దక్షిణాసియా మహిళలు త్వరగా వృద్ధాప్యానికి దగ్గరవుతున్నారు. అమెరికా పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించారు. అమెరికా, యూరప్ మహిళల్లో మెనోపాజ్ ప్రారంభమయ్యే సగటు వయసు 52 ఏళ్లుగా ఉన్నది. అదే దక్షిణాసియాలో సగటున 48 – 49 ఏళ్లకే మెనోపాజ్ దశకు చేరుకుంటున్నారట. ఇక భారత్‌తోపాటు పాకిస్తాన్లో 46 – 47 ఏళ్లకే మెనోపాజ్‌లోకి ప్రవేశిస్తున్నారని పరిశోధకులు తెలిపారు. దక్షిణాసియా మహిళల వృద్ధాప్య ప్రక్రియను అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా.. ఇక్కడి మహిళల్లో విటమిన్ డి స్థాయులు వేగంగా క్షీణిస్తున్నాయి. దాంతో వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వారిని తొందరగా చుట్టుముడుతున్నాయి.
దక్షిణాసియాలోని చాలామంది మహిళలు 30 – 40 ఏళ్లకే వివిధ రకాల అండాశయ సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిర్ధారణ చేయలేని అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. అంతేకాకుండా, దక్షిణాసియా దేశాల్లో ఇంటి బాధ్యతలన్నీ మహిళలే చూసుకుంటున్నారు. ఈ కుటుంబ బాధ్యతలు ఆడవాళ్లపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇక బాల్యం నుంచీ చాలామందికి సరైన ఆరోగ్య సంరక్షణ లేకపోవడం కూడా.. లేనిపోని సమస్యలను సృష్టిస్తున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు, సామాజిక ఒత్తిళ్లు.. ఇవన్నీ దక్షిణాసియా మహిళలను వృద్ధాప్యంలోకి నెట్టేస్తున్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.