‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ’ అని కవి ఎప్పుడో చెప్పాడు. ఆ కవి నవ్వుతూ చావాలనీ అన్నాడు. కానీ, నవ్వుతూ ఉంటే ఆ చావు అంత తొందరగా రాదని పలు పరిశోధనలు చెబుతున్నాయి. నవ్వులో అందమే కాదు ఆరోగ్యమూ ఉందని గుర్తుపెట్టుకోండి. అందువల్ల నవ్వుతూ ఉండేవాళ్ల జీవిత కాలం కొన్నేళ్లపాటు అధికంగానే ఉంటుందని ఎన్నో రీసెర్చ్‌లు తేల్చాయి. ఆయుష్షు పెరగడం ఒకటే కాదు దరహాసంతో మరెన్నో లాభాలున్నాయి. నవ్వుతూ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది. మోవిపై నవ్వులు విరబూసినప్పుడు మెదడులో సంతోషాన్ని కలిగించే ఎండార్ఫిన్, సెరటోనిన్ హార్మోన్లు విడుదలవుతాయట. దీంతో శరీరంలో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. నవ్వు రక్తపోటుని తగ్గిస్తుందని అనేక రుజువులున్నాయి.
గుండెల్లో గుబులు పుడితే కుంగుబాటుకు గురవుతాం. పోషకాల లోపమే కాదు నవ్వులేకపోయినా రోగాలొస్తాయి. మనోవ్యాకులత వల్ల శారీరక ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కారణం వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం. ఆ రోగాలను గెలవాలంటే నవ్వాల్సిందే! ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిందే! అంతేకాదు నొప్పులను కూడా నవ్వు తగ్గిస్తుంది. నవ్వేటప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్, సెరటోనిన్లు నొప్పులు తగ్గించే సహజ ఔషధాలు. అంతేకాదు నవ్వుతూ ఉంటే నలుగురిని ఆకర్షిస్తూ ఉంటారు. నవ్వితే ఇన్ని లాభాలున్నాయి కాబట్టే నవ్వడం ఒక యోగం అన్నాడు జంధ్యాల. నవ్వు నాలుగు విధాల చేటు అన్నది నలభై విధాల అబద్ధం అని మనోవైజ్ఞానిక పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి నవ్వండి. నవ్వుతూ ఉండండి.