పరిగెడుతూ పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలన్నది పెద్దల మాట. వాళ్లు చెప్పినట్టే నాలుగు కిలోమీటర్లు పరుగెత్తి ఆయాసపడే కంటే నెమ్మదిగా రెండు కిలోమీటర్లు నడిచింది మేలని డాక్టర్లు చెబుతున్నారు. నడక, పరుగు… రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ, అధిక బరువు, స్థూలకాయం, షుగర్, హైబీపీ, గుండెజబ్బులు మొదలైన వాటితో బాధపడే వారికి నడకతో ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. పరుగులో కాలానికి ప్రాధాన్యం ఉంటుంది. ఎంత వేగంగా పరుగెత్తితే అంత తొందరగా లక్ష్యాన్ని చేరుకోగలం. కిలోమీటరు దూరాన్ని కేవలం రెండు మూడు నిమిషాల్లో చేరుకుంటారు. అదే నడక అయితే రెండు కిలోమీటర్ల దూరాన్ని పదిహేను నిమిషాల్లో పూర్తిచేస్తారు. శరీరంలో అధిక క్యాలరీల శక్తి నడక కంటే పరిగెత్తినప్పుడు ఎక్కువగా ఖర్చవుతుంది. గుండె ఆరోగ్యానికి సంబంధించిన వ్యాయామాలు చేస్తే కలిగే ప్రయోజనాలు పరుగెత్తడం వల్ల కలుగుతాయి. పరుగు వల్ల ఈ లాభాలతోపాటు అనేక సమస్యలూ ఉన్నాయట. పరుగెత్తుతుంటే కీళ్ల మధ్య ఒత్తిడి పెరుగుతుంది.
కండరాలను ఎముకలకు కలిపి ఉంచే టెండాన్స్, లిగమెంట్స్పై ఒత్తిడి పడుతుంది. అందువల్ల కండరాలు, ఎముకల్లో గాయాలయ్యే ప్రమాదముంది. బోలు ఎముకలు (ఆస్టియో పొరోసిస్), కీళ్లనొప్పులు, గుండెజబ్బులు, ఊబకాయం తదితర సమస్యలతో బాధపడేవాళ్లు పరుగెత్తలేరు. వీళ్లు తప్పనిసరిగా నడక మాత్రమే అలవాటు చేసుకుని ప్రతి రోజూ కొంత సమయం కేటాయించాలి. పరుగెత్తక పోవడం వల్ల క్యాలరీలు ఖర్చు చేయలేకపోతున్నామనే బాధలేకుండా రెండు కిలోమీటర్ల దూరం నడిస్తే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులకూ ఇదే వర్తిస్తుందని చెబుతున్నారు. రన్నింగ్, వర్కవుట్ వంటి ఓ మోస్తరు శారీరక వ్యాయామాలు చేసేవాళ్లు వారానికి 150 నిమిషాలు కేటాయిస్తే, నడక లేదా ఇతర తేలికపాటి వ్యాయామాలు చేసేవాళ్లు 300 నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తే ఇద్దరికీ సమానమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట.