తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతోపాటు ఆటలు, పాటలు.. ఇలా వారికి ఆసక్తి ఉన్నవాటిపై శిక్షణ ఇప్పిస్తుంటారు. కానీ, ఆర్థికపరమైన అంశాల గురించి ఎక్కువగా చర్చించరు. వాటిపైన పిల్లలకు అవగాహన కల్పించరు. కొందరైతే.. పిల్లలు అడిగినంత డబ్బులు ఇచ్చేస్తుంటారు. మరికొందరు పిల్లల చేతికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా పెంచుతుంటారు. ఈ రెండు పద్ధతులూ సరైనవి కావు. ఇలా చేయడం వల్ల పిల్లలకు డబ్బు విలువ తెలియకుండా పోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెద్దయ్యాక వారు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత అత్యవసరమని సూచిస్తున్నారు.
అర్థం చేసుకోండి:
డబ్బు సంపాదించడం (ఆదాయం), పొదుపు, ఖర్చు, పెట్టుబడి.. ఆర్థిక నిర్వహణలో ప్రాథమికాంశాలు. ముందుగా మీ పిల్లలకు ఈ విషయాలపై పూర్తిగా అవగాహన కల్పించాలి.
ఆదాయం: పిల్లల ప్రధాన ఆదాయ మార్గాలు.. పాకెట్ మనీ, బహుమతులే! కొందరు టీనేజర్లు పార్ట్‌టైమ్ ఉద్యోగం ద్వారా ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటారు. అయితే, ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆ డబ్బులను సమర్థంగా నిర్వహించడంలో సాయపడాలి.
ఖర్చు: తమ చేతికి వచ్చిన డబ్బును ఏయే వస్తువులపై ఖర్చు చేయాలో పిల్లలకు అవగాహన కల్పించాలి. అవసరం లేనివి కొనుగోలు చేయడం వల్ల డబ్బు ఎలా వృథా అవుతుందో వారికి తెలిసేలా చేయాలి. ఇందుకోసం ఇంట్లో పనికిరాకుండా ఉన్న వస్తువులు, వాటి ఖరీదు, అవి కొనకుండా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను విడమర్చి చెప్పాలి.
పొదుపు: స్నేహితులకు గిఫ్ట్స్ ఇవ్వడానికి, తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి పాకెట్ మనీలో పొదుపు చేసిన డబ్బులనే వాడుకోమని చెప్పండి. దీనివల్ల వారిలో ‘పొదుపు’ చేయడం అలవాటుగా మారుతుంది.
మదుపు: మీ పిల్లల దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు పోగైతే.. వాటిని చిన్న మొత్తాలుగా మదుపు చేయించండి. లేదా మీ అవసరాల కోసం తీసుకొని.. రెండుమూడు నెలల తర్వాత ఇంకొంత డబ్బు కలిపి పిల్లలకు తిరిగివ్వండి. పెట్టుబడి పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలను వారు ప్రత్యక్షంగా అనుభవించాలి. అప్పుడే.. వారికి మదుపు విలువ తెలిసొస్తుంది.