కొన్నిరకాల ఆహార పదార్థాలు ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. మరికొన్ని రోగాలను తగ్గిస్తే.. ఇంకొన్ని మానసిక ఉన్నతికి సాయపడతాయి. అలాగే.. నిద్రను మెరుగుపరిచే ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. కంటినిండా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చమోలీ టీ: ఈ హెర్బల్ టీ.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ‘అపిజెనిన్’ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది నిద్రలేమికి కారణమయ్యే మెదడులోని కొన్ని గ్రాహకాలను అడ్డుకుంటుంది. తద్వారా నిద్రలేమిని తగ్గిస్తుంది.
కివీ పండ్లు: ‘సెరటోనిన్’ అనేది మెదడులో ఉండే ఒక రకమైన రసాయనం. ఇది నిద్ర నాణ్యతలో కీలక పాత్ర పోషిస్తుంది. పడుకునే ముందు రెండు కివీ పండ్లు తీసుకుంటే.. సెరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి, మంచినిద్ర పడుతుంది.
వాల్నట్స్/ బాదం: వీటిలో పుష్కలంగా లభించే మెగ్నీషియం.. కండరాల సడలింపునకు సాయపడుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
అరటిపండ్లు: పొటాషియం, మెగ్నీషియంతో నిండిన అరటిపండ్లు కూడా నిద్రను ప్రోత్సహిస్తాయి.
చేపలు: సాల్మన్, ట్యూనా, ట్రౌట్లాంటి చేపల్లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఇది నిద్రరావడాన్ని ప్రోత్సహిస్తుంది.
పాలు: పడుకునే ముందు ఓ గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే.. ఇట్టే నిద్రపట్టేస్తుంది. పాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి.
అదే సమయంలో.. నిద్రకోసం మరిన్ని చిట్కాలను పాటించాలి. రోజూ ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించాలి. గంట ముందే భోజనం ముగించేయాలి. రాత్రిపూట స్మార్ట్ఫోన్కు దూరంగా ఉండాలి. ఇక నిద్రకు భంగం కలిగించే కెఫీన్, ఆల్కహాల్ లాంటివాటికి దూరంగా ఉండాలి. రాత్రి భోజనం స్వల్పంగా చేయాలి.