ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా జీవించాలంటే? రోజూ నడవాలని చెబుతున్నారు నిపుణులు. నడకతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. కానీ, ఒళ్లు రోగాలపుట్టగా మారిన తర్వాత ఎంత నడిస్తే ఏం ప్రయోజనం! అందుకే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే నడకను జీవితంలో భాగం చేయాలని చెబుతున్నారు వైద్యులు. ప్రతి రోజూ ఏడువేల అడుగుల చొప్పున నడిస్తే.. ఆరోగ్యం మీ వెన్నంటి ఉంటుందని అంటున్నారు.
నిత్యం ఏడువేల అడుగులు వేస్తూ, సరైన ఆహారం తీసుకుంటూ, సరిపడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే రెండు నెలల్లో శరీరం దృఢంగా తయారవుతుందట. ఇలా చేయడం వల్ల కార్డియోవాస్కులార్ సమస్యలు రాకుండా ఉంటాయట. బరువు నియంత్రణలో ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.
రోజూ నడవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గుతుంది. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కీళ్లు, కండరాలు బలపడతాయి. మరింత మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే ఏడువేల అడుగుల ప్రయాణాన్ని పది వేలకు పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. సాధారణంగా అయిదు వేల అడుగుల నడకను శరీరక శ్రమ లేని (సెడంటరీ లైఫ్) జీవనంగానే గుర్తిస్తారు. అంతకంటే ఎక్కువ నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నడక వల్ల కలిగే అన్ని రకాల ప్రయోజనాలు పొందాలంటే కనీసం ఏడు వేల అడుగులు, ఓపిక చేసుకొని పదివేల అడుగుల దూరం నడవాల్సిందే! ఇంకెందుకు ఆలస్యం ముందడుగు వేయండి!