ఓ మనిషీ.. ఈ పరుగు ఎందుకోసం?వెతికే పనిలో మునిగిపోయి.. బతకటం మరిచిపోయావని,భవిష్యత్తు గురించిన చింతనలో వర్తమానాన్ని వదిలేశావని తెలుసుకో! ఎండమావుల వెంట పరుగు ఆపి.. ఒక్క నిమిషం అంతరంగం లోతుల్లోకి తొంగి చూడు. ఈ ప్రయాణం నీకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అది నీ జీవనగమనాన్నే సంపూర్ణంగా మార్చేస్తుంది.
ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో మనిషి పరుగు పెడుతున్నాడు. ఎక్కడికి చేరాలని పరితపిస్తున్నాడో అతనికే అర్థం కావటం లేదు. పరుగులు కొనసాగుతున్నాయి. లక్ష్యాలు దరి చేరుతున్నాయి. భౌతిక సుఖాలు కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. డబ్బు, హోదా, కీర్తి చేతికి అందుతున్నట్టే కనిపిస్తున్నాయి. కానీ, ఏదో తెలియని వెలితి. అంతరంగంలో పెరిగిపోతున్న శూన్యం. ఎందరు ఉన్నా.. ఎవరూ లేని ఏకాకితనం. ఒంటరిగా సాగే జీవనపోరాటం.
‘నిన్ను నువ్వు తెలుసుకో’ అని పురాతనమైన సూక్తి ఉంది. సోక్రటీస్ ప్రవచించిన ఈ సూత్రం డెల్ఫీలో ఉన్న టెంపుల్ అపోలో పైన ఆవిష్కృతమైంది. ఓ వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవటానికి, తన బలాలు, బలహీనతలు, ప్రేరణ కలిగించే అంశాలను అవగతం చేసుకోవటానికి కూడా అంతరంగంలోకి తొంగి చూడాలని సూచిస్తుందీ సూత్రం. సహజ స్వభావం అంతుచిక్కటానికి మేలైన మార్గమిది.
ఈ రకమైన స్వీయ అవగాహన లేకపోతే జీవితం వృథా. మీ భావోద్వేగాలు, ఆశలు, సామర్థ్యాలు, లక్ష్యాలు ఏమిటో మీకు తెలియాలి.
పైపైన తడిమి చూడటం కాకుండా మీ అంతరంగ ప్రపంచాన్ని పరిచయం చేసుకోవాలి. మీ పరిమితులు మీకు అర్థం కావాలి. మీ సామర్థ్యాలపైన ప్రత్యక్షంగా మీకు అవగాహన కలగాలి. ఎవరో నిర్దేశించిన విధంగా కాకుండా మీరు మీరులా జీవించటానికి ఇది ఉపయోగపడుతుంది.
మిమ్నల్ని మీరు తెలుసుకోకపోతే.. మీకు మీరు విలువ ఇచ్చుకోకపోతే.. జీవితంలో ఏం సాధించినా అది వ్యర్థమే! దీనిని ‘స్వీయ ప్రేమ’ అంటారు. స్వీయ ప్రేమ ఉన్న వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. తగినంత వ్యాయామం చేస్తారు. మంచి ఆహారం తీసుకుంటారు. నిద్రకు తగినంత సమయం వెచ్చిస్తారు. తమ వృత్తి వ్యాపార జీవితాల్లో రాణించటానికి ప్రయత్నించటమే కాదు. కుటుంబ బంధాలకు అమిత ప్రాధాన్యం ఇస్తారు. స్నేహితులకు తగినంత సమయం కేటాయిస్తారు. సంపూర్ణంగా జీవితాన్ని ఆనందించగలుగుతారు.
ఇవన్నీ ఒకటైతే.. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారో ఇతరుల ప్రభావం మీపైన తగ్గుతుంది. సమాజం నిర్దేశించిన పద్ధతిలో కాకుండా మీదైన కోణంలో ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటారు. విజయానికి మీ సొంత నిర్వచనాలను ఇచ్చుకోగలుగుతారు. మీ అభిరుచులకు ప్రాధాన్యం ఇవ్వటం, ఇష్టమైన హాబీలను పక్కన పెట్టకుండా వాటికి తగినంత సమయాన్ని వెచ్చించి మానసిక ఆనందాన్ని సొంతం చేసుకోగలుగుతారు.
ఇప్పుడు అభివృద్ధి, వేగం, టెక్నాలజీ అనే పదాలు ప్రతి నోటా వినపడుతున్నాయి. మొబైల్ అలారంతో మొదలయ్యే దినచర్య టార్గెట్లు, డెడ్ లైన్లు, మీటింగులతో ముగుస్తున్నది.ఉద్యోగాల్లో ఒక రకంగా, వ్యాపారాల్లో మరోరకంగా పోటీ.. యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నది. ఈ శబ్దాల మధ్య మౌనం చెవినపడక బతుకు భారం అవుతున్నది.
డబ్బు, పేరు ప్రఖ్యాతులు వంటివి విజయానికి కొలమానాలే. వాటిని ఎవరూ కాదనరు. కానీ, అవి ఎంత వరకూ సంతోషం, సంతృప్తికి కారణం అవుతాయా అనేది ప్రశ్న. బాహ్యంగా ఈ ‘వ్యాలిడేషన్’ కోసం వెంపర్లాడుతూ.. చివరికి అవి తమ అంతరంగ అవసరాలను తీర్చటం లేదనే వాస్తవం బోధపడి పరితపించిన సంపన్నులు, ప్రఖ్యాతి పొందిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. మరి ప్రాపంచికమైన ఈ విజయాలను కాదనుకుని ఏ అడవుల్లోనో ముక్కు మూసుకుని కూర్చోలేం కదా? లక్ష్యాలు, వాటి వెంట పరుగులు లేని జీవితం నిస్సారంగా ఉండటమే కాదు. అది నిరర్థకం కూడా!

ఒకప్పుడు జీవించేందుకు పనిచేసేవాళ్లు. ఇప్పుడు పనిచేసేందుకే జీవిస్తున్నారు అనటంలో అతిశయోక్తి లేదు. ఉద్యోగం ద్వారా కుటుంబాన్ని పోషించుకోవటానికి నెలనెలా వేతనం లభిస్తుంది. అంత కంటే ఎక్కువగా ఉద్యోగం వల్ల ఓ సామాజిక గుర్తింపు దొరుకుతుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఉద్యోగం రావటం ఎంత కష్టమో, దానిని నిలబెట్టుకోవటం అంత సవాలుగా మారుతున్నది. వేగంగా సాగుతున్న మార్పులు ఉద్యోగాల స్వభావాన్నే మార్చేస్తున్నాయి. భవిష్యత్తును ఏఐ లాంటి సాంకేతికత ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నది. రేపు ఏమవుతుంది? అన్న నిరంతర అభద్రత ఉద్యోగులలో కలవరం రేపుతున్నది. ఇతరులతో సమానంగా జీవించటానికి చేసిన అప్పులు గుదిబండలుగా మారుతున్నాయి. వచ్చే ఆదాయం కంటే కొన్ని రెట్ల అప్పులు ఉండటంతో ఉద్యోగంలో ఏ చిన్న కుదుపు వచ్చినా అది వాళ్ల జీవితాలనే తలకిందులు చేస్తున్నది.
ఉద్యోగం కోసం బతకటమా? బతకటం కోసం ఉద్యోగమా? అన్న ప్రశ్న తలెత్తుతున్నది. జీతం కోసం జీవితాన్ని తాకట్టు పెట్టక తప్పటం లేదు. వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి అవమానాలను భరించాల్సి వస్తున్నది. మార్కెట్లో పోటీ సరేసరి. ‘నువ్వు కాకపోతే ఇంకొకరు’ అన్న కంపెనీల స్వభావాలు ఉద్యోగులకు సవాలుగా మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దానికి తోడు భార్యభర్తల బంధాలు బలహీనమవుతున్నాయి. ఒకప్పుడు ఒకరికొకరు ఆసరాగా నిలిచేవాళ్లు. జంట ఎద్దుల మాదిరిగా బతుకుబండి కాడిని మోసేవాళ్లు. కష్టనష్టాలను సమంగా భరించేవాళ్లు.
తల్లిదండ్రులు, అత్తమామల భరోసాతో సమస్యలను సులువుగా అధిగమించేవాళ్లు. పిల్లలు కూడా తల్లిదండ్రులను అర్థం చేసుకునేవాళ్లు, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకునేవాళ్లు. ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయి. అంతా లెక్కలమయం ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు కుటుంబంలో ఘర్షణలకు, బంధాలు బీటలు వారటానికి కారణం అవుతున్నాయి.
పనిచేసేది కుటుంబం కోసమే అయినా.. వాళ్లకు తగినంత సమయం ఇవ్వలేకపోతున్నామన్న అసంతృప్తి కొందరిదైతే, మిగతా వాళ్లు తమ కంటే దర్జాగా, విలాసవంతంగా జీవిస్తున్నారని తాము మాత్రమే దయనీయమైన జీవితం గడుపుతున్నామన్న ఆవేదన మరికొందరిది. ఏతావాతా సంపాదనతో జీవితం సాఫీగా సాగుతుందని అనుకోలేకపోతున్నాం. సంతోషం లేకుండా పోయింది అని నిట్టూర్చే వాళ్లే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. బంధాలు జ్ఞాపకాలుగా మారుతున్నాయి. పండగలు సెలవులుగా మిగిలిపోతున్నాయి.
ఇక స్నేహాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అవసరాలే ఇందుకు ప్రాతిపదిక అవుతున్నాయి. సోషల్ మీడియాలో ‘నాకింత మంది స్నేహితులు ఉన్నార’ని చెప్పుకోవటానికి తప్ప వాటికి వేరే పరమార్థం ఉండటం లేదు. కేవలం వాట్సాప్ స్టేటస్లకే అవి పరిమితమవుతున్నాయి. ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు.. నీ కోసమే కన్నీరు నింపుటకు…’ తరహా స్నేహితులు దొరకటం దుర్లభంగా మారింది. ఈ పరిస్థితుల్లో మన జీవన సూత్రాలను మార్చుకోక తప్పదు.

బాగా డబ్బు ఉంటే సంతోషంగా ఉంటాం, సుఖంగా జీవిస్తాం అన్న అభిప్రాయం లేని వాళ్లు ఉండరు. ఈ అభిప్రాయం తప్పని అత్యంత సంపన్నులుగా, కుబేరులైన చాలామంది ఎన్నోసార్లు ప్రకటించారు. డబ్బు కూడబెట్టడం వల్ల సంతోషం కలగదు. దానిని సార్థకంగా ఉపయోగించమని ప్రబోధించారు. డబ్బు కంటే ఇతర విషయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వారెన్ బఫెట్, బిల్ గేట్స్, అజీమ్ ప్రేమ్ జీ లాంటి బిలియనీర్లు ఎందరో తమ సంపదలో సింహభాగాన్ని విద్య, ఆరోగ్యం, పర్యావరణం వంటి సామాజిక ధార్మిక కార్యక్రమాలకు వెచ్చించారు. కోట్లకు కోట్లు కూడబెట్టి తమ కుటుంబాలకు ఇవ్వటం తమ లక్ష్యం కాదని ఆచరణలో చూపించారు.
తన నికర ఆదాయంలో 99 శాతాన్ని దాతృత్వానికి వెచ్చించాలనే నియమాన్ని పాటిస్తూ వచ్చాడు వారెన్ బఫెట్. మొన్ననే తన 95వ ఏట బెర్క్ షైర్ హాత్ వే సంస్థ సీఈఓ పదవి నుంచి వైదొలిగాడు. ఈ సమయంలో కూడా ఇదే విధానాన్ని ఆచరించాడు. 1800 క్లాస్ ఏ షేర్లను, 2.7 మిలియన్ల క్లాస్ బీ షేర్లుగా మార్చి (వాటి విలువ 1.35 బిలియన్ డాలర్లు) వాటిని తన నాలుగు కుటుంబ సంస్థలకు అందించాడు. ఈ సందర్భంగా షేర్ హోల్డర్లకు తన చివరి ఉత్తరం రాస్తున్నట్టుగా చెప్పాడు.
బఫెట్ ప్రతి ఏటా చెప్పే పాఠాలు ఇన్వెస్టర్లకే కాదు… ప్రతి ఒక్కరికీ కర్తవ్యబోధ చేస్తాయి. ఆర్థిక అవగాహనను పెంచుతాయి. ‘మిస్టర్ మార్కెట్’ పేరుతో ఆయన మార్కెట్ వైఫల్యాలను అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో ఆచరించి చూపాడు. ఆయన ఏమంటారంటే…
ఇక వారసులకు కోట్లాది రూపాయలు కూడబెట్టి ఇచ్చిన వ్యక్తుల చరిత్ర కూడా ఏమంత ఆశాజనకంగా ఉండదు. అమెరికాలో అత్యంత సంపన్నులుగా నిలిచిన కొందరు బిలియనీర్ల కథలు చదివిననప్పుడు విచారం కలుగుతుంది. ఆస్తులన్నింటినీ విలాసాలకు తగిలేసి అప్పులు తీర్చలేక దివాళా తీసి రోడ్డున పడిన వాళ్లే ఉన్నారు. వారసత్వ ఆస్తి తమకు శాపం అని వాళ్లే స్వయంగా ప్రకటించారు. అవసరానికి తగినంత డబ్బు లేకపోవటం జీవితంలో నరకం. విపరీతమైన డబ్బు ఉండటం అంత కంటే ఎక్కువ నరకం.

మన అభిరుచులు, మనం నమ్ముకున్న విలువలకు ఆధారంగా మనం జీవితం సాగుతున్నదా? ఆయా పనులు మనతో మనం అలాగే ఇతరులతోనూ, చుట్టుపక్కల వారితోనూ అనుబంధం ఏర్పరచుకునేలా చేయగలుగుతున్నాయా? అనేది చూడాలి. దీని ప్రభావం పైకి కనిపించదు. కానీ, పరిస్థితులతో సంబంధం లేకుండా అంతులేని ఆనందం మీ సొంతమవుతుంది. ఇలా ‘ఫుల్ఫిల్మెంట్’పైన ఎప్పుడైతే దృష్టి సారించటం ప్రారంభిస్తారో, ఇతరులతో మీ సంబంధాల్లో గణనీయమైన మార్పు వస్తుంది. భయం, ఒత్తిడి, ఆందోళన లాంటివి మాయం అవుతాయి. అంతేకాదు, మీరు మరింత స్ఫూర్తిమంతంగా మారతారు. సృజనాత్మకంగా కూడా మీ ప్రతిభ కొత్త పుంతలు తొక్కుతుంది. మీ జీవితంలో అర్థవంతమైన లక్ష్యాలు ఉన్నాయని స్పృహ పెరుగుతుంది. వాటి సాధనలో ఓ స్పష్టమైన మార్గాన్ని ఏర్పరిచి ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఎప్పటికప్పుడు అంతరంగం నుంచి సూచనలు అందుతాయి.
బాహ్యమైన విజయాల నుంచి అంతరంగంలోకి దృష్టిని మళ్లించటం వల్లనే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఇందుకు మీరు కొద్ది సమయం కేటాయించుకుని ఆలోచించటం మొదలుపెట్టాలి. మీకు ప్రాధాన్యం ఉన్న అంశాలు, మీకు ఆనందం కలిగించే విషయాలు, మీ ఆలోచనలు, మీ ఉద్వేగాలు, మీ ప్రవర్తన, మీ ఇష్టాయిష్టాలు ఒక్కటేమిటి? మీ గురించిన స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోండి.
మీ పని హాయిగా కొనసాగటానికి, మిమ్మల్ని మీరు సవాలు చేసుకుని మరింతగా ఎదగటానికి.. మీకు నచ్చే వ్యాపకాలను మొదట గుర్తించాలి. ఇందులో కొత్తగా నేర్చుకోవటం, ఎదగటం, అభివృద్ధి దశలు ఉంటాయి. అవి వ్యక్తిగతంగా ఉన్నత స్థితికి చేరుస్తాయి. ఈ రకమైన కృషి చేయటం వల్ల మీకు విసుగు కూడా కలగదు.
మనం చేసిన అన్ని పనులు సత్ఫలితాలను ఇవ్వవు. మనం చేసే నిర్ణయాల వల్ల కొన్ని సార్లు వ్యతిరేకత వస్తుంది. జీవితంలో ఎదురుదెబ్బలు తగలొచ్చు. ఈ వైఫల్యాల వల్ల సొంత మనుషులు కూడా కొన్నిసార్లు దూరం కావచ్చు. కానీ, మీ మీద మీకు నమ్మకం సడలకూడదు. మీ పైన మీకు ప్రేమ తగ్గకూడదు. మీ సన్నిహిత స్నేహితుని మాదిరిగా మీతో మీరు వ్యవహరించాలి. ఈ రకమైన ‘సెల్ఫ్ కంపాషన్’ మిమ్నల్ని మరింత పతనం కాకుండా అడ్డుకోవటమే కాదు, భవిష్యత్తులో తిరిగి మీ కాళ్ల మీద మీరు నిలబడగలిగేలా చేస్తుంది. అందుకే మీ ‘బలాల’పైన పూర్తి నమ్మకాన్ని ఉంచండి.
దీనివల్ల మీరు మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ సంబంధాలు బలపడతాయి. మీ పూర్తి సామర్థ్యం మేరకు మీరు పనిచేయగలుగుతారు. వ్యక్తిగత ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఆత్మగతంగా కాకుండా మీకు, మీ అంతరంగానికి దృఢమైన బంధం ఏర్పడుతుంది. గత వైఫల్యాలను, నిరాశలను జయించగలిగే స్థితికి చేరుకుంటారు. సవాళ్లను ఎదుర్కోగల ఆత్మవిశ్వాసాన్ని సంతరించుకుంటారు.
జీవితంలో అసలు లక్ష్యం అంటూ లేకపోవటం, దానిని సాధించే ప్రయత్నంతో పని లేకపోవటం అంత నిరర్థకమైన బతుకు మరొకటి ఉండదు. ఒక ఆశయం, దానికోసం ప్రయాస పడటం, విజయం లేదా వైఫల్యం అందుకోవటం.. తర్వాత మరో లక్ష్యం.. మరో ప్రయత్నం.. మరో ఫలితం.. ఇవి మానవ జీవితపు చైతన్య ప్రయాణం. ఇదే కర్మయోగం.
డిటాచ్మెంట్ అంటే వైరాగ్యం కాదు. భావోద్వేగాలపరంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవటం. స్వేచ్ఛను అన్వేషించటం. వ్యక్తుల పైన, వస్తువులపైన ఫలితాలపైన అతిగా మోహాన్ని పెంచుకోకుండా ఆరోగ్యకరమైన సమన్వయాన్ని పెంచుకోవటం. ఇందుకోసం వర్తమానంలో జీవించటం అలవాటు చేసుకోవాలి. ఆలోచనలను, ఉద్వేగాలను నిరంతరం గమనిస్తూ వాటితో సాన్నిహిత్యం కోల్పోవటాన్ని అభ్యాసం చేయాలి. ఈ అనుభవాలను రికార్డు చేసుకోవటం వల్ల కొంత కాలానికి నిర్మోహత్వం అలవడి తీరుతుంది.
డబ్బు మనస్తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోండి. మీ లక్ష్యాల సాధనకు దానిని ఒక ఉపకరణంగా చేసుకుని ఎదగటానికి ప్రయత్నించండి. అంతే తప్ప సమాజంలో ఇతరులతో పోటీకి దిగకండి. భౌతికమైన ఆస్తులను కొనుగోలు చేస్తూ ఇతరులను ఆకర్షించాలని ప్రయత్నిస్తూ పోతే.. మీరు ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. పొదుపు, పెట్టుబడి దాని ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం పొందటం గురించి నేర్చుకోండి.
పోలిక ఎప్పుడూ చేటు తెస్తుంది. మీ కంటే అధికులను చూసినప్పుడు తక్కువ వాళ్లమన్న భావనకు లోనుకావటం ఎంత తప్పో, మీ కంటే తక్కువ వాళ్లను చూసినప్పుడు గర్వంతో వ్యవహరించటం కూడా అంతే తప్పు. మీరు మీతో పోటీపడటం అలవాటు చేసుకోండి. నిన్నటి కంటే ఈ రోజు, ఈ రోజు కంటే రేపు గొప్పగా ఉండేలా చూసుకోండి. మీరు ఎంచుకున్న రంగంలో విజయ సాధకుల నుంచి స్ఫూర్తి పొందండి.
‘నెగెటివ్ పీపుల్’ చాలా ప్రమాదకారులు. కర్ణుడు ఓటమిపాలు కావటంలో శల్యుని పాత్ర ఏమిటో తెలిసిందే! ఇలాంటి‘శల్యులు’ పక్కన లేకుండా చూసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరి అంతరంగంలో ఓ స్వరం తరచూ వెనక్కి లాగుతూ ఉంటుంది. భయపెడుతూ ఉంటుంది. ఆ హెచ్చరికలను జాగ్రత్తగా గమనించాలి. అవి సహేతుకమా? కేవలం భయాలా? అనేది పరిశీలించుకుని అవసరమైతే దాని గొంతు నొక్కేయాలి.
మనిషి ఆర్థికంగా ఎదగడం ఎంత ముఖ్యమో.. అతని వ్యక్తిత్వం పరిపుష్ఠం కావడమూ అంతే అవసరం. మధుర స్మృతులు ఎలాగైతే మనల్ని వదలవో.. చేదు జ్ఞాపకాలూ వెంటాడుతూ ఉంటాయి. మంచి-చెడు రెండు జ్ఞాపకాలనూ నెమరువేసుకోవడం అవసరమే! కానీ, వాటిని తలుచుకొని పొంగిపోవడం, విసిగి వేసారడం రెండూ కరెక్ట్ కాదు. ఆ రోజు అంత ఆనందంగా ఉండటానికి, మరోసారి అంతలా చేదును దిగమింగడానికి కారణాలను అన్వేషిస్తే.. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలిసిపోతుంది. గత అనుభవాలు నేర్పే పాఠాలే మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. చేసిన తప్పులు చేసుకుంటూ పోతానంటే కుదరదు.
కొత్త తప్పులు చేయడం తప్పు కాదు అనుకోవద్దు. ఎందుకంటే, ఒక్కోసారి చిన్నతప్పే.. పెద్ద ముప్పునకు దారితీయొచ్చు. కోరి తప్పులు చేయకపోవచ్చు. కానీ, మనలోని బలమైన కోరిక తెలియకుండానే ఏదైనా తప్పు చేయించే అవకాశం ఉంటుంది. దేని వెనకో పరిగెడుతూ ఉన్నప్పుడే ఇలాంటి వాటికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి, ‘పరిగెత్తి పాలు తాగడం కన్నా.. నిలబడి నీళ్లు తాగడం మిన్న’ అన్న మన పెద్దల మాట గుర్తుంచుకుంటే మంచిది.

ప్రతి ఒక్కటీ మీ నెత్తిన పెట్టుకోకండి. మొహమాటాలకు దూరంగా ఉండటం, ఇతరులకు ‘నో’ చెప్పటం వంటివి అలవాటు చేసుకుంటే, అనవసర ఇబ్బందులు మీ దరికి చేరవు. మీ పని ప్రాధాన్యాల గురించి స్నేహితుల దగ్గర బహిరంగంగా చెప్పగలిగినప్పుడు చాలా వరకూ సమస్యలను ఎదుర్కొవటం సులువవుతుంది.
మీ జీవితంలో సానుకూల విషయాలను నెమరువేసుకున్నప్పుడు తెలియకుండానే మీకు సంతోషం, స్ఫూర్తి కలుగుతాయి. అందుకు కారణమైన పరిస్థితులను తలచుకోండి. ఆయా వ్యక్తులకు మనసారా ధన్యవాదాలు చెప్పటం అలవాటుగా మార్చుకోండి. ఇది మీకు ఊహించనన్ని లాభాలను తెచ్చిపెడుతుంది. విశ్వం మీ అభివృద్ధికి బాటలు పరుస్తుంది.

మీ లక్ష్యాలకు తగిన విధంగా నెలవారీ, వారం వారం, రోజువారీ ఇలా ప్రణాళికలు వేసుకోవటం వల్ల మీ పని విభజన, సమయపాలన సాధ్యం అవుతుంది. ఫలితాల కోసం అంతగా ఆందోళన చెందవలసిన పని ఉండదు.
ఒత్తిడి శారీరకంగానూ, మానసికంగానూ తీవ్రప్రభావం చూపుతుంది. దాన్ని జయించటం వల్ల ఉత్పాదకత మెరుగుపడుతుంది. గాఢంగా నాలుగు సెకండ్ల పాటు శ్వాస పీల్చి, నాలుగు సెకండ్ల పాటు అలాగే నిలిపి ఉంచండి. ఆ తర్వాత నాలుగు సెకండ్ల పాటు విడిచి పెట్టండి. సులువైన ఈ ప్రక్రియను ఆచరించటం వల్ల శరీరం, మనసు ఒక్కసారిగా ప్రశాంతతను అందుకుంటాయి.
అలాగే ధ్యానాన్ని దినచర్యలో భాగం చేసుకోండి. రోజులో కొద్ది సమయం అంటే కనీసం పావుగంట సేపు అయినా ధ్యానమగ్నులై ఉండండి. క్రమం తప్పకుండా ధ్యానం చేసినప్పుడే దాని ఫలితాలు అందుతాయి. భౌతికమైన ఒత్తిడిని జయించటానికి ‘మజిల్ రిలాక్సేషన్’ ఉపయోగపడుతుంది.