బాదితే బంతి బౌండరీ లైన్ అవతల పడాల్సిందే. బౌలర్ ఎంత ధాటిగా విసిరితే అంతే వేగంగా ఫోరూ పడాల్సిందే. షఫాలీ బ్యాటింగ్ ైస్టెలే అది. ఆమె క్రీజులో ఉంటే.. జట్టులో జయం మనదే అనే ధీమా. అండర్-19 తొలి వుమెన్స్ వరల్డ్‌కప్‌ను ఇండియాకు అందించి.. అందరి చేతా ‘లేడీ సెహ్వాగ్’అనిపించుకుంటున్న అండర్-19 వుమెన్స్ క్రికెట్ టీమిండియా కెప్టెన్ షఫాలీ వర్మ గురించే ఈ కథనం. ఓ లుక్కేయండి.
క్రికెట్ అంటే ఒకప్పుడు సచిన్, సెహ్వాగ్ లాంటి దిగ్గజాల పేర్లే వినిపించేవి. మహిళలు సైతం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న క్రమంలో.. ఆకాశంలో సగమైన మహిళ.. మైదానంలోనూ సగమైంది. మిథాలీ రాజ్, జూలన్ గోస్వామి, హర్మన్ ప్రీత్కౌర్లాంటి క్రికెటర్లు తమ ప్రతిభను చాటారు. తాజాగా మరో తేజం క్రీడాభిమానుల మన్ననలు అందుకుంటున్నది. తొలి అండర్-19 టీ20 మహిళా క్రికెట్ వరల్డ్‌కప్‌ను ఒడిసిపట్టిన ఆ డేరింగ్ క్రికెటర్ పేరు.. షఫాలీ వర్మ. తన వయసు చిన్నదే. కానీ సాధించిన లక్ష్యం చాలా పెద్దది. పదిహేనేండ్లకే ఇండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడిన అతిపిన్న వయస్కురాలిగా షఫాలీ రికార్డు సృష్టించింది. క్రీజులోకి రావడమే ఆలస్యం.. బాదుడే బాదుడుగా రెచ్చిపోవడం షఫాలీ గేమ్ ైస్టెల్. అందుకే తనను ‘లేడీ సెహ్వాగ్’ అంటారు అభిమానులు.
పిట్టకొంచెమే..
అతిచిన్న వయసులోనే అరంగేట్రం చేసిన క్రికెటర్‌గా హర్యానా హరికేన్ షఫాలీ రికార్డు కెక్కింది. తను డేరింగ్ బ్యాటర్ మాత్రమే కాదు.. బంతిని గింగరాలు తిప్పగల స్పిన్నర్ కూడా. కాబట్టే, కెరీర్ ఆరంభమైన ఆరు నెలల్లోనే మహిళా బ్యాటర్ల ర్యాంకింగ్‌లో ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచింది. పద్దెనిమిది మ్యాచ్‌లతోనే ఈ ఘనత సొంతం చేసుకుంది.
ఆరు బాదితే.. ఐదు!
ఎనిమిదేండ్ల వయసులో షఫాలీ క్రికెట్ బ్యాట్ పట్టింది. స్థానిక మైదానంలో ఆ చిన్నారి బౌండరీలు బాదుతుంటే తోటి పిల్లలంతా ‘ఏం తింటావ్ నువ్వు? ఇంత ఎనర్జీ ఎలా వచ్చింది?’ అని అడిగేవారట. సిక్స్ కొట్టినప్పుడల్లా షఫాలీకి వాళ్ల నాన్న సంజీవ్ వర్మ ఐదు రూపాయలు ఇచ్చేవారట. ఇంకా ఇంకా బాదమని ప్రోత్సహించేవారట. అలా ఐదు రూపాయల కోసం సిక్సులు కొట్టడం మొదలు పెట్టిన షఫాలీ ఇప్పుడు తన సిక్సులతో ఇండియాకు ప్రపంచకప్ సాధించి పెట్టింది. తొలి మూడేండ్లు కన్నతండ్రే షఫాలీకి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత, 2016లో రామ్ నారాయణ్ క్రికెట్ క్లబ్లో చేరింది. 2013లో సంజీవ్ వర్మ.. షఫాలీకి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లైవ్‌లో చూపించాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ ఆటతీరుకు షఫాలీ కండ్లు బైర్లు కమ్మాయి. తను కూడా సచిన్‌లా అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనే నిర్ణయానికొచ్చేసింది. రోజూ మైదానంలో గంటలకు గంటలు ప్రాక్టీస్ చేసేది. ఆ కృషి ఫలించి.. పద్నాలుగో ఏట హర్యానా జట్టు కోసం ఆడే అవకాశం వచ్చింది. తొలిమ్యాచ్‌లోనే పరుగుల వరద సృష్టించి.. చిన్న వయసులోనే అర్ద శతకం చేసిన మహిళా క్రికెటర్‌గా చరిత్రకెక్కింది.
అన్న కోసం..
షఫాలీ, ఆమె అన్న సాహిల్ వర్మ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటారు. ఒకసారి, అన్నలా హెయిర్‌ైస్టెల్ మార్చుకుని.. సాహిల్ స్థానంలో అండర్-12 క్రికెట్ ఆడేందుకు వెళ్లిందట షఫాలీ. అయినా ఎవరూ గుర్తుపట్టలేదు. అప్పటి నుంచి ఆ హెయిర్‌ైస్టెల్ అలాగే కొనసాగించింది. చాలామంది అబ్బాయిలు షఫాలీని తమతో ఆడనిచ్చేవారు కాదు. కారణం ఆడపిల్ల అన్న వివక్ష కాదు. బాగా ఆడుతుందన్న భయం. షఫాలీని అందరూ లేడీ సెహ్వాగ్ అని పిలుస్తారు కానీ.. ఆమె సచిన్ టెండూల్కర్ వీరాభిమాని. షఫాలీకి ఉన్న క్రేజ్‌కు, ఆటతీరుకు ఫిదా అయిన పెప్సీ ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది.నీ భవిష్యత్తు .. బంగారం షఫాలీ!
కుటుంబమంతా..క్రికెట్ ఫ్యాన్స్
షఫాలీ ఫ్యామిలీలో అంతా క్రికెట్ అభిమానులే. ఆమె తల్లిదండ్రులు, తమ్ముడు, అన్న, చెల్లి.. క్రికెట్‌ను శ్వాసిస్తారు. తండ్రి సంజీవ్ వర్మకు జువెలరీ దుకాణం ఉంది. నిజానికి, బాల్యంలో ఆయనకు క్రికెటర్ కావాలనే కోరిక ఉండేది. కానీ.. ఆర్థిక పరిస్థితులు, సరైన ప్రోత్సాహం లేకపోవడంతో ఆ కల నిజం కాలేదు. తన పిల్లలనైనా క్రికెటర్లుగా చూడాలని కలలు కనేవాడు. అందుకే పెద్దకొడుకు సాహిల్వర్మను, కూతురు షఫాలీని క్రికెట్ కోచింగ్‌కు పంపాడు. సాహిల్ కూడా క్రికెటరే. కాకపోతే అన్న కంటే ముందే షఫాలీ ఇంటర్నేషనల్ క్రికెటర్ అయింది. తాజాగా అండర్-19 వరల్డ్‌కప్ గెలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
WTC 2023 | డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో భారత్ స్థానం పదిలం.. ఆస్ట్రేలియాకు షాక్