పెరటి తోటల్లో ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తాయి. పూలు, కూరగాయలు, ఆకుకూరల కోసం.. ఇలా పలు రకాల మొక్కలను పెంచుతుంటారు. అయితే, ఒక్క మునగ చెట్టును పెంచితే.. అనేక విధాలుగా ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పెరటి తోటలో మునగ చెట్టు ఉంటే.. ఒక కూరగాయ, ఒక ఆకుకూర చెట్టు ఉన్నట్టే అని అంటున్నారు. దీని కాయలు, ఆకులను కూరల్లో వాడుకుంటే.. మునగ పూలతో ‘టీ’ చేసుకోవచ్చని చెబుతున్నారు. అలాగే, మునగ మొక్క సులభంగా పెరగడంతోపాటు తొందరగా కాపునకు వస్తుంది.
దీనిని పెంచడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మొక్కకు చీడపీడలు సోకకుండా.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అయితే, పెరటి తోటలో పెంచే మునగ చెట్టును గుబురుగా పెంచాలి. ఇందుకోసం ఒక్కో అడుగు ఎత్తు పెరిగినప్పుడల్లా.. కొమ్మల చివరలను కత్తిరించాలి. అలా కత్తిరింపులు చేసిన ప్రాంతంలో తిరిగి రెండు మూడు చిగుర్లు పుట్టుకొస్తాయి. దాంతో చెట్టు ఎక్కువ కొమ్మలతో గుబురుగా పెరుగుతుంది. లేకుంటే, చెట్టు నిటారుగా పెరిగి.. కొద్ది రోజులకే విరిగిపోయే అవకాశం ఉంటుంది. మొక్క చిన్నగా ఉన్నప్పుడు వచ్చే పూతను ఎప్పటికప్పుడు కోయాలి. అప్పుడే బాగా ఎదుగుతుంది.