Thunder Mushroom | మనకు పుట్టగొడుగులు తెలుసు. వాటి రుచులూ తెలుసు. కానీ, ‘థండర్ మష్రూమ్స్’ మాత్రం దేశంలోని నాలుగు ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. అదీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే రుతుపవన సమయాల్లోనే. ఈ మెరుపు పుట్టగొడుగులను జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాలంటారు.
జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ అటవీ ప్రాంతాల్లో.. అదీ వర్షాకాలంలో మాత్రమే దొరికే ఆహార పదార్థం ‘థండర్ మష్రూమ్స్’. పేరుకు తగ్గట్టే ఇవి ఉరుములు, మెరుపులకు మాత్రమే పుడతాయి. అది కూడా నైరుతి రుతుపవనాలు వచ్చివెళ్లే కాలంలోనే. ఈ మూడు ప్రాంతాలే కాకుండా కర్ణాటకలోని తుళునాడులోనూ దొరుకుతాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిస్తే.. అక్కడి ఆదివాసీలకు పండగే. రాత్రి వర్షం పడితే.. తెల్లవారుజామునే పుట్టగొడుగుల వేట మొదలువుతుంది. అలా అని, అందరూ ఈ పుట్టగొడుగులను పట్టుకోలేరు. నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే దొరుకుతాయి. గులకరాళ్లలా, చిన్నచిన్నగా ఉంటాయి కాబట్టి, కొత్తవారు ఓ పట్టాన కనిపెట్టలేరు. కొన్ని ప్రాంతాల్లో అడుగులోతు మట్టిలో కూరుకుపోయి ఉంటాయి.
మెరుపు పుట్టగొడుగులు ప్రత్యేకమైన మట్టి పరిమళాన్ని కలిగి ఉంటాయి. కర్ణాటక నైరుతి తీరంలో పెద్దపెద్ద రాళ్ల చుట్టూ.. తేమగా ఉన్న నేలలో ఇవి పెరుగుతాయి. ఇక జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో దట్టమైన అడవులు, నదీతీర ప్రాంతాల్లో సాల్ చెట్లకింద దర్శనమిస్తాయి. వీటిని ఛత్తీస్‌గఢ్‌లో ‘సాల్ బోడా’, జార్ఖండ్‌లో ‘రుంగ్డా’, తుళునాడులో ‘గుడ్ గుడ్ అలంబే’ అని పిలుస్తారు. జార్ఖండ్‌లో శాకాహార చికెన్ అని పేరు. ఎక్కువగా జూన్, జూలై నెలల్లోనే దొరుకుతాయి. వీటిని శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. రెండు రోజులే నిల్వ ఉంటాయి. తుళునాడు ఆదివాసీ సంతల్లో వీటిని కేజీ రూ.600 నుంచి 700 వరకు అమ్ముతారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో అయితే రూ. 2,000 వరకు ధర పలుకుతాయి. వీటిని బహుమతిగానూ ఇస్తుంటారు.
థండర్ మష్రూమ్స్ గుండ్రంగా బంతిలా ఉంటాయి. ఆలుగడ్డను పోలి ఉంటాయి. ప్రవాహాల దగ్గరున్న రాళ్లలో మాత్రమే పెరుగుతాయి. వీటిని పావుగంటకు పైగా నీళ్లలో నాన
బెట్టాలి. వాటి చుట్టూ పేరుకుపోయిన మట్టి, ఇసుక తీసెయ్యాలి. తర్వాత శుభ్రంగా కడిగి వేపుడు, సూప్, కూరలు చేసుకోవచ్చు. ఈ వంటకాల్లో ఎక్కువగా కొబ్బరిని ఉపయోగిస్తుంటారు. మంగళూరులో దోసకాయ, తురిమిన కొబ్బరి, ఉల్లిపాయలు, వెల్లుల్లితో చేసే ‘గుడ్ గుడ్ అలంబే’ ప్రసిద్ధ వంటకం. రాంచీలోని ‘ఆజం ఎంబా’ రెస్టారెంట్ అయితే, ఈ సీజన్లో థండర్ మష్రూమ్స్‌తో రుచికరమైన గ్రేవీ తయారుచేస్తుంది. ఈ రెస్టారెంట్ ఆదివాసుల వంటకాలను నగరవాసులకు పరిచయం చేస్తుంది.
వృక్షశాస్త్ర పరంగా పుట్టగొడుగులు శిలీంధ్ర వర్గానికి చెందుతాయి. వంటకాల పరంగా శాకాహారం ఖాతాలో వేశారు. అయితేనేం, మాంసాలలో లభించే ప్రొటీన్లన్నీ ఇందులోనూ ఉంటాయి. అందువల్ల, పుట్టగొడుగులను శాకాహారుల మాంసాహారంగా పరిగణిస్తారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి వివిధ రకాలైన వ్యాధుల నివారణలో సహాయపడతాయి. కొవ్వు, చెడు కొలెస్ట్రాల్ అస్సలు ఉండవు. పైగా సోడియం పరిమాణం చాలా తక్కువ. ఇవి అనేక విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాల సమాహారం. వీటిలోని రిబోఫ్లావిన్, సెలీనియం, నియాసిన్ రూపంలో ప్రొటీన్లు శరీర నిర్మాణ శక్తులుగా పనిచేస్తాయి. ఎముకలు, దంతాల దృఢత్వానికి అవసరమైన విటమిన్ డి కలిగిన ఏకైక ఆహారం ఇదే.
“పుట్టగొడుగులు ఆరోగ్యానికే కాదు.. అందాన్ని కూడా పెంచుతాయని తెలుసా!!”