Barbie | చిన్నప్పుడు బార్బీ బొమ్మ ఉంటే సంబురం. కాలేజీకొచ్చాక బార్బీ బొమ్మ అంటే సంబురం. ఆ మోజుతో అచ్చం బార్బీడాల్‌లా తయారయ్యే అమ్మాయిలూ ఉన్నారు. అలా కనిపించడం కోసం లక్షలు ఖర్చు పెడతారు కూడా. వాళ్లంతా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఆ ‘చిత్రాలు’ మీరూ చూడండి.
సూదిలాంటి ముక్కు, చిన్నినోరు, సన్నటి నడుము, పొడవాటి జుట్టు.. బార్బీ బొమ్మది చూడగానే ఆకట్టుకునే రూపం. షోకేస్‌లో దాచుకోవాలనుకునేంత అందం. అయితే కొందరు అక్కడితో ఆగిపోరు. అంత అందంగా తామూ తయారవ్వాలనుకుంటారు. అచ్చు గుద్దినట్టు అలాగే కనిపించాలనీ కోరుకుంటారు. డైటింగ్లూ, సర్జరీలూ.. దేనికైనా వెనుకాడరు. ఎంత ఖర్చుకైనా సిద్ధపడతారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్లంతా అలాంటి హ్యూమన్ బార్బీలే.
గులాబీ రంగు బికినీలో మనిషంత బార్బీలా కనిపిస్తుంది వలేరియా లుకియానోవా. ఐరోపా దేశం మాల్డోవాలో పుట్టిన ఈ అమ్మడు ‘హ్యూమన్ బార్బీ’గా పేరు తెచ్చుకుంది. బ్రెస్ట్ ఇంప్లాంట్ మినహా తన శరీరాన్నంతా వ్యాయామాలు, ఆహార నియమాల ద్వారానే నాజూగ్గా ఉంచుకున్నానని చెబుతున్నది లుకియానోవా.
ఇక, ఇటీవల బార్బీగా మారేందుకు 82 లక్షలకు పైగా ఖర్చుపెట్టి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన జజ్మీన్ ఫారెస్ట్ది ఆస్ట్రేలియా. పద్దెనిమిదేళ్ల వయసు నుంచే తనకు బార్బీలా కనిపించాలని ఆరాటం. సర్జరీల మీద సర్జరీలు చేయించుకుని పాతికేళ్ల వయసు వచ్చేసరికి ఇంతలా మారిపోయింది.
Marcela Iglesias
మర్సెలా ఇగ్లెసియాస్ అనే అర్జెంటీనా మూలాలున్న అమెరికన్ అమ్మాయి 60 లక్షలకు పైగా ఖర్చుచేసి రకరకాల సర్జరీలు చేయించుకుంది. హ్యూమన్ బార్బీడాల్గా హాలీవుడ్లో ఫేమస్ అయ్యింది. ఆల్బమ్‌లు చేస్తున్నది. ఫిట్నెస్, లైఫ్ స్టైల్ సంస్థలు నెలకొల్పి వందల కోట్ల రూపాయల ఆస్తుల్నీ సంపాదించింది. వీళ్లే కాదు, ఇలా బొమ్మల మీద మోజుతో అచ్చుగుద్దినట్టు అలాగే తయారైన అమ్మాయిలు ఉక్రెయిన్, కొరియా, అమెరికా… ఇలా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో చాలామందే ఉన్నారు.
“Food | చూయింగ్‌గమ్ మింగేస్తే ఏడేండ్ల పాటు కడుపులోనే ఉంటుందా?”