నవతరం.. ఉద్యోగాలకన్నా వ్యాపారంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నది. ఆంత్రప్రెన్యూర్లుగా రాణించాలని ఆరాటపడుతున్నది. అందుకోసం బిజినెస్ దిగ్గజాలు చెప్పే సూత్రాల వెంట పరుగులు పెడుతున్నది. సలహాలు-సూచనల కోసం గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నది. అయితే, వ్యాపారంలో రాణించాలంటే.. మన వారసత్వ మూలాల్లోకి వెళ్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ‘భగవద్గీత’లోని నాలుగైదు శ్లోకాలను స్ఫూర్తిగా తీసుకుంటే.. విజయం మీ తలుపు తడుతుందని అంటున్నారు. ఎలాంటివారి రాతనైనా మార్చే శక్తి.. గీతకు ఉన్నదని చెప్పుకొస్తున్నారు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి ॥
నువ్వు ఉన్నది కర్మలు (పనులు) చేయడానికి మాత్రమే. దాని ఫలాలకు అధికారివి కాదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతిఫలాపేక్షతో పనులు చేయకు. అలాగని చేయడం మానకు.. అని ఈ శ్లోకానికి అర్థం. చేయాల్సిన పని గురించి రెండే రెండు ముక్కల్లో చెప్పే శ్లోకం ఇది. ప్రతీ ఆంత్రప్రెన్యూర్కూ వర్తిస్తుంది. ప్రతిఫలం గురించి ఆశించకుండా ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇష్టంగా పని చేసుకుంటూ పోవాలి. అప్పుడే విజయానికి దగ్గరవుతారు.
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ
స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్దినాశాత్ ప్రణశ్యతి॥
కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధి దిగజారితే మనిషే పతనం అవుతాడని చెప్పే శ్లోకమిది. వ్యాపారంలో ముఖ్య భాగమైన యాంగర్ మేనేజ్మెంట్ గురించి చెబుతుంది. కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టేవారు తప్పకుండా ఆచరించాల్సింది. చెప్పుడు మాటలు వినడం, అవాస్తవాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏమాత్రం మంచిదికాదు. విచక్షణలేని యజమాని కోపం.. ఉద్యోగుల మనైస్థెర్యాన్ని దెబ్బతీస్తుంది. వ్యాపారంపై దుష్ఫలితాన్ని చూపుతుంది.
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచార
ఆసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః॥
ఫలితం మీద ఆసక్తి లేకుండా.. కర్మ ప్రకారం పని చేసుకుంటూ పోవాలంతే! వ్యాపారం కూడా అంతే! ఆంత్రప్రెన్యూర్ ఎప్పుడూ ఓపెన్ మైండెడ్‌గా ఉండాలి. అవసరమైతే ఇతరులతో జత కట్టాలి. బలాన్ని, సృజనాత్మకతను పెంచుకోవాలి. క్రియేటివ్‌గా ఉంటూ.. ఇన్నోవేటివ్‌గా ఆలోచించాలి. మార్కెట్‌ను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ.. అందుకు తగ్గట్టుగా వ్యాపార వ్యూహాలను మార్చుకుంటూ ముందుకుసాగాలి.
వాసంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ॥
చిరిగిపోయిన బట్టలను పడేసి, కొత్తబట్టలు ఎలా కట్టుకుంటామో.. జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా మరోకొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. అని ఈ శ్లోకానికి అర్థం. ఆంత్రప్రెన్యూర్లు కూడా అలాగే ఉండాలి. వ్యాపారం అంటేనే నిరంతర ప్రయాణం. కాబట్టి, కాలం చెల్లిన ఆలోచనలను పక్కన పెట్టేయాలి. కొత్త ట్రెండ్‌ను ఫాలో అవ్వాలి. నూతన ఆవిష్కరణలవైపు అడుగులు వేయాలి. అప్పుడే విజయం మీ సొంతమవుతుంది.