోపాఖ్యానము’ అన్న రచనలే కాక, మొట్టమొదటి యక్షగానమైన ‘సుగ్రీవ విజయము’ రచించిన తెలంగాణ కవీశ్వరుడు.
ఇక 20వ శతాబ్దంలో సురవరం ప్రతాపరెడ్డి (1896-1953 క్రీ.శ.) చేసిన సాహిత్య సేవ తెలంగాణ సాహిత్య సంపదను వెలికితీసింది. ‘తెలంగాణ వారికి తెలుగు రాదు, సాహిత్యం లేదు, కవులు, పండితులు లేరు’ అన్న వ్యర్థ వాదనను తన ‘గోలకొండ కవుల సంచిక’తో తిప్పికొట్టారు ప్రతాపరెడ్డి. సంస్కృతం, తెలుగులో రచనలు చేసిన 354 మంది తెలంగాణ సాహిత్యకారులని వెలుగులోకి తెచ్చిన ఘనత ప్రతాపరెడ్డిదే! ఆంధ్ర వారి అహంకారం, స్వార్థం పూడ్చిపెట్టిన వీరిని ఆ ప్రత్యేక సంచిక ద్వారా ప్రపంచానికి చూపించిన ఆయన సేవ తెలంగాణకు ఎనలేనిది.
నిజానికి కరుణశ్రీ ‘పుష్ప విలాపం’ కంటే ముందే తెలంగాణ కవి కోదాటి రామకృష్ణారావు 1934లోనే ‘సుమవిలాపం’ రాశారు. పైన చెప్పిన విషయాలన్నీ ఉమ్మడి రాష్ట్రంలో కోల్పోయిన సాహిత్య సంపదలోనివి. తెలంగాణ ప్రజలకే వారి అపార, అద్భుత సాహిత్యం తెలియనంతగా నిరంకుశంగా అణచివేయబడినాయి ఆంధ్ర చరిత్రకారుల చేతుల్లో!
సురవరం ప్రతాపరెడ్డి కవుల సంచికతో తృప్తి పడలేదు. మొట్టమొదటిగా ఒక సాంఘిక చరిత్రను కూడా రచించాడు. ‘హిందువుల పండుగలు’ అన్న రచన ద్వారా వివిధ పండగల్లోని శాస్త్రీయ అంశాలనీ, వివిధ పురాణాల్లో, చరిత్ర పుస్తకాలల్లో ఉన్న పండుగల వైశిష్ఠ్యాన్ని చాటిచెప్పింది ఈ రచన. సురవరం వారి పరిశోధన అంతటితో ఆగలేదు. మొట్టమొదటి చిన్న కథ ఆంధ్రులు ప్రచారం చేసిన ‘దిద్దుబాటు’ (1910) కాదనీ, 1900 సంవత్సరం నుంచీ తెలంగాణలో చిన్న కథలు వచ్చాయనీ వాటిని వెలుగులోకి తెచ్చారు వారు. అదేవిధంగా కందుకూరి వీరేశలింగం రచన ‘రాజశేఖ చరిత్ర’ మొట్టమొదటి తెలుగు నవల (1872 క్రీ.శ.) అన్న ప్రచారాన్ని తిప్పికొడుతూ, నల్గొండ జిల్లాకు చెందిన తడకమళ్ల వెంకటకృష్ణారావు (1830-1890) రచించిన ‘కంబుకంధర చరిత్ర’ (1866) తెలుగులో మొదటి నవల అని నిరూపించారు.
1వ శతాబ్దం నుంచీ తెలంగాణలో రచింపబడిన కావ్యాలు చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. భాషా దురభిమానం, ఇతర భాషల పట్ల అసహనం అన్నవి తెలంగాణలో మచ్చుకైనా కనపడవు. మాతృభాషాభిమానంతో పాటు పరభాషల పట్ల గౌరవం, ఆ భాషలలోని సాహిత్యం పట్ల జిజ్ఞాస ఉన్నవి కాబట్టే, తెలంగాణలో భావ సంస్కారం మెండుగా ఉన్నది. పర భాషలన్నింటినీ ఈ ప్రాంతం ఆదరించింది. అం దుకే కన్నడిగుడైన పంపకవి గాని, గుజరాత్‌కు చెం దిన సోమదేవసూరి గాని ఈ నేలను తమ తల్లిగానే భావించారు. అంతేకాదు, ఇక్కడి సాహిత్యంలో అన్యాయాలను ఎదిరించే సాహసం కనపడుతుంది. ఆత్మగౌరవం కనపడుతుంది. అవినీతి, వివక్ష, దురభిమా నం వంటి లక్షణాలను ఎదిరించడం సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది. 16వ శతాబ్దంలో రుద్రకవి రాసిన ‘నిరంకుశోపాఖ్యానం’లో భర్త చెడు అలవాట్లను ప్రశ్నిస్తుంది. ధైర్యంగా, అత్తమామలను తమ కొడుకుకు బుద్ధి చెప్పమని అడుగుతుంది.
నన్నయకు పూర్వమే ప్రాకృతం, సంస్కృతం, కన్నడం, తెలుగు భాషల్లో అపూర్వమైన సాహిత్య సృష్టి జరిగింది తెలంగాణలో. తర్వాతి కాలంలో విద్యానాథుడు, జాయపసేనాని, సర్వజ్ఞ సింగ భూపాలుడు, ధర్మసూరి వంటి పండితులు నృత్యం, సంగీతం, వివిధ శాస్ర్తాల మీద రచనలు పండించారు. కొలిచెలమ మల్లినాథ సూరి వంటి వ్యాఖ్యాతలు, గరికపాటి అన్నంభట్టు వంటి తర్కశాస్త్రజ్ఞులు ఎంతోమంది తమ జ్ఞానంతో తెలంగాణ తల్లిని అభిషేకించారు.
ఆధునిక యుగంలో గుండేరావు హర్కరే, ఖండవ ల్లి నరసింహ శాస్త్రి, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, కేశవపతుల నరసింహశాస్త్రి, శ్రీ భాష్యం విజయసారథి వం టి మహా రచయితలు సంస్కృత భాషా సాహిత్యాల లో వారి రచనలు పూయించారు. అనేకమంది పార్సీ, ఉర్దూ సాహిత్యకారులతో దీటుగా మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, మందుము ల నర్సింగరావు వంటి పండితులు ఉర్దూ, పార్సీ భాష ల నుంచి ఎన్నో గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. ఇంతటి ప్రశస్తమైన చరిత్ర కలిగిన సుసంపన్న తెలంగాణ సాహిత్యం వివిధ భాషలలో విలసిల్లడమే కాకుండా తెలుగుకు ప్రాచీన హోదా తెచ్చిపెట్టడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే చాలా సంవత్సరాలు మరుగునపడ్డ ఈ సాహిత్యాన్ని వెలికితీసి తెలంగాణలో పాఠశాల, కళాశాలలలో బోధించే తెలుగు సబ్జెక్ట్‌ల ద్వారా విద్యార్థులకు అందించాలి.
హైదరాబాద్‌లో ఉన్న తెలుగు విశ్వ విద్యాలయానికి పేరు మార్చి ఈ రచయితల అద్భుత గ్రంథాలను అక్కడి కోర్సుల ద్వారా విద్యార్థులకు అందించాలి. రాజమండ్రిలోని విశ్వ విద్యాలయానికి నన్నయ పేరు, రాయలసీమలోని విశ్వవిద్యాలయానికి వేమన పేరు పెట్టినట్టు ఇక్కడి విశ్వవిద్యాలయాలకు ఈ ప్రాంత మహా కవుల పేర్లు ఎందుకు పెట్టలేదు? మహాత్మాగాంధీకి హైదరాబాద్‌కు సంబంధం లేదు. పొట్టి శ్రీరాములుకు సాహిత్యంతో సంబంధం లేదు, హైదరాబాద్‌తో అసలే లేదు.అందుకే ఈ పేర్లు మార్చాలి.
మనుషులు ఎన్ని వివిధ భాషలలోని సాహిత్యాలు చదివితే అంత విశాల హృదయులౌతారు. షేక్స్పియర్ చదివితే భారతం చదివినంతగా మనుష్యులు అర్థమౌతారు. లియో టాల్‌స్టాయ్ రచనలు చదివితే మానవత్వం అంటే ఏమిటో తెలుస్తుంది. ‘పక్కవాడికి సంబంధించినదేదీ నాకు పడదు’ అనేవారు ఎప్పటికీ విశ్వ మానవులు అవలేరు. ‘గీతాంజలి’లో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ఎల్లలు లేని దేశాలు, అడ్డుగోడలు లేని సమాజం కావాలి. అదే సనాతన ధర్మం, తెలంగాణ ప్రజలు శతాబ్దాల తరబడి పాటించి చూపించినది. భాషా దురభిమానం, కులగర్వాలు, మతమౌ ఢ్యం, దేశీయత పేరు మీద తోటి మానవుల పట్ల అమానవీయ యుద్ధాలు.. ఇవన్నీ లేనిదే వేద సంస్కృతి. మొత్తం భారతదేశంలో ఇది కనిపించేది ఒక్క తెలంగాణ ప్రాంతంలో మాత్రమే! అది నిలబెట్టుకుందాం.
(గమనిక: ఈ వ్యాసంలో రచయితలు, వారి రచనలు తెలంగాణ సాహిత్యానికి, సంస్కృతికి అపార సేవ చేసిన, చేస్తున్న డాక్టర్ ఎస్వీ రామారావు (తెలుగు ప్రొఫెసర్‌గా, ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్‌గా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసి రిటైరయ్యారు) గారి పుస్తకం ‘తెలంగాణ సాహిత్య చరిత్ర’ నుంచి తీసుకోబడ్డాయి. ఈ అమూల్యమైన గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించటానికి అనుమతులిచ్చి, ఆదరించిన రామారావు గారికి మరొకసారి వినమ్రంగా కృతజ్ఞతలు చెప్పకుంటున్నాను.
– వ్యాస రచయిత్రి
కనకదుర్గ దంటు
89772 43484