చలి తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. ఉదయం తొమ్మిది దాటుతున్నా.. గజగజా వణకడం మాత్రం తప్పడంలేదు. అయితే, చలిలో ఆడవాళ్లే ఎక్కువగా వణుకుతుండటం ఎప్పుడైనా గమనించారా? ‘అది నిజమే!’ అని వైద్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. పురుషులతో పోలిస్తే, మహిళలే ఎక్కువగా చలి బారినపడతారట. ఇందుకు కారణాలు అనేకం. అందులో మొదటిది.. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత. నెలసరి కారణంగా శరీరంలో.. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.
ఇవి, శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా, మహిళల్లో జీవక్రియ రేటు తక్కువగా ఉండటం కూడా మరో కారణం. దీనివల్ల శరీరంలో తక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వారికి మరింత చలిగా అనిపిస్తుంది. మహిళల శరీరంలో ఎక్కువ మొత్తంలో పేరుకుపోయే కొవ్వు.. అంతర్గత వేడిని ప్రసరింపజేసే రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఫలితంగా, మహిళలు మరింత చలిని అనుభవిస్తారని నిపుణులు చెబుతున్నారు.