ఆస్తమా.. మనదేశంలో అత్యంత ప్రబలంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యల్లో ఒకటి. ఊపిరితిత్తులపై ప్రభావం చూపే ఈ మాయదారి వ్యాధి.. మహిళలకూ ఇబ్బందికరంగా పరిణమిస్తున్నది. ముఖ్యంగా, వారి పునరుత్పత్తిపై ప్రభావం చూపుతున్నది. సంతానోత్పత్తి తగ్గడం, గర్భధారణ సమస్యలకు కారణం అవుతున్నది.
మనదేశంలో ఏటా 3.7 కోట్ల మంది ఉబ్బసం బారిన పడుతున్నారు. వారిలో.. నగర, నగర శివారు ప్రాంతాల్లో నివసించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే.. ఆస్తమా బాధితులు గర్భం దాల్చడంలో ఇబ్బంది పడుతున్నట్లు న్యూఢిల్లీలోని ‘ఆల్ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ చెబుతున్నది. అంతర్జాతీయంగా నిర్వహించిన అనేక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఉబ్బసం వ్యాధిగ్రస్తుల్లో తక్కువ ఆక్సిజన్ స్థాయులు, ఇన్ఫ్లమేషన్, ఇతర సమస్యలు.. పునరుత్పత్తి ప్రక్రియకు ప్రధాన అడ్డంకులుగా గుర్తించాయి. వీరిలో గైనిక్ సమస్యలు, అధిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఇవన్నీ.. వారు గర్భం దాల్చడాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయి. ఉబ్బసం బాధితుల్లో పునరుత్పత్తి అవయవాలకు ఆక్సిజన్ ప్రవాహం తగ్గుతుందనీ, తద్వారా అండాల నాణ్యతతోపాటు గర్భాశయ ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణాలను వివరిస్తూ.. మనదేశంలో ఆస్తమాను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను సాధారణంగానే చూస్తారు. వైద్య సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు. దోమల మందులు, అగరుబత్తీలు, వంటగదిలో వాయు కాలుష్యం వంటివి.. బాధితులను మరింత ఇబ్బంది పెడతాయి. ఈ క్రమంలో గర్భధారణ కోసం చూసే ఆస్తమా బాధితులు.. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.