మట్టిని ప్రేమించేవాళ్లు.. ప్రకృతిని ఆరాధించే వాళ్లు మనకు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటారు. హైదరాబాద్‌కు చెందిన మన్‌ప్రీత్ సింగ్ కూడా ఆ కోవకు చెందినవాడే. మట్టితో అద్భుతాలు సృష్టిస్తాడు. పనికిరాని వ్యర్థాలకు ఓ అర్థం చెప్పి కళాఖండాలుగా మారుస్తాడు.
మన్‌ప్రీత్ సింగ్‌కు మట్టి అంటే ప్రాణం. 30 ఏండ్లుగా మృత్తికను మాతృమూర్తిలా ఆరాధిస్తున్నాడు. మట్టి, ఇతర వ్యర్థాలతో కళాఖండాలు, పాత్రలు, రకరకాల అలంకార వస్తువులు, ఎకో ఫ్రెండ్లీ ఆభరణాలు తయారు చేస్తున్నాడు. పంచభూతాల్లో ఒకటైన మట్టితో పనిచేస్తున్నామంటే ప్రకృతిని ఆరాధిస్తున్నట్టే అని చెబుతాడు మన్‌ప్రీత్. ఎంబీఏ చదివిన అతను మార్కెటింగ్ రంగంలో ఉద్యోగం చేసేవాడు.
మట్టి కళాకృతుల తయారీ మీద ఆసక్తితో ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. ఢిల్లీలో పాటరీ నేర్పే సమ్మర్ క్యాంప్‌లో చేరాడు. కళకు సంబంధించిన మెలకువలన్నీ అక్కడే నేర్చుకున్నాడు. పదేండ్లు కష్టపడ్డాడు. కళపై పట్టు సాధించాడు. రంగు రంగుల పక్షి బొమ్మలు, సీతాకోకచిలుకలు, పూలు, ఆకులను సెరామిక్ పాటరీలో అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడు. ఆయన తీర్చిదిద్దిన ప్రతీ కళాఖండం చేతులతో రూపొందించినదే! ప్రస్తుతం తన స్టూడియోలో పర్యావరణం, పాటరీ గురించి ఉచితంగా క్లాసులు చెబుతున్నాడు మన్‌ప్రీత్.
చెత్తను ఇస్తున్నాం..
కోకాపేటలోని తన ఇల్లు, ఆర్ట్ స్టూడియో కూడా పరిశ్రమల వ్యర్థాలతో పర్యావరణహితంగా నిర్మించుకున్నాడు మన్‌ప్రీత్ సింగ్. సోలార్ విద్యుత్‌ను మాత్రమే ఉపయోగిస్తాడు. స్టూడియో పూర్తిగా జీరోవేస్ట్ జోన్. ‘చెత్తను సృష్టించడం సులభం. ఏదైనా వస్తువును పాడు చేయడం ఇంకా తేలిక. వ్యర్థాల నుంచి అర్థవంతమైన ఆకృతులు తయారుచేయడం కష్టమే కావచ్చు. కానీ, వ్యర్థాలను తగ్గించుకోవడం అసాధ్యమేం కాదు. మనకు కావల్సినవన్నీ ఇస్తున్న ప్రకృతికి చెత్తను ఇవ్వడం ఎంత వరకు సబబు?’ అని ఆవేశంగా ప్రశ్నిస్తాడు మట్టి మనిషి మన్‌ప్రీత్.